టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్‌ సంబురాలు.. రాహుల్‌ చురకలు | Rahul Gandhi Unhappy with Congress Leaders Over TMC Lost Celebrations | Sakshi
Sakshi News home page

టీఎంసీ ఓటమిపై కాంగ్రెస్‌ సంబురాలు.. రాహుల్‌ చురకలు

May 5 2026 1:30 PM | Updated on May 5 2026 1:40 PM

Rahul Gandhi Unhappy with Congress Leaders Over TMC Lost Celebrations

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో.. కేరళంలో అధికారం తప్పించి మిగతా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పెద్దగా ప్రభావం చూపెట్టలేదు. అయితే సింగిల్‌ డిజిట్‌ సీట్లతో తమిళనాడులో అధికారంలో భాగం అయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. ఇటు బెంగాల్‌లో రెండు సీట్లు గెలవడం కంటే.. టీఎంసీ ఓటమిపైనే హస్తం శ్రేణులు ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నాయి. ఈ పరిణామంపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. 

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ ఓటమితో కొందరు కాంగ్రెస్‌ నేతలు సంబురాలు చేసుకున్నట్లు రాహుల్‌ గాంధీకి సమాచారం వెళ్లింది. దీంతో సొంత పార్టీ నేతల తీరుపైనే ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ‘‘ టీఎంసీ ఓటమిని చూసి కొందరు కాంగ్రెస్‌ నేతలు మురిసిపోతున్నారు. ఇది ఎంత మాత్రం సరికాదు. బెంగాల్‌, అసోంలో ప్రజల తీర్పును అపహరించడం అనేది  భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేసే క్రమంలో బీజేపీ వేసిన మరో అడుగు.. 

.. ఇది ఓ పార్టీకో, మరో పార్టీకో చెందింది కాదు. ఇది దేశం గురించి.. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టండి.  ప్రజాస్వామ్యాన్ని కాపాడే దిశగా అన్ని పార్టీలు కలిసికట్టుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని రాహుల్‌ హితవు పలికినట్లు సమాచారం. 

అంతకు ముందు.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆయన స్పందించారు. కేరళలో కాంగ్రెస్‌ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూనే.. మరోవైపు బెంగాల్‌, అస్సాం విషయంలో బీజేపీపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. 

దీదీకి మద్దతుగా.. 
బెంగాల్‌లో ఓట్ల చోరీ జరిగిందన్న టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలతో రాహుల్‌ గాంధీ ఏకీభవించారు. బెంగాల్‌తో పాటు అస్సాంలోనూ ఓట్లను బీజేపీ దోచుకుందని అన్నారాయన. ‘‘బెంగాల్‌లో వందకు పైగా స్థానాలు అన్యాయంగా బీజేపీ ఖాతాలోకి వెళ్లాయి. ఎన్నికల ప్రక్రియలో సీసీటీవీ కెమెరాలు ఆపివేయడం, కౌంటింగ్‌ సెంటర్లలో అనుమానాస్పద కదలికలు జరిగాయి. ఇది ఒక పెద్ద “ఎలక్షన్‌ మేనిప్యులేషన్‌ ప్లేబుక్‌”లో భాగమని ఆయన ఆరోపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement