
100 కోట్ల మందికి మానసిక రుగ్మతలు
ప్రతి 100 మరణాలలో ఒకటి ఆత్మహత్య
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక
ఆర్థికంగా ఎదగాలన్న ఆశ, సామాజికంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఆకాంక్ష, కీర్తి ప్రతిష్టల కోసం పాకులాట.. ఈ పోటీ ప్రపంచంలో మనుషుల్ని మానసిక రోగులుగా మార్చేస్తున్నాయి. పైకి ఆరోగ్యంగా కనిపిస్తున్నా.. మనుషుల్లో ఒత్తిడులు, మనో వైకల్యాలు అధికంగా ఉంటున్నాయి. అనుకోనివి జరగడం ‘ఆందోళన’లోకి, అనుకున్నవి జరగకపోవటం ‘ఒత్తిడి’లోకి మనుషుల్ని నెట్టేస్తున్నాయి.. ప్రాణాల మీదకుతెస్తున్నాయి.. ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా నివేదిక స్పష్టం చేసింది. - సాక్షి, స్పెషల్ డెస్క్
ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న ప్రతి 100 మరణాలలో ఒకటి ఆత్మహత్యేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తాజాగా వెల్లడించింది. 2021లో మొత్తం 7,27,000 మంది వివిధ వయసులలోని వారు ఆత్మహత్య కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. 20 కంటే ఎక్కువ ఆత్మహత్యా యత్నాలలో ఒక ఆత్మహత్య మరణం సంభవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. మొత్తం మీద ప్రపంచంలో 100 కోట్ల మందికి పైగా వివిధ మానసిక ఆరోగ్య రుగ్మతలతో జీవిస్తున్నారని నివేదించింది.
మెంటల్ హెల్త్ అట్లాస్ 2024
‘వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే’, ‘మెంటల్ హెల్త్ అట్లాస్ 2024’అనే రెండు కొత్త అధ్యయన నివేదికల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వివరాలన్నిటినీ పొందుపరిచింది. రానున్న వారాల్లో, ‘మెంటల్ హెల్త్ అట్లాస్ 2024’నివేదికలో భాగంగా దేశాల వారీగా డేటాను విడుదల చేయనుంది. కోవిడ్ తర్వాత మానసిక అనారోగ్యాలపై డబ్ల్యూహెచ్‌ఓ చేపట్టిన తొలి కీలకమైన అధ్యయనాలివి.
ప్రధాన మానసిక రుగ్మతలు
మానవాళిని చుట్టు ముడుతున్న మానసిక రుగ్మతల్లో ‘ఆందోళన’, ‘ఒత్తిడి’లను ప్రధానమైనవిగా డబ్ల్యూహెచ్‌ఓ గుర్తించింది. 2021లో, అన్ని మానసిక రుగ్మతల్లో ఇవి రెండూ ‘మూడింట రెండు వంతుల’కంటే ఎక్కువగా ఉన్నట్లు కనుగొంది. నివేదిక ప్రకారం – 2011–2021 మధ్య మానసిక రోగుల సంఖ్య ప్రపంచ జనాభా కంటే వేగంగా పెరిగింది! దశాబ్దం క్రితం జనాభాలో 0.9 తొమ్మిది శాతంగా ఉన్న మానసిక రుగ్మతలు 13.6 శాతానికి చేరాయి.
లక్ష్యానికి దూరంగా ఐరాస
అన్ని దేశాలలో, అన్ని సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో యువతలో సంభవించే మరణాలలో ఆత్మహత్యలే ఎక్కువగా ఉంటున్నాయి. 2030 నాటికి కనీసం మూడింట ఒక వంతు ఆత్మహత్యలను తగ్గించటానికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగంగా ఐక్యరాజ్య సమితి పెట్టుకున్న లక్ష్యం నెరవేరేలా కనిపించటం లేదు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఆ గడువు నాటికి 13 శాతం తగ్గుదల మాత్రమే సాధ్యం అయ్యేలా ఉందని డబ్ల్యూహెచ్‌ఓ అంచనా వేస్తోంది.
భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు
» తగినన్ని మానసిక చికిత్స ఆసుపత్రులు లేకపోవటం
» ఉన్నవాటిలో కూడా నిర్వహణ పరమైన లోపాలు
» రోగుల పట్ల సిబ్బంది క్రూరత్వం, నిర్లక్ష్యం
» విధి నిర్వహణలో ఉదాసీనత, నిధుల లేమి
» శిక్షణ పొందిన నర్సులు, సోషల్ వర్కర్‌లు, సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు, కౌన్సెలర్‌లు, ఇతర ఆరోగ్య కార్యకర్తల తీవ్ర కొరత.
40 దాటితే సమస్యలే
» 2021లో ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల 70 లక్షల మందిలో మానసిక రుగ్మతలు నమోదు అయ్యాయి. (బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ మెంటల్ హెల్త్, న్యూరో సైన్సెస్ నివేదిక ప్రకారం ఇండియాలో 3 కోట్ల మంది తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు)
» మొత్తం రుగ్మతల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువగా ఆందోళన, ఒత్తిడి ఉంటున్నాయి.
» 2011– 2021 మధ్య, మానసిక రోగుల సంఖ్య ప్రపంచ జనాభా కంటే వేగంగా పెరిగింది.
» పురుషులలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండటం, బలహీనమైన బంధాలు, (అటెన్షన్ డెఫిసిట్ హైపర్‌యాక్టివిటీ డిజార్డర్ – ఏడీహెచ్‌డీ, ఆటిజం స్పెక్ట్రమ్) వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. 18 ఏళ్లలోపు వారిలో.. వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల, నైపుణ్యాలు లేకపోవడం వంటివి ఎక్కువగా ఉంటున్నాయి.
» స్త్రీలలో ప్రధాన సమస్యలు.. ఆందోళన, ఒత్తిడి, ఈటింగ్ డిజార్డర్ (ఎక్కువ లేదా తక్కువ తినడం వంటి రుగ్మతలు).
» నలభై ఏళ్లు దాటాక ఒత్తిడి, ఆందోళన పెరిగిపోతున్నాయి.
» 50 – 69 సంవత్సరాల మధ్య మనోవైకల్యాలు గరిష్ట స్థాయికి చేరుకుంటున్నాయి.