Teacher Eligibility Test: టెట్‌ పాసైతే జీవితకాలం అర్హత

TET Certificate validity extended to a lifetime - Sakshi

 ఏడేళ్ల పరిమితి నుంచి జీవితకాల చెల్లుబాటు

ఎన్‌సీటీఈ ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదముద్ర

సాక్షి, అమరావతి: టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌)లో ఒకసారి అర్హత సాధిస్తే జీవితాలం చెల్లుబాటు ఉంటుందని కేంద్రం ప్రకటించింది. ఈమేరకు నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌(ఎన్‌సీటీఈ) ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. విద్యాహక్కు చట్టంలో పేర్కొన్న మేరకు ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తిచేసిన తరువాత అభ్యర్థులకు టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌)ను ప్రవేశపెట్టడంతో పాటు ఈ విధానం అన్ని రాష్ట్రాల్లోనూ అమలయ్యేలా తప్పనిసరి చేస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి నిబంధనలు రూపొందించింది.

జాతీయస్థాయిలో ప్రత్యేకంగా సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు (సీటీఈటీ)ని సీబీఎస్‌ఈ ప్రవేశపెట్టింది. రాష్ట్రాలు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టును తప్పనిసరిగా నిర్వహించాలని, ఏడాదికి కనీసం రెండుసార్లు ఈ టెట్‌ పరీక్ష పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. టెట్‌ అర్హత ధ్రువపత్రాల అర్హత కాలపరిమితిని ఏడేళ్లుగా ఎన్‌సీటీఈ చేసింది. 2011 నుంచి ఈ విధానం అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి రాష్ట్రాల్లో టెట్‌ విధానం అమల్లోకి వచ్చింది. టెట్‌ ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్లు మాత్రమే ఉండడంతో ఆ గడువు ముగిసిన అభ్యర్థులు మళ్లీ టెట్‌ను రాయవలసి వచ్చేది.

ఇప్పుడు ధ్రువపత్రాల చెల్లుబాటు కాలపరిమితిని ఏడేళ్ల నుంచి జీవితకాలం చేయడంతో నిరుద్యోగ టీచర్‌ అభ్యర్థులకు ఎంతో మేలు చేకూరుతుంది. 2011 నుంచి దీన్ని అమల్లోకి తెస్తున్నామని, ఇప్పటికే ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారికి ఇచ్చిన ధ్రువపత్రాల కాలపరిమితి ముగిసి ఉంటే వాటిని జీవితకాలానికి పునరుద్ధరించడమో, కొత్త ద్రువపత్రాలు జారీ చేయడమో చేయాలని కేంద్రం రాష్ట్రాలకు స్పష్టం చేసింది. గతంలో ఈ పరీక్షలు రాసి అర్హత సాధించిన వారు ఆ సర్టిఫికెట్ల పరిమితి ఏడేళ్లు దాటినా నిశ్చింతగా ఉండవచ్చు. వాటి కాలపరిమితి జీవిత కాలానికి పెంచడంతో మళ్లీ టెట్‌ రాయాల్సిన పనిలేదు. అయితే డీఎస్సీలో టెట్‌ అర్హత మార్కులకు 20 శాతం మేర వెయిటేజి ఇస్తున్నారు. దీనివల్ల టెట్‌ వెయిటేజి స్కోరును పెంచుకోవడానికి అభ్యర్థులు టెట్‌ను పలుమార్లు రాస్తున్నారు.  

చదవండి: పరీక్షల రద్దుతో హ్యాపీనా?

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top