
= బెంగళూరులో ఘటన
దొడ్డబళ్లాపురం(కర్ణాటక): భార్యల చేతుల్లో భర్తలు హతమవుతున్న సంఘటనలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా బెంగళూరు సుద్దగుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్య భర్తను బలితీసుకుంది. భాస్కర్ (40).. భార్య శృతి చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటి పనిమనిషితో భర్త చనువుగా ఉంటున్నాడని శృతి అప్పుడప్పుడు గొడవ చేసేది.
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తీవ్ర రగడ జరిగింది. శృతి చేతికి దొరికిన వస్తువుతో దాడి చేసింది, తలకు దెబ్బ తగిలిన భాస్కర్ అక్కడికక్కడే చనిపోయాడు. దీంతో ఆందోళనచెందిన శృతి భర్త శవానికి స్నానం చేయించి ఏమీ జరగనట్లు బెడ్ మీద పడుకోబెట్టింది. బాత్‌రూంలో పడి చనిపోయాడని చుట్టుపక్కల వాళ్లను నమ్మించింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిర్వహించగా గాయాలు బయటపడ్డాయి. దీంతో శృతిని అదుపులోకి తీసుకుని విచారించగా, నిజం వెల్లడించింది. కేసు నమోదు చేసి ఆమెను అరెస్టు చేశారు.