
గ్వాలియర్: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఎప్పుడూ బిజీగా ఉండే రోడ్డుపై జరిగిన దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన ఐకానిక్ రూప్ సింగ్ స్టేడియం ముందు జరిగింది. స్థానికంగా కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అరవింద్ ఒకప్పటి తన లివ్ ఇన్ భాగస్వామి నందినిని కాల్చిచంపాడు.
రక్తమోడుతున్న భాగస్వామి పక్కన తుపాకీ తిప్పుతూ..
శుక్రవారం మధ్యాహ్నం అరవింద్ రూప్ సింగ్ స్టేడియం మీదుగా వెళుతున్న తన లివ్ ఇన్ పార్ట్‌నర్ నందినిని ఆపి, ఆమె ముఖంపై పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. తరువాత రక్తంతో తడిసి, బాధతో విలవిలలాడుతున్న నందిని పక్కనే కూర్చుని తన తుపాకీని ఊపుతూ అటువైపుగా వెళుతున్నవారందరినీ భయపెట్టాడు. దీంతో అక్కడున్నవారంతా పారిపోయారు. ఆ దారిలో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అరవింద్ తన దగ్గరున్న తుపాకీని పోలీసుల వైపు గురిపెట్టాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించి, ఆ ప్రాంతాన్ని తమ అదుపులోనికి తీసుకున్నారు.
పోలీసులనూ బెదిరించి..
నిందితుడు అరవింద్‌ను అరెస్టు చేశారు. తీవ్రంగా గాయపడి, రక్తస్రావంతో విలవిలలాడుతున్న నందినిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించిందని పోలీసులు తెలిపారు.‘నేను కోర్టు నుండి వస్తుండగా తుపాకీ శబ్దాలు విన్నాను. అతను వరుసగా మూడు బుల్లెట్లను ఆమెపైకి కాల్చడం చూశాను. జనం భయంతో స్తంభించిపోయారు. ఎవరూ అతన్ని పట్టుకునేందుకు సాహసించలేదు’ అని ప్రత్యక్ష సాక్షి, న్యాయవాది ఎంపీ సింగ్ తెలిపారు. పోలీసు అధికారి నాగేంద్ర సింగ్ సికార్వర్ మాట్లాడుతూ నిందితుడు అరవింద్ తన దగ్గరున్న ఆయుధంతో పోలీసులను బెదిరించడానికి ప్రయత్నించాడని తెలిపారు. అతని దగ్గరున్న తుపాకీని స్వాధీనం చేసుకున్నామని, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయన్నారు.
మొదటి వివాహం, పిల్లలను దాచిపెట్టి..
నిందితుడు కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడని, నందినితో లివ్ ఇన్ రిలేషన్‌షిప్ లో ఉన్నాడని ఎస్పీ ధరమ్‌వీర్ సింగ్ మీడియాకు తెలిపారు. ఇద్దరికీ గతంలో వివాహాలు జరిగి విడాకులు తీసుకున్నారని, గతంలో లివ్ ఇన్‌లో ఉన్నారని, అరవింద్ తన మొదటి వివాహాన్ని, పిల్లలున్నారనన్న సంగతిని దాచిపెట్టి, నందినిని ఆర్య సమాజ్‌లో మోసపూరితంగా వివాహం చేసుకున్నాడనే ఆరోపణలున్నాయన్నారు. అయితే ఆ సంబంధం ఎన్నో రోజులు నిలవలేదు. అరవింద్‌పై నందిని పలుమార్లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి.
హత్యాయత్నం నుంచి తప్పించుకున్నా..
2024, నవంబర్‌లో అరవింద్ అతని స్నేహితురాలు పూజ పరిహార్‌తో కలసి తనపై దాడి చేశాడని నందిని గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే అరవింద్ ఆమెను కారుతో ఢీకొట్టడానికి ప్రయత్నించినప్పుడు కూడా ఆమె ఆ హత్యాయత్నం నుండి బయటపడింది. ఆమె ఫిర్యాదు దరిమిలా అరవింద్‌ను అరెస్టు చేసినప్పటికీ, ఆ తరువాత బెయిల్ పొంది, నందినిని వేధిస్తూ వస్తున్నాడు. సెప్టెంబర్ 9న ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన నందిని అరవింద్‌పై పలు ఆరోపణలు చేసింది. అరవింద్ తనపై ఏఐ జనరేటెడ్ అశ్లీల వీడియోలు రూపొందిస్తూ, సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నడని ఆరోపించింది. తనను చంపేస్తానని బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది.
మహిళల రక్షణపై సందేహాలు
శుక్రవారం నాడు నందిని మరోమారు ఎస్పీ కార్యాలయానికి వెళుతుండగా, అరవింద్ ఆమెను అడ్డుకున్నాడు. తుపాకీతో ఆమె ముఖంపై అత్యంత దారుణంగా కాల్పులు జరిపాడు. ఎప్పుడూ జనం రద్దీతో కళకళలాడే రోడ్డు రక్తసిక్తంగా మారిపోయింది. పదేపదే పోలీసు రక్షణ కోరిన మహిళపై పట్టపగలు.. అదీ వీఐపీ జోన్‌లో చోటుచేసుకున్న దారుణం అందరినీ కలచివేస్తోంది. మహిళల రక్షణపై పలు అనుమానాలు లేవదాస్తోంది.ఘ ఈ ఘటనకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.