కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. ఓటర్లకు కుక్కర్లు, చీరలు, నగదు పంపిణీ

Money Sarees Distributes To Voters In Karnataka Ahead Of Assembly Elections - Sakshi

సాక్షి, బెంగళూరు: రాష్ట్ర విధానసభ ఎన్నికలకు సమయం ఎక్కువగా లేదు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఆయా పార్టీల అభ్యర్థులు, ఆశావహులు నిమగ్నమై ఉన్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో గెలుపొంది తీరాలని ఎవరికి వారు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు ఓటర్ల మనసులు గెలుచుకునేందుకు కొన్ని పార్టీల నేతలు, ఆశావహులు నగదు, హెల్మెట్లు, కుక్కర్లు, చీరలు తదితర బహుమానాలను పంచడం చేపట్టారు. ఎన్నికల సంఘం అధికారులు కొన్నిచోట్ల దాడులు జరిపి కానుకలను జప్తు చేస్తోంది.

విస్తృతంగా తనిఖీలు
డబ్బు, వస్తువులు, వెండి బంగారు కానుకల పంపిణీ ఎన్నికలు రాగానే ఊపందుకుంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పోలీసులు బెంగళూరు వ్యాప్తంగా కట్టుదిట్టమైన నిఘా ఉంచారు. ప్రతి పోలీసు స్టేషన్‌ పరిధిలో తాత్కాలిక చెక్‌పోస్టులను తెరిచారు. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌ సంఖ్య, డ్రైవర్ల వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు.

వివిధ మార్గాల్లో ప్రలోభాలు
ఎంత పటిష్ట నిఘా ఉంచినా పోలీసులు, ఎన్నికల సంఘం అధికారులు, జీఎస్టీ అధికారులు, సిబ్బంది కళ్లుగప్పి టికెట్‌ ఆశావహులు, అభ్యర్థులు, వారి మద్దతుదారులు బహుమానాలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. ఆయా బహుమానాలను ఓటర్లకు పంపిణీ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే ముందస్తుగా ఓటర్లకు టోకెన్లను ఇచ్చి నిర్ణీత దుకాణాల్లో నిత్యవసర సరుకులను తీసుకునే వెసులుబాటును కల్పించారు.

చేతి గడియారాలు, వెండి దీపాలు, హెల్మెట్‌, కుక్కర్లు, మిక్సీలు, టీవీలు తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులు ఇందులో ఉన్నాయి. స్వతంత్ర అభ్యర్థులు తామేమీ తక్కువ కాదన్నట్లు ముందుకు వస్తున్నారు. కాగా, వాణిజ్య పన్నుల శాఖ ఈ తనిఖీల్లో ముందంజలో ఉంది. రసీదు లేకుండా సరుకుల రవాణా చేసిన, అక్రమంగా గోడౌన్‌లో వస్తువులను దాచినా, అనుమానస్పద కొనుగోళ్లు చేసినా పట్టేస్తోంది. సరుకు రవాణాకు సంబంధించి ఈ–ఇన్‌వాయిస్‌, ఈవే బిల్‌, సరుకు ప్రమాణం, కొనుగోలు దారుడు, సరఫరా దారుడు, చిరునామా తదితర సమాచారాలను క్షుణ్నంగా పరిశీలిస్తోంది.

రౌడీలకు హెచ్చరికలు
ఎన్నికల్లో ఓటర్లను బెదిరించడంలో రౌడీలు ముందుంటారు. అందుకే రౌడీలపై పోలీసు శాఖ ఒక కన్నేసింది. రౌడీషీటర్ల నడవడికపై నిఘా పెంచింది. రౌడీషీటర్లుగా ముద్రపడిన వారిని ముందస్తుగా పోలీసు స్టేషన్‌కు పిలిపించి హెచ్చరికలు జారీ చేస్తోంది. అలాగే ప్రమాదకరంగా అనిపించే ప్రముఖ రౌడీషీటర్లను నగర బహిష్కరణ చేస్తోంది. అలాగే పలువురు రౌడీషీటర్ల ఇంటిపై గస్తీ కాసే పోలీసులు హఠాత్తుగా తనిఖీలు చేస్తున్నారు. పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకుంటున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top