
ఏపీ విభజన ఉద్యోగుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు
వారి సర్వీసును నిరంతరంగానే భావించాలని స్పష్టీకరణ
ఆ ఖాళీ కాలానికి పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల పిటిషన్ మాత్రం కొట్టివేత
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు సుప్రీంకోర్టులో పాక్షిక ఊరట లభించింది. ఉద్యోగంలో చేరడంలో పరిపాలన పరంగా జరిగిన జాప్యం వల్ల ఏర్పడిన సర్వీస్ అంతరాయాన్ని(సర్వీస్ బ్రేక్) పెన్షన్ ప్రయోజనాల కోసం పరిగణనలోకి తీసుకోవాలని, వారి సర్వీసును నిరంతరంగానే భావించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, పనిచేయని ఆ కాలానికి కూడా పూర్తి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల అభ్యర్థనను మాత్రం తోసిపుచ్చింది. ‘నో వర్క్–నో పే’ అనే సూత్రం వర్తిస్తుందని తేల్చిచెబుతూ వారి పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ అహసనుద్దీన్ అమానుల్లా, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది.
పనిచేయని కాలానికి జీతం ఇవ్వాలనే నిబంధన లేదు..
2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 58 ఏళ్లకు పదవీ విరమణ చేసిన కొందరు ఉద్యోగులను.. ఏపీలో 60 ఏళ్ల పదవీ విరమణ వయసు ఉన్నందున తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. అయితే, తెలంగాణ నుంచి రిలీవ్ అవ్వడానికి, ఏపీలో పోస్టింగ్ ఇవ్వడానికి మధ్య.. కొన్ని నెలల నుంచి ఏడాదికి పైగా సమయం పట్టింది. ఈ కాలాన్ని సర్వీసుగా పరిగణించి పూర్తి జీతం చెల్లించాలని ఉద్యోగులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
పనిచేయని కాలానికి కూడా జీతం చెల్లించడానికి చట్టంలో ఎలాంటి నిబంధన లేదని.. అందువల్ల ఆ డిమాండ్‌కు చట్టపరమైన బలం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉద్యోగుల తప్పు లేకుండా జరిగిన పరిపాలన జాప్యం వల్ల.. వారి పెన్షన్ ప్రయోజనాలకు నష్టం వాటిల్లకూడదని అభిప్రాయపడింది. ఆ ఖాళీ సమయాన్ని కూడా పెన్షన్ లెక్కింపు కోసం పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది. తద్వారా వారి 60 ఏళ్ల సర్వీస్‌కు గాను పూర్తి పెన్షన్ ప్రయోజనాలు పొందుతారని పేర్కొంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే.. తాము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆ ఖాళీ సమయంలో ఉద్యోగులు ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చి ఉండాలని కోర్టు వ్యాఖ్యానించింది.