వీధికుక్కలకు ‘కారుణ్య మరణం’ | Supreme Court Refuses To Recall Stray Dogs Removal Order | Sakshi
Sakshi News home page

వీధికుక్కలకు ‘కారుణ్య మరణం’

May 20 2026 5:28 AM | Updated on May 20 2026 5:28 AM

Supreme Court Refuses To Recall Stray Dogs Removal Order

ప్రజలకు ముప్పుగా మారిన శునకాలను తొలగించాలి 

పిల్లలు, వృద్ధులు ప్రాణభయంతో బతకడాన్ని చూస్తూ ఊరుకోలేం  

గౌరవంగా జీవించే హక్కు అంటే స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా..  

శునకాల నియంత్రణ చర్యలు తీసుకునే అధికారులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరాదు   

ఆదేశాలు అమలు చేయని అధికారులపై ధిక్కరణ చర్యలు తప్పవు  

జంతు హక్కుల సంఘాల పిటిషన్లు కొట్టివేసిన అత్యున్నత ధర్మాసనం  

సాక్షి, న్యూఢిల్లీ: ‘గౌరవంగా జీవించే హక్కు అంటే కుక్కకాటు భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా’అని అత్యున్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దేశవ్యాప్తంగా ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారిన వీధి కుక్కల దాడుల నియంత్రణపై కీలకమైన తీర్పు వెలువరించింది. ముప్పుగా పరిణమించిన, క్రూరమైన, పిచ్చిపట్టిన, కోలుకోలేని జబ్బుబారిన పడిన, అత్యంత ప్రమాదకరమైన వీధి కుక్కలకు కారుణ్య మరణం(యూథనేషియా) ప్రసాదించవచ్చని స్పష్టం చేసింది. వీధికుక్కల జనాభా ప్రమాదకర స్థాయికి చేరిన ప్రాంతాల్లో, తరచుగా కుక్క కాట్లు ప్రజల భద్రతకు నిరంతర ముప్పుగా మారిన చోట కారుణ్య మరణం ద్వారా వాటి సంఖ్యను తగ్గించవచ్చని సూచించింది.

జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం–1960, యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌ రూల్స్‌–2023, ఇతర చట్టబద్ధమైన ప్రోటోకాల్‌ నిబంధనలకు అనుగుణంగా, పశువైద్య నిపుణుల అంచనా తర్వాత కారుణ్యమరణంతోపాటు ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని తెలిపింది. ఆసుపత్రులు, పాఠశాలలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల వంటి పబ్లిక్‌ ప్రదేశాల్లో పట్టుకున్న శునకాలను తిరిగి అక్కడే వదలరాదని గత నవంబర్‌లో ఇచ్చిన ఆదేశాలను సవరించేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆ కుక్కలను తప్పనిసరిగా షెల్టర్లలోనే ఉంచాలని తేల్చిచెప్పింది. ఈ మేరకు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం మంగళవారం తీర్పునిచ్చింది. వీధి కుక్కల తొలగింపును, భారత జంతు సంక్షేమ బోర్డు (ఏడబ్ల్యూబీఐ) నిబంధనలను సవాల్‌ చేస్తూ జంతు హక్కుల సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేసింది.  

అసలేం జరిగిందంటే... 
గతేడాది ఓ చిన్నారి వీధి కుక్కల దాడిలో మరణించిన ఘటనపై జస్టిస్‌ జె.బి.పార్దివాలా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం సుమోటోగా విచారణ చేపట్టింది. దేశ రాజధాని ప్రాంతంలోని వీధి కుక్కలన్నింటినీ పట్టుకుని షెల్టర్లకు తరలించాలని ఆదేశించింది. అయితే, ఈ ఆదేశాలపై జంతు ప్రేమికులు, జంతు హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఈ వ్యవహారం త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ అయ్యింది. విచారణ చేపట్టిన త్రిసభ్య ధర్మాసనం.. తొలుత జంతు జనన నియంత్రణ(ఏబీసీ) నిబంధనల ప్రకారం కుక్కలకు వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్‌ చేసి వదిలేయాలని పేర్కొంది. ఆ తర్వాత సమస్య తీవ్రత దష్ట్యా దేశవ్యాప్తంగా విచారణ పరిధిని విస్తరించింది.

ఈ క్రమంలోనే గత నవంబర్‌ 7న కీలక ఆదేశాలు ఇస్తూ.. ఆసుపత్రులు, విద్యాసంస్థలు తదితర పబ్లిక్‌ ప్రదేశాల నుంచి కుక్కలను పట్టుకుని షెల్టర్లకు తరలించాలని, నిర్ణిత ప్రదేశాల్లో మినహా వీధుల్లో కుక్కలకు ఆహారం పెట్టడాన్ని నిషేధించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని, కేవలం ఏబీసీ నిబంధనలు మాత్రమే అమలు చేయాలని కోరుతూ జంతు హక్కుల సంఘాలు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ), ఏడబ్ల్యూబీఐ తదితర పక్షాల వాదనలు విన్న కోర్టు.. జనవరిలో తీర్పును రిజర్వ్‌ చేసి, మంగళవారం వెలువరించింది. 

ధర్మాసనం కీలక వ్యాఖ్యలు  
సమస్య తీవ్రత ఏ స్థాయిలో ఉందో వివరిస్తూ ధర్మాసనం తమ తీర్పులో కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘గౌరవప్రదంగా జీవించే హక్కు అంటే, కుక్కల దాడుల భయం లేకుండా స్వేచ్ఛగా బతకడం కూడా. వీధి కుక్కల దాడుల్లో చిన్నారులు, వృద్ధులు, విదేశీ ప్రయాణికులు బలవుతున్నారు. ఈ కఠోర వాస్తవాలను కోర్టు విస్మరించలేదు. పిల్లలు, వృద్ధులు కేవలం తమ కండబలంతో కుక్కల బారినుంచి ప్రాణాలు కాపాడుకునే పరిస్థితిని రాజ్యాంగం కల్పించలేదు.

ఇలాంటి దాడులు జరుగుతున్నప్పుడు ప్రభుత్వాలు మౌనంగా చూస్తూ ప్రేక్షకపాత్ర వహించడానికి వీల్లేదు’’అని జస్టిస్‌ సందీప్‌ మెహతా తమ తీర్పును చదువుతూ వ్యాఖ్యానించారు. జంతు జనన నియంత్రణ(ఏబీసీ) నిబంధనల అమలులో ప్రభుత్వాల వైఫల్యం, నిధుల కొరత వల్లే ఈ సమస్య తీవ్రరూపం దాల్చిందని కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విమానాశ్రయాలు, నివాస ప్రాంతాలకూ ఈ ముప్పు విస్తరించిందని ఆక్షేపించింది.  

స్పష్టమైన ఆదేశాలు  
సుప్రీంకోర్టు తమ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు పలు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల భద్రతకు ముప్పుగా మారిన ప్రమాదకరమైన, పిచ్చిపట్టిన కుక్కలకు చట్టబద్ధమైన నిబంధనల మేరకు కారుణ్య మరణం ప్రసాదించేందుకు అధికారులకు అనుమతినిచ్చింది. వీధి కుక్కల నియంత్రణకు ప్రతి జిల్లాలోనూ కనీసం ఒక పూర్తిస్థాయి జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, జనాభా సాంద్రతను బట్టి వీటిని మరింత విస్తరించాలని స్పష్టం చేసింది. అలాగే, ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్లు, ఇమ్యునోగ్లోబులిన్స్‌ తగినంతగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

కోర్టు ఆదేశాల అమలులో భాగంగా, వీధి కుక్కల నియంత్రణకు చట్టబద్ధమైన చర్యలు తీసుకునే అధికారులకు పూర్తి రక్షణ కల్పించాలని ధర్మాసనం సూచించింది. సదుద్దేశంతో విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులపై సాధారణంగా ఎలాంటి క్రిమినల్‌ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయరాదని పోలీసులను ఆదేశించింది. అయితే, కోర్టు ఆదేశాలను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై కోర్టు ధిక్కరణ, క్రమశిక్షణా చర్యలు ఉంటాయని గట్టిగా హెచ్చరించింది. సుప్రీంకోర్టు ఆదేశాల అమలును, జంతు సంక్షేమ బోర్డు నిబంధనలను పర్యవేక్షించేందుకు రాష్ట్రాల హైకోర్టులు సుమోటోగా కేసులు నమోదు చేయాలని సూచించింది. ఇదిలా ఉండగా, జాతీయ రహదారులపై పశువుల బెడదను నివారించేందుకు ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.  

బాధ్యత నుంచి సుప్రీంకోర్టు తప్పుకుంది: మేనకా గాంధీ  
వీధి కుక్కుల విషయంలో సుప్రీంకోర్టు తన బాధ్యత నుంచి తప్పుకుందని కేంద్ర మాజీ మంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై ఆమె స్పందించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా అమలు చేయలేదని ఆక్షేపించారు. ఈ ఆరు నెలల్లో జరిగిందేమీ లేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement