
పదో తరగతి పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయిన విద్యార్థితో కేక్ కట్ చేయించి వేడుక చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పరీక్షల్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో అంతా అయిపోయినట్టు కాదన్న సందేశం ఇచ్చేందుకే ఆ విద్యార్థి తల్లిదండ్రులు ఇలా చేసుంటారని జనం చెప్పుకుంటున్నారు. ఇదిలావుంటే ఇటీవల విడుదలైన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) టెన్త్ ఫలితాల్లోనూ ఓ అద్భుతం జరిగింది. దళిత విద్యార్థి ఒకరు పదో తరగతి పాసయి వార్తల్లో నిలిచాడు. అయితే అతడేమి స్టేట్ ర్యాంక్ సాధించలేదు. కనీసం స్కూల్ టాపర్ కాదు. మరేంటి అతడి ఘనత?
పదో తరగతి చదివే విద్యార్థులు బోర్డు పరీక్షల్లో పాస్‌కావడం అనేది మామూలు విషయం. కానీ ఒక ఊరి నుంచి ఒక విద్యార్థి మాత్రమే పాసయితే.. అదికూడా దేశానికి స్వాతంత్ర్యం (Independence) వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఈ ఘనత సాధిస్తే.. అది అద్భుతమే కదా! అవును ఈ అద్భుతమే ఇప్పుడు నిజాంపూర్ (Nizampur) గ్రామంలో జరిగింది. యూపీ రాజధాని లక్నోకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరు. ఈ గ్రామానికి చెందిన రామ్ కేవల్(15) అనే విద్యార్థి టెన్త్ పాసయి వార్తల్లోకి ఎక్కాడు. నిజాంపూర్ నుంచి పదో తరగతి పాసయిన మొట్ట మొదటి విద్యార్థిగా అతడు చరిత్ర సృష్టించాడు.
ఓస్.. టెన్త్ పాసయితేనే ఇంత హడావుడి చేయాలా అని తేలిగ్గా అనకండి. ఎందుకంటే రామ్ కేవల్ (Ramkeval) కుటుంబ పరిస్థితి తెలిస్తే అతడు ఎంత కష్టపడ్డాడో అర్థమవుతుంది. రామ్ కేవల్‌ది పేద కుటుంబం. తల్లి స్కూల్‌లో వంటలు చేస్తుంది. తండ్రి కూలి పనికి వెళతాడు. తల్లిదండ్రులకు ఆసరా ఉండేందుకు రామ్ కేవల్.. పెళ్లిళ్లలో లైట్లు మోసే పనికి వెళ్లి రూ. 250 నుంచి రూ. 300 తెచ్చిస్తాడు. పనికి వెళ్లొచ్చిన తర్వాత ఎంత అర్ధరాత్రి అయిన సరే, కనీసం 2 గంటలు చదివిన తర్వాతే నిద్రపోయేవాడు. కాబట్టే తన ఊరిలో టెన్త్ పాసయిన మొదటి విద్యార్థి అయ్యాడు.
చదువుతోనే భవిష్యత్తు
మంచి చదువుతోనే పేదరికం నుంచి బటయపడతామని రామ్ కేవల్ తల్లి పుష్పా దేవి నమ్ముతున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పిల్లల్ని చదివించి తీరుతామని ఆమె చెబుతున్నారు. 'మాకు తినడానికి సరిపడా తిండిలేదు. చిన్నచిన్న కోరికలు తీర్చుకోలేని పరిస్థితి. మా పిల్లలకు ఇలాంటి జీవితం వద్దని అనుకుంటున్నాం. చదువుకుంటేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని గట్టిగా నమ్ముతున్నాను' అని చెప్పారు పుష్పాదేవి. తన మిగతా ముగ్గురు పిల్లల్ని కూడా స్కూల్‌కి పంపిస్తున్నారు. రామ్ కేవల్ ముగ్గురు తమ్ముళ్లు వరుసగా 9, 5, 1 చదువుతున్నారు.
స్ఫూర్తిగా నిలిచాడు
బారాబాంకీ జిల్లాలో నిజాంపూర్ గ్రామంలో 300 మంది వరకు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది దళితులు. వీరంతా రోజువారీ కూలిపనులు చేసుకునేవారే. దీంతో ఇక్కడి పిల్లలకు కనీస విద్య తీరని కలగా మిగిలిపోతోంది. అయితే రామ్ కేవల్ పట్టుదలతో పది పాసయ్యాడని బారాబాంకీ జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ ఓపీ త్రిపాఠి తెలిపారు. 'ఈసారి నిజాంపూర్ నుంచి రామ్ కేవల్ ఒక్కడే బోర్డు పరీక్షలు రాశాడు. అతడిని క్రమం తప్పకుండా బడికి పంపించేలా తల్లిదండ్రులను పోత్సహించాం. వీక్లీ, మంత్లీ పరీక్షల్లో రామ్ మంచి ప్రతిభ కనబరిచాడు. ఈ మార్కులను అతడి తల్లిదండ్రులకు చూపించేవాళ్లం. ఈ పరీక్షలు అతడిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాకుండా బోర్డు ఎగ్జామ్స్‌కు సన్నద్ధమయ్యేలా దోహదపడ్డాయ'ని ఓపీ తివారి వివరించారు. రామ్ కేవల్ ఉన్నత విద్య అభ్యసించేలా భవిష్యత్తులోనూ అండదండలు అందిస్తామని హామీయిచ్చారు. నిజాంపూర్ విద్యార్థులకు అతడు ప్రేరణగా నిలిచాడని ప్రశంసించారు.
చదవండి: అందుబాటులో అమెరికా విద్యార్థి వీసా అపాయింట్‌మెంట్లు
మేజిస్ట్రేట్ సన్మానం
ఇంతకుముందు టెన్త్ ఫెయిల్ అయి చదువు మధ్యలో ఆపేసిన లవశేష్, ముకేశ్ అనే ఇద్దరు ఇప్పుడు మళ్లీ పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు. టెన్త్ ఫలితాల్లో తమ ఊరి నుంచి ఒకే ఒక్కడుగా నిలిచిన రామ్ కేవల్‌ను బారాబాంకీ జిల్లా (Barabanki District) మేజిస్ట్రేట్ శశాంక్ త్రిపాఠి సన్మానించారు. కొడుకు చదువుకు అండగా నిలిచిన రామ్ తల్లిదండ్రులకు కూడా సత్కరించారు. ఉన్నత చదువుల్లో సహాయం అందిస్తామని భరోసాయిచ్చారు. ఇంతకీ రామ్‌కేవల్‌కి ఎన్నిమార్కులు వచ్చాయో చెప్పలేదు కదూ. బోర్డు పరీక్షల్లో 600 మార్కులకు 322 మార్కులు సాధించాడు. అంటే 53.6 శాతం మార్కులతో పాసయ్యాడు.
ఆగ్రా టాప్
యూపీలో ఈసారి 25,56,992 విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయగా, 90.11 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 93.87%, బాలురు 86.66% శాతం ఉత్తీర్ణత సాధించారు. 94.99 శాతం ఉత్తీర్ణతతో ఆగ్రా జిల్లా టాప్‌లో నిలిచింది. సోన్‌భద్ర 74.22 శాతం ఉత్తీర్ణతతో చివరి స్థానాన్ని దక్కించుకుంది. జలౌన్‌కు చెందిన యశ్ ప్రతాప్ సింగ్ 97.83 శాతం స్కోరుతో అగ్రస్థానంలో నిలిచాడు.