
రాజకీయాలు, ఎన్నికల కంటే ఫుడ్ ఆర్డర్లపైనే మెజారిటీ ఇండియన్ల తలమునక
81% మంది భారతీయులు రోజుకు 3 గంటలు ఏదో ఒక విషయంపై ఎక్కువగా ఆలోచిస్తున్నారు
61% మంది ఫుడ్ డెలివరీ గురించే ఆలోచన
74% మందికి ఏం ఆర్డర్ చేయాలి.. ఏం తినాలో అనేదానిపై దృష్టి
ఇండియా ఓవర్ థింకింగ్ రిపోర్ట్ 2025 నివేదికలో ఆసక్తికర అంశాలు వెల్లడి
దేశ రాజకీయాలు.. ఎన్నికలు వంటి ముఖ్యమైన అంశాల కంటే కూడా ప్రతీరోజు ఆన్‌లైన్‌లో చేసే ఫుడ్ ఆర్డర్లపైనే ఆలోచనలతో మెజారిటీ ఇండియన్లు తలమునకలు అవుతున్నారట. అంతే కాకుండా 81% మంది భారతీయులు ప్రతిరోజూ కనీసం మూడు గంటలపాటు ఏదో ఒక విషయమై తీవ్రమైన దీర్ఘాలోచనలు చేస్తున్నారట. ఎన్నికల కంటే కూడా 61% మంది ఫుడ్ డెలివరీ గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు.
దాదాపు 74% మందికి ఏ ఫుడ్ ఆర్డర్ చేయాలి..ఏం తినాలో అన్న నిర్ణయంపై దృష్టి కేంద్రీకరిస్తున్నారట. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో ఎవరికి ఓటు వేయాలనే నిర్ణయం కంటే కూడా ఆన్‌లైన్‌లో ఫుడ్‌కు సంబంధించి అనేక ఎంపికలు, డీల్స్ పట్ల ఆసక్తి, వాటిలో ‘సరైన’ఎంపికకు తమ మొబైల్ స్క్రీన్‌లను ఎక్కువ సేపు పరిశీలిస్తున్నారు. దీంతో అతిగా ఆలోచించడం అనేది భారతీయులకు ఓ కొత్త అలవాటుగా మారిపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. – సాక్షి, హైదరాబాద్
ఎన్నికలు ప్రతి ఐదేళ్లకు వస్తాయి.. కానీ లంచ్, డిన్నర్ ప్రతిరోజూ తప్పదు కాబట్టి సాపాటు సంతృప్తి ఇవ్వకపోతే కష్టమేనని ‘ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ’పైనే సిటిజన్లు అతిగా వర్రీ అవుతున్నట్టుగా తాజాగా సెంటర్ ఫ్రెష్–యు గావ్ సంయుక్తంగా నిర్వహించిన ‘ఇండియా ఓవర్‌థింకింగ్ రిపోర్ట్–2025’అధ్యయనంలో అనేక ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. అతిగా ఆలోచించడం..ఏదైనా విషయంపై దీర్ఘాలోచనలు చేయడమనేది ఇండియన్ల ‘న్యూ నార్మల్’గా మారిపోయిందా అన్న అభిప్రాయం సైతం వ్యక్తమవుతోంది.
దేశంలో అతిగా ఆలోచించడం ఒక విస్తృతమైన సమస్య అని తేలింది. దేశంలోని మెట్రోపాలిటన్ నగరాలతోపాటు ప్రథమ, ద్వితీయ శ్రేణి నగరాల్లోని విద్యార్థులు, వృత్తి నిపుణులు, స్వయం ఉపాధి పొందుతున్నవారు, ఇతర వర్గాల వారి నుంచి సమాచారం సేకరించారు. ఇందులో అతి ఆలోచనల వల్ల ఆహారం, జీవనశైలి అలవాట్లు, మానవ సంబంధాలు, కెరీర్, వృత్తిగత జీవితం తదితరాలు ఎలా ప్రభావితం అవుతున్నాయనే అంశాలను పరిశీలించారు.
ముఖ్యాంశాలు
⇒ ప్రతి నలుగురు భారతీయుల్లో ఒకరు అతిగా ఆలోచించడం ఒక స్థిరమైన అలవాటు అనే భావిస్తున్నారు
⇒ ఆహారం, జీవనశైలి, డిజిటల్, సామాజిక జీవితం, డేటింగ్, సంబంధాలు, కెరీర్ ఎంపికలతో సహా వివిధ రంగాల్లో నిర్ణయాలను అతిగా ఆలోచించడం ప్రభావితం చేస్తున్నాయి
⇒ 81% మంది భారతీయులు రోజుకు కనీసం మూడు గంటలు ఎక్కువగా ఆలోచిస్తారు.
⇒ ఈ విధంగా అధిక ఆలోచనలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి గణనీయమైన సంఖ్యలో ఇండియన్లు గూగుల్, చాట్ జీపీటీ వంటి సాంకేతికత వైపు మొగ్గు చూపుతున్నారు
⇒ అతిగా ఆలోచించడం, అనిశి్చతిని అధిగమించడానికి, మరింత స్పష్టతకు డిజిటల్ సాధనాలను ఉపయోగిస్తున్నారు
⇒ ఎన్నికల్లో రాజకీయ నాయకుడిని ఎన్నుకోవడం కంటే ఏం తినాలో ఎంచుకోవడం ఎక్కువ ఒత్తిడితో కూడుకున్నదని 63% మంది భావన
⇒ ఓ సాధారణ బిర్యానీ ఆర్డర్ చేయడానికి ఫుడ్ యాప్ ద్వారా 30 నిమిషాలు స్క్రోలింగ్ చేస్తున్న ఉదంతాలున్నాయి
⇒ ఆర్డర్ చేసే ఆహార ఎంపికలో అస్పష్టతకు గురికావడం లేదా డబ్బుకు తగిన విలువ లభించకపోవడం గురించి ఆందోళన చెందుతున్నారు
⇒ డిస్కౌంట్లు, డెలివరీ సమయ అంచనాలు తదితరాలపై అధిక దృష్టి
⇒ డిజిటల్ ఒత్తిళ్లు, సోషల్ మీడియా ఆందోళన, పని ప్రదేశంలోని సందేహాలు, ప్రాంతాలు, వృత్తుల్లో రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నాయి
⇒ మెనూ మెల్ట్‌డౌన్‌ల మొదలు ఇన్‌స్టా, ఫేస్‌బుక్, వాట్సాప్‌లో తమ స్టోరీల పోస్టింగ్ చేయాలా వద్దా అనే వరకు..అతిగా ఆలోచించడం ఇప్పుడు భారతదేశానికి ఇష్టమైన కాలక్షేపంగా మారింది
⇒ అతిగా ఆలోచించడం అనేది మెజారిటీ ప్రజల అలవాటుగా మారిందని, మన డిజిటల్ జీవితాల్లో, రోజువారీ ఎంపికల్లో, సామాజిక డైనమిక్స్‌లో లోతుగా పాతుకుపోయింది
⇒ పని ప్రదేశాల్లో బాస్ ఏదైనా అంశంపై ఎస్ అని స్పందిస్తే దాని పట్ల 42% మంది ఆందోళన చెందుతున్నారు
⇒ 63% మంది రెస్టారెంట్‌లో వంటకం ఎంచుకోవడం రాజకీయ నాయకుడి ఎంపిక కంటే ఎక్కువ ఒత్తిడితో కూడుకున్నదని చెబుతున్నారు. ఈ సంఖ్య దక్షిణాదిలో 69%గా ఉంది
అతి ఆలోచనను డీకోడ్ చేయడమే..
‘సెంటర్ ఫ్రెష్ ఇండియా ఓవర్‌థింకింగ్ రిపోర్ట్ ద్వారా..నేటి హైపర్–కనెక్టెడ్ ప్రపంచంలో అతిగా ఆలోచించడం ఎలా వ్యక్తమవుతుందో డీకోడ్ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది ఒక సందేశాన్ని రెండవసారి ఊహించడం అయినా లేదా విందు ఎంపికను అతిగా విశ్లేషించడం అయినా, అతిగా ఆలోచించడమనేది రోజువారీ అలవాటుగా మారింది. ఈ మానసిక గందరగోళాన్ని హైలైట్ చేయడం ద్వారా, ఈ నివేదిక రోజువారీ మానసిక స్పష్టత యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించేలా ఆలోచనను రేకెత్తిస్తుంది’అని పర్‌ఫెట్టి వాన్ మెల్లె ఇండియా డైరెక్టర్ మార్కెటింగ్ గుంజన్ ఖేతాన్ పేర్కొన్నారు.