శివయ్య మీద పాట: సింగర్‌ ఫర్మానీపై ముస్లిం పెద్దల నారజ్‌.. హిందూ సంఘాల రియాక్షన్‌ ఇది!

Muslim body Issued Fatwa Against Indian Idol fame Farmani Naaz - Sakshi

Farmani Naaz Har Har Shambhu:: యూట్యూబ్‌ సెన్సేషన్‌, ఇండియన్ ఐడల్‌ ఫేమ్‌ ఫర్మానీ నాజ్‌పై ముస్లిం మతపెద్దలు మండిపడుతున్నారు. ఆమె పాడిన హర్‌ హర్‌ శంభూ పాట వైరల్‌ కావడం ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువు అయ్యింది.

హిందూ దైవం శివుడి మీద పాట పాడిన కారణంతో ముస్లిం సంఘాలు ఫర్మానీ నాజ్‌పై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి. ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అంటూ ఫత్వా జారీ చేశాయి. ఆమె తన యూట్యూబ్‌లో ఛానెల్‌లో పాటను పోస్ట్‌ చేయగా.. వ్యూస్‌తో పాటు విమర్శలూ వెల్లువెత్తున్నాయి. ఈ చేష్టను ఇస్లాం వ్యతిరేక చర్యగా ఆరోపిస్తున్నాయి మతపెద్దలు.. ఇస్లాంలో, అందునా మహిళలు ఇలాంటి పనులు చేయడం మత విరుద్ధమేనని అంటున్నారు.

ఉత్తర ప్రదేశ్‌ దియోబంద్‌ను చెందిన మతపెద్ద  అసద్‌ ఖ్వాస్మీ దీన్నొక ‘పాపం’గా, ఘోరమైన నేరంగా అభివర్ణిస్తున్నారు. సంగీతానికి ఆమె దూరంగా ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉంటే.. స్టూడియోలో రికార్డింగ్‌ వెర్షన్‌ను ఆమె యూట్యూబ్‌లో రిలీజ్‌ చేశారు. శ్రావణ మాసం సందర్భంగా పాటను రిలీజ్ చేయగా.. హిందూ సంఘాలు, మరికొందరు అభినందిస్తుండగా, మరికొందరు విమర్శలు గుప్పిస్తున్నారు. 

ఫర్మానీ నాజ్‌ ఎవరంటే.. 

ఉత్తర ప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌కు చెందిన ఫర్మానీ నాజ్‌.. ప్రైవేట్‌ ఆల్బమ్స్‌తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె యూట్యూబ్‌కు 3.84 మిలియన్లకు పైగా సబ్‌ స్క్రయిబర్స్‌ ఉన్నారు. ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 12లో పాల్గొనడం ద్వారా ఆమెకు ఒక స్టార్‌ డమ్‌ దక్కింది. ఆమె వివాహిత. 2017లో ఆమెకు వివాహం అయ్యింది. అయితే కొడుకు పుట్టడం, ఆ కొడుక్కి జబ్బు చేయడంతో భర్త కుటుంబం ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించింది.

దీంతో బిడ్డను తీసుకుని ఆమె తన పుట్టింటికి వెళ్లి.. కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఆమె గొంతు బాగుండడంతో స్థానికంగా ఉండే ఓ కుర్రాడు.. ఆమె పాటల్ని యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు. అలా యూట్యూబ్‌ సెన్సేషన్‌గా, ఇ-సెలబ్రిటీగా గుర్తింపు పొందిన ఆమె, ఆపై ఇండియన్‌ఐడల్‌లో పాల్గొన్నారు. అయితే కొడుకు ఆరోగ్యం క్షీణించడంతో ఇండియన్‌ ఐడల్‌ మధ్యలోనే ఆమె వెనక్కి వచ్చేశారు. అయినా కూడా ఆమె కెరీర్‌ ముందుకు సాగిపోతూ వచ్చింది.

ఏనాడైనా సాయం చేశారా?
విమర్శలపై స్పందించిన ఫర్మానీ.. తనది పేద కుటుంబం అని, ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ సాయానికి ముందుకు రాలేదని, తన మానాన తాను బతుకుతుంటే.. ఇప్పుడు అడ్డుకోవాలని చూడడం, విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు ఆమె. అన్నింటికి మించి కళాకారులకు మతంతో సంబంధం ఉండదని గుర్తించాలంటూ ఆమె చెబుతున్నారు. అలా అనుకుంటే.. సలీం మోహమ్మద్‌ రఫీ లాంటి వాళ్లు భజన, హిందూ భక్తి పాటలు ఆలపించేవాళ్లు కాదు కదా.. దయచేసి హిందూ మతానికి, సంగీతానికి ముడిపెట్టొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారామె. అంతేకాదు తనకున్న రెండు చానెల్స్‌లో ఒకటి భక్తి గీతాల చానెల్‌ అని, అందులో కచ్చితంగా అన్ని మతాలకు సంబంధించిన ఆల్బమ్స్‌ అప్‌లోడ్‌ చేసి తీరతానని, అల్లా ఆశీస్సులు తనపై ఉంటాయని అంటున్నారామె.

హిందూ సంఘాల మద్దతు

ఇక తాజాగా శివుడి మీద పాట వైరల్‌ కావడంతో.. ఆమె మీద పలువురి అభినందలు సైతం కురుస్తున్నాయి. బీజేపీ నేత సంజీవ్‌ బాల్యన్‌.. ఆమె కొడుకు ట్రీట్‌మెంట్‌కు అవసరమయ్యే సాయం అందిస్తానని మాటిచ్చారు. మరోవైపు ముస్లిం సంఘాలు ఫర్మానీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేయడంపై వీహెచ్‌పీ మండిపడింది. వాళ్లు(ముస్లిం సంఘాలు) పేదలు, నిస్సహాయులకు మాత్రమే ఫత్వా జారీ చేస్తారు. ఇంతకాలం ఆమె యూట్యూబ్‌ ద్వారా పాడిన సంగతి మరిచిపోయినట్లు ఉన్నారు అంటూ ముస్లిం మత పెద్దలపై విమర్శలు గుప్పిస్తోంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top