చెన్నై: తమిళ రాజకీయాల్లోకి సినిమాటిక్ ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ విజయ్.. తన భారీ హామీలతో ప్రజలను అమితంగా ఆకర్షించారు. అయితే ఆయన ఇచ్చిన ‘బంగారం, పట్టుచీరలు’, ఉచిత పథకాల వాగ్దానాలను నెరవేర్చాలంటే రాష్ట్ర ఖజానాకు ఏటా సుమారు రూ. లక్ష కోట్లు అవసరం అవుతాయని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
ఇప్పటికే రూ.10.71 లక్షల కోట్ల అప్పుల పర్వతం కింద ఉన్న తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న విజయ్‌కు తాను ఇచ్చిన హామీలే సవాల్‌గా మారనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అంచనాల ప్రకారం, 2025-26 ఆర్థిక సంవత్సరానికి తమిళనాడు మొత్తం ఆదాయం రూ.3.31 లక్షల కోట్లు. అయితే, విజయ్ తన ‘తమిళగ వెట్రి కజగం’(టీవీకే) పార్టీ తరఫున ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటే, రాష్ట్ర మొత్తం ఆదాయంలో దాదాపు మూడో వంతు (సుమారు లక్ష కోట్లు) ఏటా కేటాయించక తప్పదు.
గత ఆర్థిక సంవత్సరంలో అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వం సంక్షేమ పథకాల కోసం రూ.65,000 కోట్లు ఖర్చు చేయగా, మేనిఫెస్టోలోని హామీలన్నింటినీ నెరవేర్చాలంటే విజయ్ సర్కార్ ఆ బడ్జెట్‌ను ఏకంగా మరో 50 శాతానికి పైగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎన్నికల్లో టీవీకేను అతిపెద్ద పార్టీగా నిలబెట్టడంలో విజయ్ మేనిఫెస్టోనే కీలక పాత్ర పోషించింది. ఇందులో ప్రధానంగా.. గృహిణులకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, ఏటా ఆరు ఉచిత ఎల్పీజీ సిలిండర్లు, ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి ఆకర్షణీయమైన పథకాలున్నాయి. వీటికి తోడు, వార్షిక ఆదాయం రూ.5 లక్షల లోపు ఉన్న కుటుంబాల యువతుల వివాహాలకు బంగారంతో పాటు పట్టుచీరలు ఇవ్వడం, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు రూ.4,000 ఆర్థిక సాయం వంటి భారీ హామీలను విజయ్ ప్రకటించారు.
అప్పుల కుప్పలో మేజిక్ సాధ్యమేనా?
ప్రజలకిచ్చిన ఈ భారీ వాగ్దానాలు నెరవేర్చడం విజయ్‌కు కత్తిమీద సామే. వచ్చే ఏడాది మార్చి నాటికి రాష్ట్ర అప్పుల భారం రూ.10.71 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. రాష్ట్ర వార్షిక ఆదాయం కేవలం రూ.2.1 లక్షల కోట్లుగా ఉండగా, అందులో సగం కేవలం సంక్షేమ పథకాలకే ఖర్చు చేయాల్సి వస్తుంది. సంపాదనలో ప్రతి మూడో రూపాయి ఎన్నికల హామీలకే పోయే బడ్జెట్‌తో ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమేనా? కుంచించుకుపోతున్న ఖజానాకు, ఆకాశాన్నంటే హామీలకు మధ్య ‘దళపతి’ సమతుల్యత సాధిస్తే .. అది ఆయన బ్లాక్ బస్టర్ సినిమాల కంటే గొప్పగా నిలిచిపోతుందంటున్నారు విశ్లేషకులు.
ఇది కూడా చదవండి: పినరయి కారుపై మోజు.. కుంజుమోన్ సీటుకు ‘క్లోజు’!


