రాష్ట్రపతిలాగా కాదు.. భారత ఉపరాష్ట్రపతికి జీతం ఎంతో తెలుసా? అధికార నివాసం కూడా ప్రత్యేకం

Vice President of India: Salary Allowances Pension Tenure Details - Sakshi

ఢిల్లీ: మన దేశంలో అత్యున్నత పదవి రాష్ట్రపతి. రాజ్యాంగబద్దంగా భారతదేశ రెండో అత్యున్నత పదవి.. ఉపరాష్ట్రపతి. అయితే రాష్ట్రపతిలా ఆమోద ముద్రలు, ఇతర నిర్ణయాలకు పరిమితం కాలేదు ఉపరాష్ట్రపతి. పార్లమెంట్‌లో రాజ్యసభ బాధ్యతలను పూర్తిగా చూసుకునే చైర్మన్‌ హోదా ఉంటుంది. అలాంటిది ఉపరాష్ట్రపతి జీత భత్యాలు, భారత ప్రభుత్వం నుంచి అందే సౌకర్యాలు, పెన్షన్‌, ఇతర సదుపాయాలు.. ఎలా ఉంటాయో తెలుసా?..

 ఉపరాష్ట్రపతికి శాలరీస్‌ అండ్‌ అలవెన్సెస్‌ ఆఫ్‌ పార్లమెంట్‌ ఆఫీసర్స్‌ యాక్ట్‌ 1953 ప్రకారం.. జీతభత్యాలను చెల్లిస్తారు. ఎందుకంటే.. రాజ్యసభకు ఆ వ్యక్తి చైర్మన్‌(ఎక్స్‌ అఫీషియో)గా వ్యవహరించాల్సి ఉంటుంది కాబట్టి. అందుకే స్పీకర్‌లాగే ఉపరాష్ట్రపతికి జీతం, ఇతర బెనిఫిట్లు అందుతాయి. 

► ఉపరాష్ట్రపతి జీతం.. అక్షరాల నాలుగు లక్షల రూపాయలు. ఇవి కాకుండా రకరకాల అలవెన్స్‌లు అందుతాయి. 2018 వరకు 1లక్ష25వేల రూపాయలుగా ఉండేది. ఆ దఫా బడ్జెట్‌లో మార్పుల మేరకు జీతం పెరిగింది.

► డెయిలీ అలవెన్స్‌, ఉచిత వసతి, మెడికల్‌ కేర్‌, ట్రావెల్‌, ఇతరత్రాలు అందుతాయి. పదవి నుంచి దిగిపోయాక.. సగం జీతం పెన్షన్‌గానూ అందుతుంది. 
  
► ఉపరాష్ట్రపతికి భద్రతా, సిబ్బంది వాళ్ల వ్యక్తిగతం. అధికారిక కార్యక్రమాల సమయంలో మాత్రం సంబంధిత కేంద్ర, ఆయా రాష్ట్రాల తరపున సిబ్బంది భద్రత కల్పిస్తారు. 

► రాష్ట్రపతి లేని సమయంలో ఉపరాష్ట్రపతి.. రాష్ట్రపతి బాధ్యతలను నిర్వహిస్తారు. ఆ సమయంలో రాష్ట్రపతికి అందే జీతం, ఇతర బెనిఫిట్స్‌ ఉపరాష్ట్రపతికి అందుతాయి. అంతేకాదు రాష్ట్రపతి అందుకునే అన్ని సౌకర్యాలు ఉంటాయి. 


ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ప్రధాని, రాజ్యసభ సభ్యులు మన్మోహన్‌ సింగ్‌

► రిటైర్‌మెంట్‌ తర్వాత.. పెన్షన్‌తో పాటు మరికొన్ని బెనిఫిట్స్‌ మాజీ ఉపరాష్ట్రపతులకు ఉంటాయి. 

► ఉపరాష్ట్రపతి ఐదేళ్లపాటు పదవిలో ఉంటారు. ఉపరాష్ట్రపతిగా ఓ వ్యక్తిని ఎన్నిసార్లైనా ఎన్నుకోవచ్చు. 

► ఒకవేళ ఉపరాష్ట్రపతి లేని టైంలో రాజ్యసభ వ్యవహారాలను డిప్యూటీ చైర్మన్‌ చూసుకుంటారు. 

► రాష్ట్రపతి పదవిలో ఉన్న ఓ వ్యక్తి మరణిస్తే.. ఉపరాష్ట్రపతి ఆ బాధ్యతలను చేపడతారు. అయితే అది ఆరునెలల వరకే. అంటే తాత్కాలిక రాష్ట్రపతిగా అన్నమాట. ఆలోపు కొత్త రాష్ట్రపతిని ఎన్నుకోవాలి. 

► 35 ఏళ్ల వయసు ఉండాలి. లాభదాయకమైన పదవులు అనుభవిస్తున్న వారు అనర్హులు. భారతీయ పౌరసత్వం ఉన్న ఎవరైనా సరే ఉపరాష్ట్రపతి పోటీకి అర్హులు. అయితే రాజకీయ పార్టీల ప్రాబల్యంతో.. పార్లమెంట్‌ అంతర్గత వ్యవహారంగానే మారింది ఉపరాష్ట్రపతి ఎన్నిక.

► 1962 నుంచి న్యూఢిల్లీలోని నెంబర్‌ 6, మౌలానా ఆజాద్‌ రోడ్‌లోని  అధికారిక నివాసాన్ని ఉపరాష్ట్రపతి కోసం ఉపయోగిస్తోంది భారత ప్రభుత్వం. ఆరున్నర ఎకరాల్లో ఉంటుంది ఉపరాష్ట్రపతి భవన్‌ కాంపౌండ్‌. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌ గనుక పూర్తైతే.. అందులో ఉపరాష్ట్రపతికి శాశ్వత భవనం కేటాయించాలని ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

► భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 66 ప్రకారం.. ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. పార్లమెంట్‌ ఉభయ సభల్లోని సభ్యుల ఓట్లు.. విజేతను నిర్ణయిస్తాయి. ఎన్నికల సంఘం సీక్రెట్‌ బాలెట్‌ ద్వారా ఎన్నిక నిర్వహిస్తుంది.

ఐదేళ్ల పదవీకాలం. రాజ్యసభ పూర్తి మెజారిటీతో ఆమోదించిన తీర్మానం, సాధారణ మెజారిటీతో లోక్‌సభ తీర్మానం ద్వారా ఉపరాష్ట్రపతిని తొలగించవచ్చని భారత రాజ్యాంగం పేర్కొంది. రాజ్యసభకు అర్హత ప్రమాణాలను నెరవేర్చనందుకు మరియు ఎన్నికల అవకతవకలకు పాల్పడినందుకు ఉపరాష్ట్రపతిని సుప్రీంకోర్టు కూడా తొలగించవచ్చు . 

ఇదీ చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top