
గతేడాది వివాహిత హత్య
ఇప్పుడు నిందితుని తండ్రి మర్డర్
మండ్య జిల్లాలో రక్తపాతం
వివాహిత తండ్రి అరెస్టు
మండ్య(కర్ణాటక): గతేడాది జనవరిలో.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఓ యువతి.. ఆకస్మికంగా హత్యకు గురైంది. అప్పటినుంచి కేసు నడుస్తోంది. ఇంతలో ఆ కేసులో నిందితుని తండ్రి ప్రతీకార హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన పౌరుషాల గడ్డ అయిన మండ్య జిల్లా పాండవపుర తాలూకా మాణిక్యనహళ్లిలో మంగళవారం జరిగింది.
ఏం జరిగింది?
వివరాలు.. నరసింహే గౌడ (55) అనే రైతు కత్తిపోట్లతో చనిపోయాడు. వెంటనే వెంకటేశ్, మంజునాథ్ అనే ఇద్దరిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. వెంకటేష్ కూతురు దీపికతో నరసింహేగౌడ కొడుకు నితీష్ కుమార్ చనువుగా ఉండేవాడు. దీపిక కు అదివరకే పెళ్లయి కొడుకు ఉన్నాడు. ఇద్దరూ రీల్స్ కూడా చేసేవారు. గతేడాది జనవరిలో మేలుకోటె కొండ అంచున దీపిక హత్యకు గురైంది. నితీష్ ను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ కేసు నడుస్తోంది. అప్పటినుంచి ఇరుకుటుంబాల మధ్య వైరం కొనసాగుతోంది. నరసింహేగౌడ తన కూతురి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు. ఓ టీ హోటల్ వద్ద అతన్ని కత్తితో పొడిచి చంపారు. తన కూతురి హత్యకు ప్రతీకారంగా వెంకటేష్ ఈ హత్యకు పాల్పడినట్లు అనుమానాలున్నాయి. గ్రామంలో పోలీసు బందోబస్తు ఏర్పాటైంది.