జేఈఈ అడ్వాన్స్‌డ్‌: విజయానికి యాభై రోజులు

JEE Advanced 2021: Preparation Guidance, Mock Test, Exam Date, Revision - Sakshi

అక్టోబర్‌ 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష

అందుబాటులో ఉన్న సమయం ఎంతో కీలకం

రివిజన్, ప్రాక్టీస్, సెల్ఫ్‌ అనాలిసిస్‌లదే కీలక పాత్ర

ప్రతి చాప్టర్‌కు సమయం కేటాయించాలంటున్న నిపుణులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు సాధించి.. ప్రతిష్టాత్మక ఐఐటీల్లో బీటెక్‌లో చేరడం దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థుల కల! తమ స్వప్నం సాకారం దిశగా కసరత్తును ముమ్మరం చేయాల్సిన కీలక సమయం ఆసన్నమైంది! ఎందుకంటే.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌–2021 తేదీ ఖరారైంది. అక్టోబర్‌ 3వ తేదీన పరీక్ష జరుగనుంది. అంటే.. పరీక్షకు ఇంకా యాభై రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. అభ్యర్థులు ఈ విలువైన సమయంలో తమ ప్రిపరేషన్‌కు పదును పెడుతూ.. ప్రణాళికబద్ధంగా, వ్యూహాత్మకంగా ముందుకుసాగాలి. అప్పుడే అడ్వాన్స్‌డ్‌లో విజయావకాశాలు మెరుగవుతాయి. ఈ నేపథ్యంలో.. జేఈఈ–అడ్వాన్స్‌డ్‌లో సక్సెస్‌ సాధించేందుకు నిపుణుల ప్రిపరేషన్‌ గైడెన్స్‌...

విద్యార్థులు ఇంటర్‌లో చేరిన తొలిరోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్‌ కోసం కృషి చేస్తుంటారు. వాస్తవానికి పరీక్షకు నెల రోజులు ముందు సాగించే ప్రిపరేషన్‌ అత్యంత కీలకం అంటున్నారు నిపుణులు. రెండేళ్ల నుంచీ చదువుతున్నాం కదా.. అనే ధీమా ఎంతమాత్రం సరికాదని సూచిస్తున్నారు. ప్రస్తుతం సబ్జెక్ట్‌ వారీ ప్రిపరేషన్‌ షెడ్యూల్‌ రూపకల్పన మొదలు.. పరీక్ష రోజు వ్యవహరించాల్సిన తీరు వరకూ.. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. అత్యంత శ్రద్ధతో, ఏకాగ్రతతో ప్రిపరేషన్‌ కొనసాగించాలి. ఇప్పటి వరకు చదివింది ఒక ఎత్తయితే.. ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ యాభై రోజుల్లో సాగించే ప్రిపరేషన్‌ ఐఐటీలకు దారి చూపుతుందని గుర్తించాలి. 


రివిజన్‌కు ప్రాధాన్యం

ప్రస్తుతం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థులు వీలైనంత ఎక్కువ సమయం పునశ్చరణకు కేటాయించాలి. 2019తో పోల్చుకుంటే గత ఏడాది, ఈ ఏడాది అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు ఆలస్యంగా జరుగుతున్న విషయం తెలిసిందే. అంటే.. అడ్వాన్స్‌డ్‌ లక్ష్యంగా పెట్టుకున్న విద్యార్థులకు ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయమే లభించింది. కాబట్టి ఇప్పటికే సీరియస్‌ అభ్యర్థులంతా సిలబస్‌ అంశాల ప్రిపరేషన్‌ పూర్తి చేసుకొని ఉంటారు. కాబట్టి ప్రస్తుత సమయంలో రివిజన్‌కు అధిక సమయం కేటాయించడం మేలు. 

ప్రతి సబ్జెక్ట్‌–ప్రతి రోజూ
► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌ పరంగా.. విద్యార్థులు ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్‌ రివిజన్‌ చేసేలా రోజువారీ ప్రణాళిక రూపొందించుకోవాలి. ప్రతి రోజూ తమ ప్రిపరేషన్‌ సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకొని.. పరీక్షలో అడిగే మూడు సబ్జెక్ట్‌ల(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ)కు కేటాయించాలి. ప్రతి సబ్జెక్ట్‌కు రోజుకు కనీసం నాలుగు గంటల సమయం కేటాయించుకోవాలి.

► ఆయా సబ్జెక్ట్‌కు కేటాయించిన నాలుగు గంటల్లో.. మూడు లేదా మూడున్నర గంటలు రివిజన్, ప్రాక్టీస్‌ చేయాలి. మిగతా సమయాన్ని ఆ రోజు అప్పటివరకు చదివిన సదరు సబ్జెక్ట్‌ అంశాల స్వీయ విశ్లేషణ చేసుకోవాలి. తద్వారా సదరు టాపిక్‌లో తమ బలాలు, బలహీనతలపై అవగాహన ఏర్పడుతుంది. బలహీనంగా ఉన్న టాపిక్స్‌కు పరీక్షలో ఎక్కువ వెయిటేజీ ఉందని భావిస్తే.. వాటిలోని ముఖ్యాంశాల(కాన్సెప్ట్‌లు, ఫార్ములాలు)పై దృష్టి పెట్టాలి. వీలైతే పూర్తి అభ్యసనం.. లేదంటే.. ముఖ్య ఫార్ములాలు, కాన్సెప్ట్‌లకు, సినాప్సిస్‌కు సమయం కేటాయించాలి. 

కచ్చితత్వం
ఆయా సిలబస్‌ టాపిక్స్‌పై విద్యార్థులు సంపూర్ణ అవగాహన పెంచుకోవాలి. సదరు అంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. పూర్తి కచ్చితత్వంతో సమాధానాలు సాధించేలా పట్టు బిగించాలి. అందుకోసం సంబంధిత టాపిక్‌ నుంచి ప్రశ్నలను ఒకటికి రెండుసార్లు ప్రాక్టీస్‌ చేయాలి. పలు ప్రశ్నలకు పొరపాటు సమాధానాలు ఇచ్చామని భావిస్తే.. సదరు టాపిక్‌ కోసం మరింత ఎక్కువ సమయం కేటాయించాలి. 


పాత ప్రశ్న పత్రాలు

ప్రస్తుత సమయంలో అభ్యర్థులు పాత ప్రశ్న పత్రాలను ఎక్కువగా సాధన చేయాలి. ఫలితంగా సబ్జెక్ట్‌ నైపుణ్యాలు మెరుగవుతాయి. పరీక్షలో ప్రశ్నలు అడుగుతున్న తీరు, ప్రతి ఏటా ప్రశ్నల శైలిలో మార్పు వంటి విషయాలపై అవగాహన లభిస్తుంది. 25 నుంచి 30 వరకూ.. ప్రీవియస్, మోడల్‌ కొశ్చన్‌ పేపర్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తే.. పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు అడిగినా.. సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

మాక్‌ టెస్ట్‌లు, గ్రాండ్‌ టెస్ట్‌లు
విజయానికి చేరువయ్యేందుకు అనుసరించాల్సిన మరో వ్యూహం.. మాక్‌ టెస్ట్‌లు, గ్రాండ్‌ టెస్ట్‌లకు హాజరు కావడం. ఇందుకోసం విద్యార్థులు ప్రత్యేక సమయాన్ని కేటాయించుకోవాలి. పరీక్షకు ముందు పది రోజుల సమయాన్ని వీలైనంత మేరకు మాక్‌ టెస్ట్‌లు, గ్రాండ్‌ టెస్ట్‌లకు కేటాయించాలి. వీటి ఫలితాల ఆధారంగా తమ సామర్థ్యాల విషయంలో అవగాహన పొందాలి. 

ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు
అడ్వాన్స్‌డ్‌ విద్యార్థులు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ.. ఇలా మూడు సబ్జెక్ట్‌లకు సంబంధించి ముఖ్యమైన ఫార్ములాలు, కాన్సెప్ట్‌లు, సిద్ధాంతాలపై ప్రత్యేక దృష్టిపెట్టి ప్రిపరేషన్‌ సాగించాలి. అడ్వాన్స్‌డ్‌లో అడిగే ప్రశ్నలు నేరుగా కాకుండా.. కాన్సెప్ట్‌ ఆధారితంగా విభిన్నంగా ఉంటాయి. కాబట్టి విద్యార్థులు కాన్సెప్ట్‌లను అవపోసన పడితే.. పరీక్షలో ప్రశ్నలు పరోక్షంగా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.


ప్రశ్నల సరళి, మార్కింగ్‌

పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, మార్కింగ్‌ విధానాన్ని కూడా విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. సింగిల్‌ కరెక్ట్‌ కొశ్చన్స్‌; మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌; పేరాగ్రాఫ్‌ ఆధారిత ప్రశ్నలను సాధన చేయాలి. వీటిలో రాణించాలంటే.. కాన్సెప్ట్‌ ఆధారిత ప్రశ్నలు, అప్లికేషన్‌ ఓరియెంటేషన్‌తో ప్రిపరేషన్‌ పూర్తి చేసుకుని.. అలాంటి ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్‌ చేయాలి. 

సబ్జెక్ట్‌ వారీగా.. ఇలా
► మ్యాథమెటిక్స్‌: కోఆర్డినేట్‌ జామెట్రీ, త్రికోణమితి, డిఫరెన్షియల్‌ కాలిక్యులస్, ఇంటిగ్రల్‌ కాలిక్యులస్, మాట్రిక్స్‌ అండ్‌ డిటర్మినెంట్స్, పెర్ముటేషన్స్‌ అండ్‌ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, వెక్టార్స్, కాంప్లెక్స్‌ నెంబర్స్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలి.

► కెమిస్ట్రీ: కెమికల్‌ బాండింగ్, ఆల్కైల్‌ హలైడ్‌; ఆల్కహాల్‌ అండ్‌ ఈథర్, కార్బొనైల్‌ కాంపౌండ్స్, అటామిక్‌ స్ట్రక్చర్‌ అండ్‌ న్యూక్లియర్‌ కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్‌ అండ్‌ థర్మో కెమిస్ట్రీ, ఫిజికల్‌ కెమిస్ట్రీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

►  ఫిజిక్స్‌: ఎలక్ట్రో డైనమిక్స్‌; మెకానిక్స్‌; హీట్‌ అండ్‌ థర్మో డైనమిక్స్, ఎలక్ట్రిసిటీపై ఎక్కువ దృష్టిపెట్టాలి. 

మెయిన్‌కు హాజరవుతుంటే
జేఈఈ–మెయిన్‌ మూడు సెషన్లలో ఆశించిన స్థాయిలో మార్కులు రాలేదనే ఉద్దేశంతో చాలామంది విద్యార్థులు జేఈఈ–మెయిన్‌ 4వ సెషన్‌కు హాజరవుతున్నారు. ఈ పరీక్షలు ఈ నెల(ఆగస్టు) 26, 27, 31 తేదీల్లో, సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో జరుగనున్నాయి.

► వీటికి హాజరయ్యే విద్యార్థులకు మెయిన్‌ తర్వాత అడ్వాన్స్‌డ్‌కు లభించే సమయం నెల రోజులు మాత్రమే. కాబట్టి ప్రస్తుత సమయంలో వీలైనంత మేరకు అడ్వాన్స్‌డ్‌ను దృష్టిలో పెట్టుకొని మెయిన్‌ పరీక్షకు ప్రిపరేషన్‌ సాగించాలి. మెయిన్‌ పరీక్ష పూర్తయిన తర్వాత ఇక పూర్తి సమయాన్ని అడ్వాన్స్‌డ్‌ రివిజన్‌కు కేటాయించాలి.

వారం రోజుల ముందు
అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రాక్టీస్‌ టెస్టులు, మోడల్‌టెస్టులు, గ్రాండ్‌ టెస్ట్‌ల సాధనకు కేటాయించాలి. ఈ సమయంలో కొత్త అంశాలు చదువుదాం.. వాటికి వెయిటేజీ ఎక్కువ ఉంది అనే భావన ఏ మాత్రం సరికాదు.

పరీక్ష రోజు కీలకం
► ఎలాంటి పోటీ పరీక్ష అయినా.. ఎన్ని సంవత్సరాలు కృషి చేసినా.. పరీక్ష రోజు చూపే ప్రతిభ విజయంలో అత్యంత కీలకంగా మారుతుంది.
► పరీక్ష హాల్లో ప్రశ్న పత్రం ఆసాంతం చదివేందుకు కనీసం 10 నుంచి పదిహేను నిమిషాలు కేటాయించాలి.
► దాని ఆధారంగా తమకు సులభంగా ఉన్న ప్రశ్నలను గుర్తించాలి. ముందుగా వాటికి సమాధానాలు ఇవ్వాలి.
► పరీక్ష ముగియడానికి ముందు పది లేదా పదిహేను నిమిషాలపాటు గుర్తించిన సమాధానాలు రివ్యూ చేసుకోవాలి. 
► సమాధానాలు ఇచ్చే సమయంలో ఏమైనా సందిగ్ధత ఉంటే.. మార్క్‌ ఫర్‌ రివ్యూ బటన్‌పై క్లిక్‌ చేసి.. చివరలో సమీక్షించుకోవాలి.

అడ్వాన్స్‌డ్‌.. ముఖ్యాంశాలు
► ప్రాక్టీస్‌కు ప్రాధాన్యమిస్తూ అప్లికేషన్‌ ఓరియెంటెడ్‌ కొశ్చన్స్‌ సాధన చేయాలి.
► ప్యాసేజ్‌ ఆధారిత ప్రశ్నల సాధనకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
► ప్రతి రోజు, ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయం కేటాయించుకుని ప్రిపరేషన్‌ సాగించాలి.
► వీలైనంత మేరకు మోడల్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లకు హాజరు కావాలి.
► అన్ని సబ్జెక్ట్‌లలో అన్ని టాపిక్స్‌లో కాన్సెప్ట్స్, ఫార్ములాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.
► పరీక్షకు వారం రోజుల ముందు నుంచి పూర్తిగా మోడల్‌ టెస్టులు, మాక్‌ టెస్ట్‌లకు  సమయం కేటాయించాలి. 
► పరీక్ష రోజు.. కేంద్రంలోకి అనుమతించే సమయానికంటే గంట ముందుగా చేరుకునే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
► పరీక్షకు ముందు ఎలాంటి మానసిక ఒత్తిడి, ఆందోళన లేకుండా చూసుకోవాలి.
► పరీక్ష హాల్లో.. పరీక్ష సమయంలో కంప్యూటర్‌ స్క్రీన్‌పై అందుబాటులో ఉండే కౌంట్‌డౌన్‌ టైమర్‌ను చూసుకుంటూ ఉండాలి. 
► మొదటి పేపర్‌ పూర్తయిన తర్వాత దాని గురించి మర్చిపోయి రెండో పేపర్‌కు సన్నద్ధం కావాలి.

విజయ సాధనాలు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధించాలంటే.. ప్రిపరేషన్‌ సమయంలోనే ఆయా టాపిక్స్‌ను అప్లికేషన్‌ అప్రోచ్‌తో ప్రాక్టీస్‌ చేయాలి. దీనివల్ల పరీక్షలో ప్రశ్నను ఎలా అడిగినా.. సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. ప్రిపరేషన్‌ సమయంలోనే సింగిల్‌ కరెక్ట్‌ కొశ్చన్స్‌; మల్టిపుల్‌ ఛాయిస్‌ కొశ్చన్స్‌; పేరాగ్రాఫ్‌ ఆధారిత ప్రశ్నలను సాధన చేయడం ద్వారా.. పరీక్షలో ఏమైనా మార్పులు జరిగినా.. ఎలాంటి ఒత్తిడి లేకుండా సమాధానాలు ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది. 
– ఆర్‌.కేదారేశ్వర్, జేఈఈ పోటీ పరీక్షల నిపుణులు 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top