
మాట్లాడుతున్న డీఎస్పీ జీవన్‌రెడ్డి
● డీఎస్పీ జీవన్‌రెడ్డి
నిర్మల్‌టౌన్: సోషల్ మీడియాలో ప్రార్థన స్థలాలు, దేవాలయాలపై రెచ్చగొట్టే పోస్టులు పెట్టి, అసత్య ప్రచారాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని నిర్మల్ డీఎస్పీ జీవన్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి, రంజాన్ పండుగపై ఉత్సవ కమిటీలతో మంగళవారం వేర్వేరుగా శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ.. ముఖ్యంగా శ్రీరామనవమి ర్యాలీ, హనుమాన్ జయంతి ర్యాలీ, రంజాన్ పండుగలను మతసామరస్యంతో స్నేహపూర్వకంగా జరుపుకోవాలని సూచించారు. ఎవరూ సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు, వివిధ పోస్టులను నమ్మి ఆవేశాలకు లోనై శాంతి భద్రతలకు భంగం కలిగించొద్దని తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పట్టణ సీఐ మల్లేశ్, శ్రీరామనవమి ఉత్సవ సమితి సభ్యులు, ముస్లిం మతపెద్దలు పాల్గొన్నారు.