రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి అరెస్టు

Republic TV chief Arnab Goswami arrested for abetment to suicide - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ జర్నలిస్ట్, రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామిని ముంబై, రాయ్‌గడ్ పోలీసులు అరెస్టు చేశారు. 2018లో డిజైనర్‌ ఆత్మహత్యకు పురికొల్పాలరనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని ముంబై పోలీసులు ప్రకటించారు. 

ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించి బుధవారం అర్నాబ్‌ను  అదుపులోకి తీసుకున్నారని రిపబ్లిక్ టీవీ నివేదించింది. ఐపీసీ సెక్షన్ 306 కింద గోస్వామిపై అభియోగాలు మోపారని తెలిపింది. కనీసం 20మంది పోలీసులు అర్నాబ్‌పై దాడి చేశారని, ఆపై బలవంతంగా మహారాష్ట్రలోని రాయ్‌గడ్‌కు తీసుకెళ్లారని ఆరోపించింది. అర్నాబ్ గోస్వామిని అరెస్టు చేయడానికి ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్  సచిన్ వాజ్‌ను పంపినట్లు రిపబ్లిక్ టీవీ తెలిపింది. ఏకే 47, సెమీ ఆటోమేటిక్ ఆయుధాలతో సాయుధ గార్డులు ఆయనపై దాడి చేశారని వ్యాఖ్యానించింది.

జుట్టు పట్టుకొని లాక్కెళ్లారు
ఉదయమే తమ ఇంటిపై దాడి చేసిన పోలీసులు ఆర్నాబ్‌ను కొట్టి, జుట్టు పట్టి లాక్కెళ్లారని అర్నాబ్ భార్య సమ్యబ్రాతా రే ఆరోపించారు, కొద్ది సమయం అడిగినా ఇవ్వకుండా, లాయర్‌ వచ్చేంతవరకు వేచి చూడాలని కోరినా వినకుండా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా తీసుకెళ్లారని మండిపడ్డారు. ఛానెల్‌లోని విజువల్స్ ప్రకారం అర్నాబ్‌ను మొదట కారులో ఉంచి, ఆపై వ్యాన్‌లోకి నెట్టారు. అతన్ని వ్యాన్‌లోకి తీసుకెళ్తుండగా, తన ఇంటి లోపల తనపై, తన కుటుంబ సభ్యులపై దాడి జరిగిందని ఆర్నాబ్ మీడియాకు చెప్పారు.

కాగా ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్, అతని తల్లి కుముద్ నాయక్‌తో కలిసి మే, 2018లో అలీబాగ్‌లోని వారి బంగ్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. రిపబ్లిక్ టీవీ స్టూడియోలను రూపొందించిన డిజైనర్ అన్వే నాయక్‌కు బిల్లులు చెల్లించకపోవడంతోనే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారన్న కుటుంబ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో అర్నాబ్‌పై రాయ్‌గడ్‌లో కేసు నమోదైంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్థానిక రాయ్‌గడ్ పోలీసులు గోస్వామితో సహా సూసైడ్ నోట్‌లో పేర్కొన్న నిందితులపై తమకు ఆధారాలు దొరకలేదని 2019 ఏప్రిల్‌లో కేసును మూసివేశారు. అయితే, ఈ ఏడాది మేలో, అన్వే కుమార్తె ఈ కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని కోరుతూ మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఆశ్రయించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top