Farmer's protest: తిక్రి శిబిరం దగ్గర మరో ఘటన.. బాధితురాలి ట్విస్ట్‌

Tikri Molestation Survivor Legal Notices To Twitter And Media Channels - Sakshi

ఢిల్లీ-తిక్రి సరిహద్దులో రైతుల దీక్షా శిబిరం వద్ద ఓ యువతి గ్యాంగ్‌రేప్‌నకు ఘటన మరిచిపోక ముందే.. మరో యువతిపై లైంగిక దాడి జరిగిందన్న వార్తలు ప్రకంపనలు పుట్టించాయి. అయితే ఈ వ్యవహారంలో పోలీసుల కంటే నెటిజన్స్‌, మీడియా జోక్యం అతికావడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఈ తరుణంలో బాధితురాలు మీడియాకు ఒక బహిరంగ ప్రకటనను రిలీజ్‌ చేసింది. తనపై అసలు అత్యాచారం జరగలేదని, కొన్ని మీడియా ఛానెల్స్‌ పనిగట్టుకుని తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని ఆమె వాపోయింది.  

న్యూఢిల్లీ: తనపై అత్యాచారం జరగలేదని, కేవలం అల్లరి మాత్రమే పెట్టారని సదరు బాధితురాలు ఒక స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేసింది. బాధితురాలి వివరణ ప్రకారం.. పంజాబ్‌కి చెందిన 29 ఏళ్ల యువతి చార్టెర్డ్‌ అకౌంటెంట్‌ పనిచేస్తోంది. రైతుల ఉద్యమానికి మద్ధతుగా ఆమె తిక్రి శిబిరం వద్ద ఉన్న.. పిండ్‌ కాలిఫోర్నియా క్లినిక్‌ షెల్టర్‌లో సేవలు అందించడానికి వెళ్లింది. ఆ టైంలో ఆ షెల్టర్‌లోనే పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తులు ఆమెపై అసభ్యంగా కామెంట్లు చేశారు. ఈ విషయాన్ని ఆమె షెల్టర్‌ నిర్వాహకుడు డాక్టర్‌ స్వాయిమాన్‌ దృష్టికి తీసుకెళ్లింది కూడా.

వక్రీకరించిన అకౌంట్‌
తనకు ఎదురైన చేదు అనుభవాన్ని మే 29న తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె పోస్ట్‌ చేయగా.. సందీప్‌ సింగ్‌ అనే జర్నలిస్ట్‌ ఆమెకు ఎలాంటి సాయం అందలేదంటూ తన ట్విట్టర్‌లో ఒక పోస్ట్‌చేశాడు. అయితే జూన్‌4న శివాని ధిల్లాన్‌ అనే యువతి పేరుతో ఉన్న ట్విట్టర్‌ అకౌంట్‌ నుంచి పలు కోణంలో ఈ ఘటనపై కథనాలు పబ్లిష్‌ అయ్యాయి. బాధితురాలు చెప్పని విషయాలన్నింటిని చేర్చి.. ఆ అకౌంట్‌ నుంచి వరుసగా పోస్టులు పడ్డాయి. రైతుల దీక్ష ముసుగులో విద్రోహ శక్తులు ఒక అమాయకురాలిపై దాష్టీకానికి పాల్పడ్డాయని, బాధితురాలికి న్యాయం జరగాల్సిన అవసరం ఉందని ఆమె అందులో ఆవేదన వ్యక్తం చేసింది. ఇక్కడి నుంచి మొదలైన వ్యవహారం చిలికి చిలికి మీడియాకు చేరి.. ‘తిక్రి దగ్గర మరో ఘోర అఘాయిత్యం’ అనే క్యాప్షన్‌తో కథనాలు ప్రసారం అయ్యేలా చేసింది.

ట్విటర్‌కు, మీడియాకు నోటీసులు
ఈ వ్యవహారంలో బాధితురాలు ముందుగా ట్విటర్‌కు నోటీసులు పంపింది. శివాని పోస్ట్‌ చేసిన పోస్టులు ఫేక్‌ అని, వాటిని తొలగించాలని జూన్‌ 17న పంపిన నోటీసులో ఆమె ట్విటర్‌ను కోరింది. ఇక ఓ వెబ్‌సైట్‌ తిక్రి దగ్గర మరో అత్యాచారం పేరిట కథనం ప్రచురించిందని, ఆ వెంటనే రెండు ప్రముఖ న్యూస్‌ఛానెల్స్‌ కూడా ఆ కథనాన్ని ప్రచురించాయని బాధితురాలు వాపోయింది. ‘‘నన్ను సంప్రదించకుండా.. జర్నలిజం విలువలు వదిలేసి సిగ్గులేకుండా కథనాలు ప్రచురిస్తారా?. రైతు దీక్షను భగ్నం చేయాలనే మీ ప్రయత్నంగా ఇది అనిపిస్తోంది’’ అని బాధితురాలు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరుణంలో ఆ కథనాలు తొలగించడంతో పాటు.. తనకు క్షమాపణలు చెప్పాలని రెండు ప్రముఖ న్యూస్‌ ఛానెల్స్‌కు సైతం లీగల్‌ నోటీసులు పంపింది.

ఇక పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ యువతిపై తిక్రి శిబిరం వద్ద లైంగిక దాడి జరిగిందనే ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఏప్రిల్‌లో ఈ ఘటన జరగ్గా.. బాధితురాలికి కరోనా సోకి మృతి చెందింది. అయితే ఆమె తండ్రి ఫిర్యాదు నేపథ్యంలో ఆరుగురు అనుమానితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు. మరోవైపు ఈ ఘటనపై నిజనిర్ధారణలతో ఒక నివేదిక సమర్పించాలని ఝజ్జర్‌(హర్యానా) ఎస్పీని ఇదివరకే జాతీయ మానవహక్కుల సంఘం ఆదేశించింది కూడా.

చదవండి: వ్యాక్సిన్‌తో సెక్స్‌ సామర్థ్యం తగ్గుతోందా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top