
నిర్మల్ లో సమ్మె నోటీసు అందజేస్తున్న వీవోఏలు
నిర్మల్‌చైన్‌గేట్/కుంటాల: పనిభారంతో సతమతమవుతున్నా.. సహనంతో సేవలందిస్తున్నా.. ప్రభుత్వం ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ల(వీవోఏ)ను పట్టించుకోవడం లేదు. డ్వాక్రా సంఘాలు ఏర్పడిన తొలినాళ్ల నుంచి నేటికీ వారికి గౌరవ వేతనం చెల్లించడం లేదు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ.10 వేల వేతనం చెల్లించాలని, తమ సమస్యలు పరిష్కరించాలని జిల్లాలోని వీవోఏలు ఈనెల 25న సమ్మె చేశారు.
స్వయం సహాయక సంఘాల సమన్వయంలో కీలకం..
స్వయం సహాయక సంఘాలను క్షేత్రస్థాయిలో సమన్వయం చేయడంలో వీవోఏల పాత్ర కీలకం. సభ్యుల్లో క్రియాశీలకంగా ఉన్న ఒకరిని ఎంపిక చేసి ఈ బాధ్యతలు అప్పగిస్తారు. పొదుపు సంఘాల కార్యకలాపాల్లో పనిచేసే వీవోఏ, పట్టణ రిసోర్స్ పర్సన్(ఆర్పీ)లకు ప్రతినెలా చెల్లించే గౌరవ వేతనం తక్కువగా ఉంది. పొదుపు సంఘాల్లో ఎక్కువగా నిరక్షరాస్యులు కావడంతో ఆర్థిక లావాదేవీలు, నెలవారీ సమావేశాలు తీర్మానాలు తదితర అంశాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయడం, బ్యాంకు అధికారులతో మాట్లాడి పొదుపు సంఘాలకు రుణాలు ఇప్పించడం వీవోఏలు, ఆర్పీలు నిర్వహిస్తుంటారు. కొత్త సంఘాల ఏర్పాటు, దివ్యాంగుల సంఘాల ఏర్పాటు, చిన్న సంఘాల బుక్స్ రాయడం, సమావేశాలు, సర్వసభ్య సమావేశాలు నిర్వహించడం, బ్యాంకు, సీ్త్రనిధి రుణాల మంజూరు, మొబైల్ డేటా ఎంట్రీ, సభ్యుల ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్‌లను సరిచేయడం, సేంద్రియ, సుస్థిర వ్యవసాయం, జాతీయ గ్రామీణ జీవనోపాధులు, ఆరోగ్య పోషణ, నిరుద్యోగులను గుర్తించి, జాబ్ మేళాలో ఉపాధి కల్పించడం తదితర విధులను నిర్వర్తిస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
టార్గెట్ చేరుకుంటేనే జీతం...
పొదుపు సంఘాలకు సంబంధించిన పనులు, పుస్తకాలు రాయడం, మినిట్స్ బుక్స్, వేలిముద్రలు తీసుకోవడం, ఆన్లైన్‌వర్క్ అప్‌లోడ్ చేయడం ఇలా అదనపు పనిభారాన్ని వీవోఏలపై మోపుతున్నారు. నయాపైసా ఇవ్వకుండా ఏళ్లుగా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైపెచ్చు ఇచ్చిన టార్గెట్లు పూర్తి చేసిన వారికి మాత్రమే జీతాలు.. మిగతా వారికి నిరాశే ఎదురవుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వీరి సేవలను అధికారులు వినియోగించుకుంటున్నారు.
రూ.3,900 గౌరవ వేతనం..
జిల్లాలో మొత్తం 504 మంది వీవోఏలు ఉన్నారు. వీరు 11,982 స్వయం సాహాయక సంఘాలు, 1,33,970 మంది సభ్యులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వందశాతం ఆన్‌లైన్ వర్క్ పూర్తి చేసిన వారికి ప్రభుత్వం నెలకు కేవలం రూ.3,900 గౌరవ వేతనం చెల్లిస్తుంది. పేదరికంలో ఉన్న మహిళలను 20 ఏళ్లుగా పోగుచేసి సంఘాలు ఏర్పాటు చేసిన ఐకేపీ వీవోఏలకు ప్రభుత్వం గౌరవ వేతనం సక్రమంగా చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఈనెల 27 నుంచి సమ్మె బాట పట్టారు. డీఆర్డీవోతోపాటు ఏపీఎంలకు నోటీసులు అందించారు.
డిమాండ్లు ఇవీ..
● సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి.
● కనీస వేతనం రూ.26 వేలు,
● రూ.10 లక్షల సాధారణ బీమా సౌకర్యం కల్పించాలి.
● ఆన్‌లైన్ పనులు రద్దుతోపాటు సెర్ప్ నుంచి ఐడీ కార్డులు ఇవ్వాలి.
● మహిళా సంఘాల సభ్యులకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలి.
● సంఘాలకు బ్యాంక్ వీఎల్‌ఆర్ డబ్బులు ఇవ్వాలి.
సేవలందిస్తున్నా వేతనాల్లేవ్..
పనిభారంతో సతమతం
సమస్యలు పరిష్కరించాలని ఆందోళనలు
వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్
సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి..
20 ఏళ్లుగా మహిళా సంఘాల అభివృద్ధికి పాటుపడుతున్నాం. ప్రభుత్వం కనీస గౌరవ వేతనం ఇవ్వడం లేదు. ఐకేపీ వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలి. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి.
– సాయన్న, వీవోఏ
వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి
నిత్యం స్వయం సంఘాల మహిళల బలోపేతానికి కృషి చేస్తున్నాం. మహిళలకు రుణాలు ఇప్పించడంతోపాటు పొదుపుపై అవగాహన కల్పించి వాటిని చెల్లించేలా చర్యలు చేపడుతున్నాం. 20 ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నాం. కనీస వేతనాలు చెల్లించి వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించాలి.
– జయశీల, వీవోఏల
సంఘం జిల్లా అధ్యక్షురాలు
సమస్యలు పరిష్కరించాలి
ఐకేపీ సంఘాల్లో కీలకంగా విధులు నిర్వహిస్తున్న వీవోఏల సమస్యలు ప్రభుత్వం పట్టించుకోవాలి. ఎన్నో ఏళ్లుగా తక్కువ వేతనానికి పని చేస్తున్నాం. ప్రస్తుతం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు పెంచాలి. – గోదావరి, వీవోఏ

