Nagpur Floods: ప్రాణాలు కాపాడుకునే యత్నం.. కాపాడమని కేకలు! నిస్సహాయంగా అంతా చూస్తుండగానే..

Nagpur: Car Washed Away Crossing Bridge In Heavy Rain - Sakshi

నాగ్‌పూర్‌: చుట్టు ముట్టేసిన వరద నీరు. మునిగిపోయిన వాహనం. ప్రాణాల కోసం హాహాకారాలు. చేతులు బయటకు పెట్టి వాహనపు పైభాగాన్ని పట్టుకుని రక్షించుకునే ప్రయత్నం. కాపాడండని కేకలు.  చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నా.. వరద ఉధృతిని చూసి సాహసం చేసి రక్షించలేని పరిస్థితి. వెరసి.. వాహనంతో పాటే కొట్టుకుని పోయి ప్రాణాలు వదిలారు. 

మహారాష్ట్ర నాగ్‌పూర్‌ సావ్నెర్‌ మండలం కేల్వాద్‌ దగ్గర నందా నదిలో ఈ విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్‌ ముల్తాయికి చెందిన ఓ కుటుంబం.. వివాహ వేడుక కోసం నాగ్‌పూర్‌కు వచ్చింది. తిరిగి ఊరికి వెళ్తున్న క్రమంలో వాళ్ల వాహనం బ్రిడ్జిపై వెళ్తుండగా.. హఠాత్తుగా వరద ముంచెత్తి ఇలా నదిలో చిక్కుకుని కొట్టుకుపోయింది. 

అంతా చూస్తుండగానే.. వాహనం మునిగి కొట్టుకుపోగా.. నిస్సహాయంగా చూస్తూ రక్షించే ప్రయత్నాలు చేయలేకపోయారు గ్రామస్తులు. ఉన్నతాధికారులకు సమాచారం అందించినా.. వాళ్లు వచ్చేసరికి ఆలస్యం అయ్యింది.  కొందరు మొబైల్స్‌లో వీడియోలు తీస్తూ ఉండిపోయారు. ముగ్గురు మృతి చెందగా.. అందులో ఒక మహిళ కూడా ఉంది. మరో ముగ్గురు వాహనంతో పాటు గల్లంతయ్యారు. వాళ్ల కోసం గాలింపు చర్యలు పెట్టారు అధికారులు. 

ఇదిలా ఉంటే.. మహారాష్ట్రలో వర్ష ప్రభావంతో ఇప్పటిదాకా(జూన్‌ 1 నుంచి జులై 10 దాకా) 83 మంది మృతి చెందారని స్టేట్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ వెల్లడించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top