Tamil Nadu: పాఠశాలలో వాష్‌రూమ్‌ గోడ కూలి ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

Students Killed In Wall Collapse At School In Tamil Nadu' Thirunelveli - Sakshi

చెన్నై: పాఠశాలలో వాష్‌రూమ్‌ గోడ కూలి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన విషాద ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరునెల్వేలిలో ఉన్న షేఫర్ హయ్యర్ సెకండరీ బాయ్స్ ప్రైవేట్ పాఠశాలలో శుక్రవారం ఉదయం సంభవించింది. విద్యార్ధులు మూత్ర విసర్జను వెళ్లగా మరుగుదొడ్డి గోడ కూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మరణించగా మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించిన ముగ్గురు చిన్నారులు అన్బళగన్ (9వ తరగతి), విశ్వరంజన్ (8వ తరగతి), సుతేష్ (6వ తరగతి)గా గుర్తించినట్లు స్కూల్‌ యాజమాన్యం పేర్కొంది. గాయపడిన విద్యార్థులను సంజయ్ (8వ తరగతి), ఇసాకి ప్రకాష్ (9వ తరగతి), షేక్ అబూబకర్ కిదానీ (12వ తరగతి), అబ్దుల్లా (7వ తరగతి)గా గుర్తించారు.

సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ బృందాలు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన విద్యార్థుల మృతదేహాలకు పోస్టుమార్టం నిమిత్తం తిరునల్వేలి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. గాయపడిని వారికి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సానుభూతి తెలిపారు. అలాగే మరణించిన ముగ్గురు విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. అలాగే గాయపడిన విద్యార్థుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3 లక్షలు ప్రకటించింది.
చదవండి: ప్లీజ్‌ సార్‌, వెళ్లొద్దు.. బోరున విలపిస్తు రోడ్డెక్కిన విద్యార్థులు

కాగా ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తామని, అప్పుడే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని తిరునెల్వేలి పోలీసులు తెలిపారు. మరోవైపు గోడ కూలిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాల వద్ద ఆందోళన చేశాయి. పాఠశాలలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశాయి. అయితే స్కూల్ భవనం పాతబడిందని, కరోనా కారణంగా ఏడాదిన్నరపాటు అది మూతపడి ఉండగా.. ప్రభుత్వం అనుమతివ్వడంతో ఇటీవల స్కూల్‌ను తెరిచారని పోలీసులు తెలిపారు. అయితే, స్కూళ్లు తెరిచే ముందు పాఠశాలల పరిస్థితిని చెక్ చేసుకోవాలని, విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ముందే సూచించిందని తెలిపారు.
చదవండి: ఆమె సంకల్పానికి సలాం.. రాష్ట్రవ్యాప్తంగా చర్చల్లోకి..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top