మణిపూర్‌: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు | Sakshi
Sakshi News home page

మణిపూర్‌: ఎస్టీ జాబితా నుంచి మైతేయిల తొలగింపు

Published Fri, Feb 23 2024 6:00 AM

Manipur High Court revokes inclusion order for Meitei community in ST List - Sakshi

ఇంఫాల్‌: మణిపూర్‌ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రెండు ప్రధాన వర్గాలైన కుకీలు, మైతేయిల మధ్య ఘర్షణకు దారితీసిన తమ వివాదాస్పద ఉత్తర్వులో సవరణ చేసింది. మైతేయి వర్గాన్ని షెడ్యూల్డ్‌ తెగ(ఎస్టీ)ల్లో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని మణిపూర్‌ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ 2023 మార్చి 27న జారీ చేసిన ఉత్తర్వులో ఒక పేరాను తొలగించింది. అప్పట్లో కోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ గిరిజనులైన కుకీలు ఆందోళన ప్రారంభించారు. క్రమంగా పెద్ద ఘర్షణగా మారింది.

రాష్ట్రంలో నెలల తరబడి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాల మధ్య జరిగిన హింసాకాండలో దాదాపు 200 మంది మృతిచెందారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. హైకోర్టు ఉత్తర్వును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఆల్‌ మణిపూర్‌ ట్రైబల్‌ యూనియన్‌ గతేడాది అక్టోబర్‌ అప్పీల్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. వివాదాస్పద ఉత్తర్వులో రెండు తెగల మధ్య శత్రుత్వానికి కారణమైన ఒక పేరాను తొలగిస్తున్నట్లు వెల్లడించింది. .

గిరిజనులను జాబితాలో చేర్చడం, మినహాయించడం అనే ప్రక్రియలను సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చేపడుతుందని కోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులకు సంబంధించి గతేడాది కుకీ తెగ సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టు సైతం ప్రశ్నించింది. ఎస్టీ జాబితాను కోర్టులు సవరించడం, మార్పులు చేయడం కుదరదని పేర్కొంది. ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చెందినదని స్పష్టం చేసింది.

మెయితీలకు రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశాన్ని పరిశీలించాలని గతేడాది కేంద్ర గిరిజన శాఖకు కోర్టు ప్రతిపాదించింది. దీనిపై నాగా, కుకీ-జోమి తెగలు రిజర్వేషన్లు ఇవ్వకూడదని డిమాండ్ చేశాయి. వారికి రిజర్వేషన్లు దక్కితే అటవీ ప్రాంతాల్లో తమ నివాసాలు, ఉద్యోగాల వాటా తగ్గిపోతాయని ఆందోళనను వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా మణిపూర్ హైకోర్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం వివాదాస్పద పేరాను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని అభిప్రాయపడింది. 

Advertisement
 
Advertisement