తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల 2026 ఫలితాలు.. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీశాయి. విజయ్ నేతృత్వంలోని తమిళ వెట్రి కగళం 108 స్థానాలు గెలిచింది. అయితే, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సరిపడా మెజారిటీ లేకపోవడంతో ఇతర పార్టీల మద్దతు అవసరం పడింది. ఈ నేపథ్యంలో విజయ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు తీసుకోబోతున్నారనే ప్రచారం ఊపందుకుంది.
తమిళనాడు సీనియర్ నేత, విజయ్‌కు కుడి భుజంగా పేరున్న సెంగొటియన్ నిన్నంతా కాంగ్రెస్ నేతలతో మంతనాలు జరిపారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలోకి రాకూడదనేది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఈ తరుణంలో విజయ్ ఏర్పాటు చేయబోయే సర్కార్ మద్దతు ప్రకటించాలనే యోచనతోనే హస్తం పార్టీ ఉన్నట్లు సమాచారం. అయితే ఇది మిత్రపక్షం డీఎంకేతో రాజకీయ ఘర్షణలకు కారణమయ్యేలా కనిపిస్తోంది.
తమిళనాడు ఎన్నికల్లో సెక్యులర్ ప్రొగ్రెసివ్ అలయన్స్ పేరిట డీఎంకే కూటమి పోటీ చేసింది. అయితే సీట్ల పంపకాల దగ్గరి నుంచి కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలతో డీఎంకేకు విబేధాలు మొదలయ్యాయి. 28 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్.. ఐదు చోట్ల నెగ్గింది. మరిన్ని ఎక్కువ స్థానాలు కేటాయించి ఉంటే ఎక్కువ సీట్లు గెలిచి ఉండేవాళ్లమని రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్, కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదించింది.
ఈ నేపథ్యంలో.. నిన్న ఓటమి తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ కూటమి సమావేశం నిర్వహించారు. అయితే ఆ సమావేశానికి కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ఆ పార్టీ నేతలు విడిగా సమావేశమై టీవీకేతో జట్టు కలిసే అంశంపై చర్చించారు. ఇది డీఎంకేకు మరింత కోపం తెప్పించింది. కాంగ్రెస్ వైఖరిని వెన్నుపోటుగా అభివర్నిస్తూ డీఎంకే ప్రతినిధి శరవణన్ అన్నాదురై మండిపడ్డారు.
The Backstabbers.
— Saravanan Annadurai (@saravofcl) May 5, 2026
No.
DMK does not endorse the support of INC to TVK.
It was their unilateral decision.
The Backstabbers. https://t.co/DPPW3caNio— Saravanan Annadurai (@saravofcl) May 6, 2026
ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ టీవీకేకు మద్దతు ఇచ్చేందుకే సిద్ధమైంది. హైకమాండ్ రాష్ట్ర యూనిట్‌కు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడంతో ఇవాళ ఆ పార్టీ కీలక సమావేశం నిర్వహించబోతోంది. మరోవైపు.. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు కూడా ఇదే బాటలో పయనించాలని నిర్ణయించాయి. దీంతో ఇవాళో, రేపో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్ 5, వామపక్షాలు 4(సీపీఐ, సీపీఎం చెరో రెండు) కలిపితే తొమ్మిది స్థానాలు అవుతాయి. మరొక స్థానం తక్కువ అయ్యింది. డీఎంకే కూటమిలోని విడుదల చిరుతైగల్ కట్చి(వీసీకే) ఎట్టి పరిస్థితుల్లో విజయ్‌కు మద్దతు ఇవ్వమని ప్రకటించింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) కూడా పొత్తునకు ససేమీరా అనేసింది.
అయితే దివంగత విజయ్‌కాంత్ పార్టీ డీఎండీకే మద్దతు లభించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పార్టీ తరఫున 1 స్థానం గెలుచుకోగా.. విజయ్ తన బిడ్డలాంటోడంటూ విజయ్‌కాంత్ సతీమణి ప్రేమలత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తమిళనాడు ఫలితాలతో డీఎంకే కుదేలు అయ్యింది. ఇప్పుడు కాంగ్రెస్, ఇతర మిత్రపక్షాలు టీవీకేకు మద్దతు ప్రకటిస్తే అది మరో దెబ్బ కానుంది.


