అంజలి సింగ్‌ కేసులో ఊహించని ట్విస్ట్‌!.. నిధి అసలు ఫ్రెండే కాదట!

Sultanpuri Horror: Never Seen Heard of Nidhi Says Anjali Mother - Sakshi

ఢిల్లీ: దేశ రాజధాని నడిబొడ్డున దారుణ రీతిలో ప్రాణం పొగొట్టుకుంది అంజలి సింగ్‌(20). తాగుబోతుల నిర్లక్ష్యానికి ఒక నిండు ప్రాణం.. నరకం అనుభవిస్తూ విగతజీవిగా మారింది. ఢిల్లీని కుదిపేసిన సుల్తాన్‌పురి కేసు.. నిరసనలతో కేంద్రంలోనూ కదలికలు తీసుకొచ్చింది. అయితే పోలీసు దర్యాప్తు పట్ల బాధిత కుటుంబం సంతృప్తిగా ఉన్నా..  తాజాగా వాళ్లు ఇచ్చిన ఓ స్టేట్‌మెంట్‌ ఈ హిట్‌ అండ్‌ రన్‌ కేసును మరో మలుపు తిప్పేలా కనిపిస్తోంది. 

ఘటన సమయంలో అంజలితో పాటు ఉన్న నిధి అనే స్నేహితురాలి స్టేట్‌మెంట్‌ ఈ కేసులో కీలకంగా మారిన సంగతి తెలిసిందే కదా. అయితే తమ కూతురికి నిధి అనే స్నేహితురాలు లేనేలేదని అంజలి తల్లి రేఖా దేవి మీడియాకు తెలిపింది. అంతేకాదు.. ఆరోజు అంజలి ఆల్కాహాల్‌ తీసుకుందని మీడియా సాక్షిగా నిధి చెప్పిన మాటలపైనా ఆమె మండిపడ్డారు. 

‘‘నిధి అనే అమ్మాయిని నేను, మా ఇంట్లో వాళ్లం ఎప్పుడూ చూడలేదు. ఆమె ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. అలాంటి స్నేహితురాలు మా అమ్మాయికి లేదు. తను అబద్ధం చెప్తోంది. నా కూతురు జీవితంలో ఎప్పుడూ ఆల్కహాల్‌ తీసుకోలేదు. నిధి అబద్ధం చెబుతోంది. పోలీసులు ఆమెను గట్టిగా విచారిస్తే.. అసలు విషయాలు బయటపడ్తాయి’’ అని రేఖా దేవి విజ్ఞప్తి చేస్తోంది. ఇక అంజలి మేనమామ మాట్లాడుతూ.. ‘‘ఆమె అబద్ధం చెప్తున్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. అంత పెద్ద ప్రమాదం జరిగినప్పుడు అసలామె ఎందుకు పట్టనట్లు ఉంది.  పోలీసులకు కాదు కదా తన ఇంట్లో వాళ్లకైనా ఎందుకు చెప్పలేదు. ఇది ప్రమాదం కాదు.. ముమ్మాటికీ హత్యే. నిధి పై కూడా హత్యానేరం నమోదు చేయాలి. నిందితులకు ఆమెకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమో గుర్తించాలి’’ ఆయన పోలీసులను కోరుతున్నాడు. 

ఇదిలా ఉంటే అంజలి ఫ్యామిలీ డాక్టర్‌ భూపేష్‌.. ఆమెకు మద్యం తీసుకునే అలవాటు లేదని చెప్పాడు. అదే సమయంలో పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె శరీరంలో ఆనవాలు లేదని తేలిన విషయాన్ని గుర్తు చేశారు. ఘటనకు ముందు హోటల్‌లో ఆమె తీసుకున్న ఆహారం ఆనవాలు మాత్రమే కడుపులో ఉన్నట్లు నివేదికలో వెల్లడైన విషయాన్ని డాక్టర్‌ భూపేష్‌ చెప్తున్నారు. 

నిధి స్టేట్‌మెంట్‌.. 
నిధి పోలీసులకు, మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు ముందు కొత్త ఏడాది స్వాగతం పలుకుతూ జరిగిన పార్టీలో అంజలి మద్యం సేవించింది. ఆపై ఇద్దరం స్కూటీపై బయల్దేరాం. నేను వెనకాల కూర్చున్నా. ఘటన జరిగిన సమయంలో స్కూటీని ఢీ కొట్టిన కారులో ఎలాంటి మ్యూజిక్‌ ప్లే కావడం లేదు. స్కూటీని ఢీ కొట్టాక.. అంజలి కాలు కారు కింద ఇరుక్కుంది. ఆమె నొప్పితో గట్టిగట్టిగా అరిచింది. ఆమె కారు కింద చిక్కుకుందని లోపల ఉన్నవాళ్లకు తెలుసు. కానీ, స్లో చేయడం గానీ, ఆమెను రక్షించే ప్రయత్నంగానీ చేయకుండా  ఏం పట్టన్నట్లు లాక్కుని వెళ్లిపోయారు. ఆ సమయంలో నాకు భయం వేసింది. ఆ ప్రమాదానికి నన్నే నిందిస్తారనే భయంతో అక్కడి నుంచి వెళ్లిపోయా.. అంతే! అని నిధి మీడియాకు తెలిపింది.  

సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిధిని ట్రేస్‌ చేసిన పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం సేకరించారు. ఘటన స్థలం నుంచి 150 మీటర్ల దూరంలోని ఓ గల్లీలో ఆమె(నిధి) వెళ్తుండగా.. అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యింది.  ఇదిలా ఉంటే.. అంజలి ఘటనలో నిధి వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మరోవైపు ఐదుగురు నిందితులు ఘటన సమయంలో తాము మద్యం మత్తులో ఉన్నామని, కారులో ఫుల్‌ సౌండ్‌ ఉన్నందున  అంజలి కారు కింద ఉన్న విషయం గమనించలేకపోయామని చెప్తున్నారు.

అయితే.. ప్రధాన నిందితుడు, డ్రైవర్‌ సీట్‌లో ఉన్న దీపక్‌ ఖన్నా మాత్రం కారు దేని మీద నుంచో వెళ్తున్నట్లు అనిపించిందని చెప్పగా, మిగతా వాళ్లు మాత్రం తాము అలాంటిదేం గుర్తించలేదని పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top