
బంజారాలతో కలిసి నృత్యం చేస్తున్న ఐకేరెడ్డి
మామడలో అభివాదం చేస్తున్న మంత్రి, నాయకులు
మామడ:సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మామడ మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను సీఎం కేసీఆర్ ఎత్తి చూపడంతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణంతో సాగు పెరిగి దిగుబడులు పెరిగి రైతులు సంతోషంగా ఉన్నారని వివరించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్, రైతుబీమా, రైతుబంధు వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తూ రైతుకు అండగా నిలిచిందన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, దళితబంధు, ఆసరా ఫించన్లు అందిస్తున్నామని వివరించారు. హైలెవల్ కెనాల్ నిర్మాణం పూర్తి చేసి మామడ మండలంలోని గుట్టల మీది గ్రామాలకు సాగునీరు అందిస్తామని తెలిపారు.
సిలిండర్ ధరలు పెంచుతూ పేదలపై భారం..
కేంద్ర ప్రభుత్వం సిలిండర్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ పేదలను ఇబ్బంది పెడుతోందని, భారం మోపుతోందని మంత్రి ఆరోపించారు. రాష్ట్రంలో అకాల వర్షాలకు నష్టం జరిగినా కేంద్రం నష్టపరిహారం అందించలేదని, రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇస్తుందని తెలిపారు.
పొన్కల్ మండలం కోసం కృషి..
మండలంలోని అతిపెద్ద గ్రామపంచాయతీ పొన్కల్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని మండల సాధన సమితి నాయకులు మంత్రి ఐకేరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన మంత్రి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పొన్కల్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం
నిధులు ఇవ్వడం లేదు
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
