ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు

National Curriculum Framework proposes Board exams twice a year - Sakshi

ఇంటర్‌లో ఉత్తమ స్కోరును ఎంచుకునే అవకాశం

ఎన్‌సీఎఫ్‌ ప్రతిపాదనలు

న్యూఢిల్లీ: జాతీయ విద్యావిధానంలో భాగంగా పరీక్షల విధానంలో కేంద్రం కొత్త మార్పులకు సిద్ధమైంది. ఇకపై ఇంటర్‌లో ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలని, భారతీయ భాషలు తప్పనిసరిగా చదవాలని నూతన కరిక్యులమ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌సీఎఫ్‌) ప్రతిపాదనలు చేసింది. అలాగే, 9–12 తరగతుల విద్యార్థులకు కనీస సబ్జెక్టుల సంఖ్యను పెంచాలని చెప్పింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఎన్‌సీఎఫ్‌ నివేదికను బుధవారం జాతీయ విద్య, పరిశోధన శిక్షణ మండలికి అందించారు.

ఏటా రెండు సార్లు పరీక్షలు నిర్వహించడం వల్ల ఆయా సబ్జెక్టుల్లో విద్యార్థులు ఏ పరీక్షలో అయితే ఉత్తమ మార్కులు సాధిస్తారో వాటినే ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర విద్యాశాఖ చెప్పింది. ఏటా రెండుసార్లు నిర్వహించడం వల్ల విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసే అవకాశం ఉంటుందని పేర్కొంది. క్రమక్రమంగా అన్ని బోర్డులు కూడా సెమిస్టర్‌ లేదా టర్మ్‌ బేస్డ్‌ వ్యవస్థకు మారతాయని కేంద్ర విద్యాశాఖ స్పష్టంచేసింది. దీనివల్ల విద్యార్థులు ఒక సబ్జెక్టును పూర్తిచేయగానే అతడు పరీక్ష రాయొచ్చని, ఇలా ఒక పరీక్ష పూర్తయినా విద్యార్థిపై కంటెంట్‌ భారం తగ్గుతుందని చెప్పింది.

ఎన్‌సీఎఫ్‌ను ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరిరంగన్‌ నేతృత్వంలోని జాతీయ స్టీరింగ్‌ కమిటీ రూపొందించింది. బోర్డు పరీక్షల్లో ఇలాంటి సంస్కరణలు తొలిసారి కాదు. 2009లో పదో తరగతిలో ‘నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ)’ విధానాన్ని ప్రవేశపెట్టగా, 2017లో రద్దుచేసి తిరిగి వార్షిక పరీక్షల విధానాన్ని తెచ్చారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఇకపై కచ్చితంగా మూడు లాంగ్వేజ్‌ సబ్జెక్టులు చదవడం తప్పనిసరని ఎన్సీఎఫ్‌ సిఫార్సు చేసింది.  వీరు మూడు లాంగ్వేజ్‌లతోపాటు మ్యాథ్స్, కంప్యూటేషనల్‌ థింకింగ్, సోషల్‌ సైన్స్, సైన్స్, ఆర్ట్‌ ఎడ్యుకేషన్, ఫిజికల్‌ ఎడ్యుకేషన్, వెల్‌–బియింగ్, వొకేషనల్‌ ఎడ్యుకేషన్‌ లాంటి వాటి నుంచి ఏడు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top