పెద్దల సభలో తెలంగాణ పంచాయితీ | Kishan Reddy Fires On KCR in Rajya Sabha about Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

పెద్దల సభలో తెలంగాణ పంచాయితీ

Apr 3 2026 1:55 AM | Updated on Apr 3 2026 11:55 AM

Kishan Reddy Fires On KCR in Rajya Sabha about Kaleshwaram Project

బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ వర్సెస్‌ బీఆర్‌ఎస్‌ 

ఏపీ పునర్‌వ్యవస్థీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో సవాళ్ల పర్వం 

‘కాళేశ్వరం’పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోండి.. లేదంటే సభా హక్కుల ఉల్లంఘనే: కేఆర్‌ సురేశ్‌రెడ్డి 

కాళేశ్వరం కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంలా మారిందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్‌ 

పెట్టరా పేరు అమరావతి.. పిలవరా ‘కమ్మ’రావతి : ఎంపీ రేణుకాచౌదరి  

సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు–2026పై జరిగిన చర్చలో తెలంగాణకు సంబంధించిన పలు అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ చర్చ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. వివిధ అంశాలపై పార్టీలు పరస్పరం విమర్శలు గుప్పించుకున్నాయి. 

ఆ వ్యాఖ్యలు అభ్యంతకరం: కేఆర్‌ సురేశ్‌రెడ్డి 
‘కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు కొట్టుకుపోయాయంటూ’కేంద్ర జలశక్తి మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి ఒక్క పైసా కూడా తీసుకోకుండా తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులతో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుపై కనీస అవగాహన లేకుండా మాట్లాడటం సరికాదన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలు సభను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని, రికార్డుల నుంచి ఆ వ్యాఖ్యలను తొలగించి క్షమాపణ చెప్పాలని, లేకుంటే సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సురేశ్‌రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వ అసమర్థత వల్లే మేడిగడ్డ బరాజ్‌లోని రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయన్నారు. తెలంగాణకు జాతీయ ప్రాజెక్టు, ఐటీఐఆర్‌ కారి డార్, స్టీల్‌ ఫ్యాక్టరీ, మైనింగ్‌ యూనివర్సిటీలతోపాటు వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన రూ.900 కోట్ల పెండింగ్‌ నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు 

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కిషన్‌రెడ్డి  
బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలపై కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘భద్రాచలం గ్రామాలను ఏపీలో కలపడం కాంగ్రెస్‌ రూపొందించిన విభజన చట్టంలోనే ఉంది. అప్పట్లో సోనియాగాంధీతో డిన్నర్‌ చేసి, ఆమె కాళ్లు పట్టుకున్న కేసీఆర్‌.. అప్పుడెందుకు ఆ గ్రామాల గురించి అడగలేదు? ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు? కేంద్రం నుంచి పైసా తీసుకోలేదని చెబుతున్నారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి కేసీఆర్‌ దుబాయ్‌లో నోట్లు ఏమైనా ముద్రించారా? అది కేసీఆర్‌ ఇంట్లో డబ్బు కాదు, ప్రజల డబ్బు. కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు వచ్చాయి. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఒక ఏటీఎంలా మారిపోయింది. ఎన్నికల ముందు కాళేశ్వరంపై విచారణ జరిపి కేసీఆర్‌ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్‌ నాయకులు, ముఖ్యమంత్రి ఇప్పుడు ఎందుకు ఆ పనిచేయడం లేదు’అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.  

అది ఎలాగూ అమరావతే ఎంపీ రేణుకాచౌదరి  
పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా ’కమ్మ’రావతి అంటూ రాజధాని అమరావతి పేరు చుట్టూ సాగుతున్న రాజకీయాలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. ‘అది ఎలాగూ అమరావతే. నేను అప్పటి ముఖ్యమంత్రితో కూడా చెప్పాను.. ’పెట్టరా పేరు అమరావతి.. లేకపోతే పిలవరా పేరు కమ్మరావతి.. పెట్టు పేరు!’అని నేనే అన్నాను. వారికి (కేంద్రానికి) అంత ధైర్యం ఉంటే, చెప్పింది అమలు చేసే సాహసం కూడా చేయమనండి. ఇది కేవలం ఒక కాస్మెటిక్‌ టచ్‌ (కంటితుడుపు చర్య) మాత్రమే.’అన్నారు. ‘కేంద్ర ప్రభుత్వం ఏపీ పునర్విభజన చట్టాన్ని కేవలం తన మిత్రపక్షాలకు (కూటమికి) మేలు చేసేందుకే వాడుకుంటోంది. అదే చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను మాత్రం ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తోంది’అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ రేణుకాచౌదరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. భద్రాచలం సరిహద్దుల్లోని ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆమె సభలో ఆవేదన వ్యక్తం చేశారు.  

ఆ ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలి: ఎంపీ వద్దిరాజు  
సూపర్‌బజార్‌ (కొత్తగూడెం): ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయాన భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఉన్న ఐదు గ్రామాలను ఏపీలో విలీనం చేశారని, ఆ గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌ వద్దిరాజు రవిచంద్ర కోరారు. అన్నదమ్ముల్లా విడిపోయి రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామనేది మొదటి నుంచి తమ పార్టీ విధానమని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీ మేరకు పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని, గిరిజన యూనివర్సిటీకి మరిన్ని నిధులు కేటాయించాలన్నారు. మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి మంత్రి కిషన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల్ని రికార్డుల నుంచి తొలగించాలని విజ్ఞప్తి చేశారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement