9 రాష్ట్రాలకు కొత్త సీజేలు

New Chief Justice To 9 States Along With AP And Telangana - Sakshi

బదిలీపై నలుగురు.. పదోన్నతిపై ఐదుగురు

దేశవ్యాప్తంగా 14 మంది బదిలీ 

తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ హిమా కోహ్లి

ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి 

కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులు 

రాష్ట్ర హైకోర్టుకు రానున్న తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి 

ఉత్తరాఖండ్‌కు ప్రస్తుత సీజే రాఘవేంద్ర చౌహాన్‌ 

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు (సీజే) రానున్నారు. వీరిలో నలుగురు సీజేలు బదిలీపై రానుండగా.. ఐదుగురు న్యాయమూర్తులకు సీజేగా పదోన్నతి లభించింది. అలాగే మరో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులు ఇతర రాష్ట్రాలకు బదిలీ అయ్యారు. మొత్తమ్మీద దేశవ్యాప్తంగా సీజేలు, న్యాయమూర్తులు కలిపి 14 మందికి బదిలీ అయింది. ఈ మేరకు సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టులో సీనియర్‌ న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్‌ హిమా కోహ్లి.. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ఉత్తరాఖండ్‌ సీజేగా బదిలీ అయ్యారు. ఇక ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సిక్కిం హైకోర్టు సీజే జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి రానుండగా.. ఏపీ ప్రస్తుత సీజే జస్టిస్‌ జేకే మహేశ్వరి సిక్కిం సీజేగా బదిలీ అయ్యారు. అలాగే కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి.. ఏపీ హైకోర్టుకు బదిలీపై రానున్నారు.

జస్టిస్‌ హిమా నేపథ్యం ఇదీ.. 
తెలంగాణ హైకోర్టుకు సీజేగా రానున్న జస్టిస్‌ హిమా కోహ్లి ఢిల్లీలో 1959 సెప్టెంబర్‌ 2న జన్మించారు. ఢిల్లీలోని సెయింట్‌ థామస్‌ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేసుకున్నారు. సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి బీఏ గ్రాడుయేట్‌ పట్టా పొందారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి చరిత్రలో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ చేశారు. 1984లో లా పట్టా అందుకుని ఢిల్లీ బార్‌ కౌన్సిల్‌లో నమోదయ్యారు. 1999 నుంచి 2004 వరకు ఢిల్లీ మున్సిపల్‌ కౌన్సిల్‌కు స్టాండింగ్‌ కౌన్సెల్‌గా, న్యాయ సలహాదారుగా పనిచేశారు. 2006 మే 29న ఢిల్లీ హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 ఆగస్టు 29న పూర్తికాలం న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఢిల్లీ రాష్ట్ర న్యాయసాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌పర్సన్‌గా, నేషనల్‌ లా యూనివర్సిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఢిల్లీ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ చైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తున్నారు.

కరోనా పరీక్షల వెనుక ఆమె.. 
ఢిల్లీలో కరోనా పరీక్షలు ఎక్కువగా నిర్వహించడానికి ప్రయోగశాలలు పెంచడం, ఫలితాలు ఒకే రోజులో వచ్చేలా చేయడం వంటి ఆదేశాలు జస్టిస్‌ హిమా కోహ్లి ఇచ్చినవే. ప్రస్తుతం ఢిల్లీ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ కార్యనిర్వాహక చైర్‌పర్సన్‌గానూ ఆమె వ్యవహరిస్తున్నారు. న్యాయమూర్తిగా అధికారిక విధులు నిర్వర్తించడంతో పాటు ప్రత్యామ్నాయ వివాద పరిష్కారం ఫోరమ్‌గా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించడంపై ఆమె ఆసక్తి కనబరుస్తారు. పర్యావరణ పరిరక్షణలో న్యాయ వ్యవస్థ పాత్ర, కుటుంబ వివాదాల పరిష్కారంలోనూ ఆమె తనదైన ముద్ర వేసుకున్నారు. కాగా, జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్‌ కర్ణాటక హైకోర్టు నుంచి 2018 నవంబర్‌ 8న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. 2019 ఏప్రిల్‌ 3న తెలంగాణ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జూన్‌ 22న పూర్తికాలం ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ఆమె చేపట్టిన బాధ్యతలు.. 

  •  2017 ఆగస్టు 8 నుంచి పశ్చిమ బెంగాల్‌ నేషనల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ జ్యుడీషియల్‌ సైన్సెస్‌కు సభ్యురాలుగా ఉన్నారు. 
  • నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ప్రచురించే న్యాయ దీప్‌ ఎడిటోరియల్‌ కమిటీ సభ్యురాలుగా 7.5.2019 నుంచి ఉన్నారు.  
  • ఢిల్లీ జ్యుడీషియల్‌ అకాడమీ కమిటీ చైర్‌పర్సన్‌గా 2020 మార్చి 11 నుంచి ఉన్నారు. 
  • ఢిల్లీ హైకోర్టు మిడిల్‌ ఇన్‌కం గ్రూప్‌ లీగల్‌ ఎయిడ్‌ సొసైటీ చైర్‌పర్సన్‌గా 2020 జూన్‌ 29 నుంచి ఉన్నారు. 
  •  నేషనల్‌ లా యూనివర్సిటీ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సభ్యురాలిగా 2020 జూన్‌ 30 నుంచి ఉన్నారు.  

బదిలీ అయిన ప్రధాన న్యాయమూర్తులు..

ప్రధాన న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం
జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్ తెలంగాణ ఉత్తరాఖండ్
జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి ఆంధ్రప్రదేశ్ సిక్కిం
జస్టిస్‌ మహమ్మద్‌ రఫీఖ్‌ ఒడిశా మధ్యప్రదేశ్‌
జస్టిస్‌ అరూప్‌ కుమార్‌ గోస్వామి సిక్కిం  ఆంధ్రప్రదేశ్

సీజేలుగా పదోన్నతి పొందిన న్యాయమూర్తులు.. 

న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం
జస్టిస్‌ హిమా కోహ్లి ఢిల్లీ      తెలంగాణ 
జస్టిస్‌ ఎస్‌.మురళీధర్ పంజాబ్, హర్యానా     ఒడిశా 
జస్టిస్‌ సంజీబ్‌ బెనర్జీ కోల్‌కత్తా మద్రాస్
జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్ అలహాబాద్ జమ్ముకశ్మీర్
జస్టిస్‌ సుధాంశు ధులియా ఉత్తరాఖండ్‌ గౌహతి

బదిలీ అయిన న్యాయమూర్తులు       

న్యాయమూర్తి పేరు ప్రస్తుత హైకోర్టు బదిలీ స్థానం
జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి కోల్‌కతా  ఆంధ్రప్రదేశ్‌ 
జస్టిస్‌ సంజయ్‌యాదవ్ మధ్యప్రదేశ్‌  అలహాబాద్‌ 
జస్టిస్‌ రాజేష్‌ బిందాల్ జమ్ము కశ్మీర్ కల్‌కత్తా 
జస్టిస్‌ వినీత్‌ కొఠారి మద్రాస్‌ గుజరాత్‌ 
జస్టిస్‌ సతీష్‌ చంద్రశర్మ మధ్యప్రదేశ్ కర్ణాటక  

 

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top