
జస్ట్ 5 నిమిషాల టైమ్ కేటాయించండి
వాయిదాలకు చెక్ పెట్టే మార్గం ఇదే
పనిని నిబద్ధతతో ప్రారంభిస్తే చాలు
రోజువారీ సాధనంగా సులభ నియమం
స్టార్టింగ్ ప్రాబ్లం.. మనం తరచూ వినే డైలాగ్. తలపెట్టిన పనులను తరచూ వాయిదా వేస్తుంటారు కొందరు. వారిని ఆట పట్టించడానికి ‘స్టార్టింగ్ ప్రాబ్లమా’ అని అంటుంటాం. వ్యాయామం, ఇంటి పనుల వంటివి ప్రారంభించడం కష్టంగా అనిపిస్తుందా? యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ హాస్పిటల్స్‌లో న్యూరాలజీ వైద్యులు, న్యూరో సైంటిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఫేయ్ బెగేటి ఓ చక్కటి, సులభ పరిష్కారాన్ని ప్రతిపాదిస్తున్నారు. మెదడు శక్తిని పెంచడానికి, మానసిక అడ్డంకులను తొలగించడానికి నిబద్ధతతో కూడిన ఓ ‘5 నిమిషాలు’ చాలు అంటున్నారు.
రేపట్నుంచి వాకింగ్‌కు వెళ్తా..
డిసెంబర్ 31 నాడు.. ‘జనవరి 1 నుంచి వాకింగ్ లేదా వ్యాయామం చేస్తా’
రేపట్నుంచి ఉదయం ఆరింటికే నిద్ర లేస్తా..పోటీ పరీక్షలకు రేపట్నుంచి ప్రిపరేషన్ మొదలుపెడతా..
.. ఇలాంటి నిర్ణయాలు చాలామంది తీసుకుంటారు. కానీ, బద్ధకం వాటిని అమలు చేయనివ్వదు. అలాంటి కష్టమైన పనులను చేయడంలో మనసు, మెదడు.. రెండూ మొండికేస్తుంటాయి. మరి, దీన్ని అధిగమించడం ఎలా? 5 నిమిషాల నియమం.. మనసును సిద్ధం చేసే ఓ చిట్కా. ఇది వాయిదా వేసే మనస్తత్వాన్ని మారుస్తుంది.
తద్వారా మానసిక అలసట తగ్గుతుందని బెగేటి అంటున్నారు. ఒక పనిని ప్రారంభించడానికి మనసు సన్నద్ధంగా లేనప్పుడు.. ఆ పనిని కేవలం 5 నిమిషాల సేపు చేసి చూడాలి. సాధారణంగా మన మెదడు పని కష్టాన్ని ఎక్కువగా అంచనా వేస్తుంది. అందువల్ల ఎక్కువ సేపు చేస్తే అలసిపోతానని ముందే ఊహించుకుంటుంది. కాబట్టి 5 నిమిషాల పాటు నిబద్ధతతో పనిచేస్తే మెదడు అలవాటు పడి, తరవాత ఆ పని కొనసాగించేలా ప్రేరేపిస్తుంది.
మానసిక అలసటే పెద్ద సమస్య
శారీరక అలసట ఉన్నా ఫర్వాలేదుగానీ.. మానసిక అలసట ఉంటే మాత్రం మెదడు పనిచేయనివ్వదు. మెదడు అలసటను.. స్మార్ట్‌ఫోన్ ‘లో బ్యాటరీ’ మోడ్‌తో పోల్చారు బెగేటి. లో బ్యాటరీ ఉన్నా మనం పనిచేస్తుంటే.. ‘బ్యాటరీ లో’ అని ప్రతిసారీ అరుస్తున్నట్టే.. ‘నేను చేయను/చేయడానికి సిద్ధంగా లేను’ అని మెదడు కూడా మొరాయిస్తుంది. సోషల్ మీడియా స్క్రోలింగ్ వంటి తక్షణ వినోదాన్ని అందించే సాధారణ కార్యకలాపాలను ఎంచుకోవడం ద్వారా.. మెదడు తక్కువ కష్టమైన పనులవైపు మొగ్గు చూపుతుంది. ‘5 నిమిషాల’ నియమం.. మెదడుకున్న ఈ బద్ధకానికి చక్కటి చిట్కాలా పనిచేస్తుంది. ‘5 నిమిషాలే కదా చేసేద్దాం’ అని చేసేస్తుంది.
దినచర్యగా మారుతుంది
ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు మెదడు డోపమైన్ ను విడుదల చేస్తుంది. ఇది ప్రేరణతోపాటు ఆనందం ఇచ్చే రసాయనం. ఈ 5 నిమిషాల ప్రక్రియ.. మనలో జోష్ నింపి ఆ సమయం తరవాత కూడా పని చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక దినచర్యగా అలవాటైతే.. దీర్ఘకాలంలో మెదడు చురుగ్గా, మరింత ప్రభావవంతంగా పనిచేసేందుకు దారితీస్తుందని బెగేటి పేర్కొన్నారు. వ్యాయామం, ఇంటి బాధ్యతలతో సహా ఏదైనా సవాలుతో కూడిన, శక్తిని వినియోగించే పనికి ఈ నియమం రోజువారీ సాధనంగా పనిచేస్తుంది. 5 నిమిషాల నియమం.. వాయిదా వేసే విధానానికి చెక్ పెట్టడంలో సహాయపడుతుంది. అదే సమయంలో నిర్ణయం తీసుకోవడంలోనూ , దృష్టి కేంద్రీకరించిన పని వల్ల వచ్చే అలసటను తగ్గించి మెదడును చురుగ్గా ఉంచుతుంది.
చిన్న చిన్న ప్రయత్నాలు
⇒ చిన్న చిన్న ప్రయత్నాలతో మెదడును సిద్ధం చేయండి. అవి నిరంతరం పనిని కొనసాగించేలా ప్రేరేపిస్తాయి.
⇒ రోజూ కేటాయించే ఆ 5 నిమిషాలు.. అంటే సంవత్సరానికి సుమారు 30 గంటల అభ్యాసంతో స్థిరంగా చేసే చిన్న పనులు పెద్ద ఫలితాలను ఇస్తాయి.
⇒ పనులను మరింత సులువుగా మొదలుపెట్టేందుకు ఈ చిట్కా తోడ్పడుతుంది.
⇒ మెదడు.. చేయనని మొండికేసే స్థితి నుంచి నేను చేయగలననే చురుకైన స్థితికి మారడానికి ఈ నియమం దోహద పడుతుంది.
ఇలా విజయవంతం చేయండి
⇒ చేయాల్సిన పూర్తి పని నుంచి ఒక నిర్దిష్ట చిన్న విభాగాన్ని మీ ప్రారంభ సాధనంగా ఎంచుకోండి
⇒ ఇందుకోసం టైమర్‌లో అయిదు నిమిషాల సమయాన్ని సెట్ చేయండి
⇒ మీ దృష్టిని మరల్చే వాటిని గుర్తించి తొలగించండి.
⇒ 5 నిమిషాల తర్వాత పురోగతిని చెక్ చేయండి. దీనిని బట్టి ఆ పనిని కొనసాగించాలా వద్దా అని నిర్ణయించుకోండి.