నీట్‌ నిందితులతో బీజేపీ నేతల ఫొటోలు లీక్‌.. కలకలం.. | NEET Paper Leak Row Takes Political Turn As Prashant Bhushan And Congress Allege BJP Links to Accused, Photos Viral | Sakshi
Sakshi News home page

నీట్‌ నిందితులతో బీజేపీ నేతల ఫొటోలు లీక్‌.. కలకలం..

May 13 2026 10:16 PM | Updated on May 14 2026 11:39 AM

Pictures of the Neet leak accused with bjp leaders

నీట్ ప్రశ్నపత్రం లీక్ నిందితులకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు కనిపిస్తోందంటూ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్‌ చేశారు. అక్రమంగా కోట్ల రూపాయల డబ్బు సంపాదించడం కోసం లక్షలాది మంది అమాయక విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఇండియా టుడేలో వచ్చిన ఓ క్లిప్‌ను ఆయన పోస్ట్‌ చేశారు.

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ కూడా స్పందించింది. ‘‘నీట్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ నిందితుడు దినేశ్‌ బిన్‌వాల్‌తో రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్, బీజేపీ ఎమ్మెల్యే మహేంద్ర, పలువురు బీజేపీ నాయకుల ఫొటోలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఇది ప్రశ్నపత్రం లీక్ రాకెట్‌లో బీజేపీ ఎంతగా భాగస్వామ్యమైందో స్పష్టంగా చూపిస్తోంది. ప్రశ్నపత్రం లీక్ మాఫియాకు రక్షకుడిగా బీజజేపీ వ్యవహరిస్తోందని తెలుస్తోంది. లక్షలాది మంది విద్యార్థుల కష్టం, కలలు, భావోద్వేగాలతో బీజేపీ ఆటలాడుతోంది. ఈ ప్రశ్నపత్రం లీక్ మోసాల వల్ల అమాయక విద్యార్థులు ఇంకా ఎంతకాలం బాధపడాలి?’’ అని నిలదీసింది.

రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌తో నీట్ లీక్ నిందితుడి ఫొటోలు బయటకు వచ్చాయంటూ ఇండియా టుడేలో వచ్చిన వార్తకు సంబంధించిన క్లిప్‌ను కాంగ్రెస్‌ పార్టీ కూడా ట్వీట్‌ చేసింది. బీజేపీ ఎమ్మెల్యే మహేంద్రతో కూడా నిందితుడి ఫొటో కనిపించిందని క్లిప్‌లో ఇండియా టుడే తెలిపింది.

ప్రస్తుతం దీనిపై పరిశీలన జరుగుతోంది. నీట్ లీక్ వ్యవహారంలో కీలక నిందితుల అరెస్టులు జరిగాయి. లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. వారు రూ.30 లక్షలకు లీకైన ప్రశ్నపత్రం కొనుగోలు చేశారని ఆరోపణలు వచ్చాయి. వారిలో ఒకరి కుమారుడు నీట్ పరీక్ష రాస్తుండటంతో అతనికి ఆ ప్రశ్నపత్రం ఇచ్చారని అభియోగం ఉంది.

అదే కాకుండా, ఆ లీకైన ప్రశ్నాపత్రాన్ని మరికొందరికీ అమ్మినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ లీక్ ఈ ఏడాదికే పరిమితం కాదని, 2025లో కూడా జరిగిందని సంచలన ఆరోపణలు వచ్చాయి. ఎందుకంటే నిందితుల కుటుంబానికి చెందిన నలుగురు 2025లో నీట్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారని వారు వెల్లడించారు. అరెస్టైన నిందితులకు రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో విచారణ కొనసాగుతోంది.

మంగీలాల్, దినేష్  ఫొటోలను ఇండియా టుడే సేకరించింది. వీరే నీట్ 2026 లీకైన ప్రశ్నపత్రం వ్యవహారంలో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే 2025లో కూడా ప్రశ్నపత్రం ఎలా లీకైందన్న విషయంపై సంచలన వివరాలు బయటకు వచ్చాయి. గురుగ్రామ్‌కు చెందిన ఓ వైద్యుడి నుంచి ప్రశ్నపత్రాలు కొనుగోలు చేశారని తెలుస్తోంది. అంతేకాదు, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా 700 మంది విద్యార్థులకు ప్రశ్నపత్రం పంపినట్టు సమాచారం. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement