sonam kumari A Woman Behind Inspires PM Modi raised Marriage Age to 21- Sakshi
Sakshi News home page

మోదీ జీ... ప్లీజ్‌ పెంచండి.. పోస్ట్‌కార్డ్‌ సందేశాల పవర్‌ ఇది!

Dec 17 2021 8:23 AM | Updated on Dec 17 2021 3:25 PM

sonam kumari A Woman Behind Inspires PM Modi raised Marriage Age to 21 - Sakshi

‘ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’ అన్నారు ప్రజాకవి కాళోజీ.  కేంద్రం మహిళల వివాహ వయసును పెంచడానికి జయా జైట్లీ నేతృత్వంలో 2020 జూన్‌ నాలుగున టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అయితే, కేంద్రంలో కదలిక తీసుకొచ్చే ప్రయత్నానికి బీజం వేసింది మాత్రం కొందరు యువతుల పోస్ట్‌కార్డ్‌ రాతలే!.

చదవండి: 21 ఏళ్లు వచ్చాకే అమ్మాయి పెళ్లి

పాట్నా (బీహార్‌) వాసి సోనమ్‌ కుమారి, హిసార్‌(హరియాణా)కు చెందిన 16 ఏళ్ల పూనమ్‌ మిథర్‌వాల్‌ లాంటి అమ్మాయిలు చేపట్టిన పోస్ట్‌కార్డ్‌ ఉద్యమం కేంద్రం నిర్ణయాన్ని ప్రభావితం చేసిన అంశాల్లో ఒకటని చెప్పొచ్చు. 19 ఏళ్ల సోనమ్‌కు ఇంట్లో వాళ్లు పెళ్లిచేయబోయారు.  చదువుతానని, ఇప్పుడే పెళ్లి వద్దని నచ్చజెప్పినా వారు ససేమిరా అన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక సోనమ్‌ ఈ ఏడాది ఆగస్టులో ఇంటిని వదిలి ఢిల్లీకి వెళ్లింది. ఉద్యోగం చేస్తూ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ ద్వారా చదువును కొనసాగిస్తోంది. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు కూడా వివాహ వయసు 21 ఏళ్లకు పెంచాలని ప్రధాని మోదీకి ఆగస్టులోనే లేఖ రాసింది.

చదవండి: పెళ్లికి అమ్మాయి కనీస వయసు పెంపు! మన దగ్గరే ఇలాగనా?

సోనమ్‌ సంధించిన లేఖ హరియాణాలో ఏంతోమంది బాలికలను ఆలోచింపజేసింది. నిశ్శబ్ద ఉద్యమం మొదలైంది. వందలాది మంది బాలికలు ప్రధానికి లేఖలు రాశారు. పూనమ్‌ ఆగస్టులో ఒకరోజు కాలేజీ ముగిశాక నేరుగా పోస్ట్‌ ఆఫీసుకు వెళ్లింది. ఆమెతో పాటే మరో ఆరుగురు స్నేహితురాళ్లు కూడా. ‘మోదీ జీ.. అమ్మాయిల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచండి’ అని పోస్ట్‌కార్డుపై హిందీలో చాలా క్లుప్తంగా తమ విజ్ఞప్తికి అక్షర రూపమిచ్చారు.

‘నా స్నేహితురాళ్లు, తెలిసిన వాళ్లలో చాలామందికి 18 ఏళ్లు నిండగానే పెళ్లి చేసేసి పంపించి వేశారు వాళ్ల కుటుంబసభ్యులు. చదువు మాన్పించారు. వివాహ వయసు పెంచితే తల్లిదండ్రులను ఒప్పించి ఉన్నత చదువులు కొనసాగించడానికి వీలుంటుంది’ అని పూనమ్‌ వాదన. 

–నేషనల్‌ డెస్క్, సాక్షి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement