
దేశంలో జరుగుతున్న సైబర్ మోసాల విలువ!
జనవరి–మే మధ్య రూ.7,000 కోట్లు సమర్పయామి
విదేశీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో భారతీయులు
వల వేస్తున్న దక్షిణాసియా దేశాల సైబర్ నేరగాళ్లు
స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్–పెట్టుబడులు, డిజిటల్ అరెస్ట్, టాస్క్, పెట్టుబడి.. ఎంచుకున్న విధానం ఏదైనా విదేశీ సైబర్ నేరగాళ్ల ఉచ్చులో భారతీయులు చిక్కుతున్నారు. తద్వారా ప్రతి నెల సగటున రూ.1,000 కోట్లకుపైగా దోపిడీకి గురవుతున్నారు. భారతీయులను లక్ష్యంగా చేసుకుని అత్యధికంగా ఆగ్నేయాసియా కేంద్రంగా ఈ సైబర్ మోసాలు జరుగుతున్నాయని కేంద్ర హోం శాఖ (ఎంహెచ్‌ఏ) గుర్తించింది. భారతీయులతో సహా అక్రమ రవాణాకు గురైన వ్యక్తులతో ఈ కేంద్రాల్లో బలవంతంగా మోసాలు చేయిస్తున్నారు.
ఈ ఏడాది జనవరి నుండి మే వరకు ఆన్ లైన్ స్కామ్‌ల వల్ల భారతీయులు కోల్పోయిన మొత్తం సుమారు రూ.7,000 కోట్లు. ఇందులో సగానికి పైగా మోసాలకు మయన్మార్, కంబోడియా, వియత్నాం, లావోస్, థాయిలాండ్ నుండి పనిచేస్తున్న నెట్‌వర్క్‌లే కారణమని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఎంహెచ్‌ఏ అనుబంధ విభాగమైన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) రూపొందించిన డేటా ప్రకారం.. అధిక భద్రత కలిగిన ప్రదేశాల నుండి సైబర్ నేరగాళ్లు ఈ నేరాలకు పాల్పడుతున్నారు. ఈ నెట్‌వర్క్‌లను చైనీస్ ఆపరేటర్లు నియంత్రిస్తున్నారు.
బాధితులే ఉద్యోగులు..
విదేశాల్లో ఉద్యోగాల ఆశతో మానవ అక్రమ రవాణాకు గురై.. ఆయా దేశాల కేంద్రాల్లో వీరితో బలవంతంగా పనిచేయిస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కరీంనగర్ జిల్లాతోపాటు పలువురు యువకులు ఉపాధి కోసం థాయ్‌లాండ్ వెళ్లి అక్కడి సైబర్ కేఫ్‌లలో బందీలుగా చిక్కుకున్నారు. దీనిపై వార్తల నేపథ్యంలో స్పందించిన కేంద్రం అక్కడి 539 భారతీయ బందీలను విడిపించి, మార్చి 11న సురక్షితంగా భారత్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఇలా చాలామందిని నిఘా సంస్థలు రక్షించాయి. వీరి సాయంతో ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు కంబోడియాలో కనీసం 45, లావోస్‌లో ఐదు, మయన్మార్‌లో ఒక కేంద్రాన్ని గుర్తించాయి.
బాధితుల్లో భారతీయులతో పాటు, ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా, దక్షిణాసియా, మధ్య ఆసియా, పశ్చిమాసియా దేశాలు, యూరప్/ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా నుండి వచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. ఆగ్నేయాసియా నుండి పనిచేస్తున్న సైబర్ నేరగాళ్లు ప్రధానంగా మూడు రకాల మోసాలకు పాల్పడుతున్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. వీటిలో స్టాక్ ట్రేడింగ్/పెట్టుబడి మోసాలు, డిజిటల్ అరెస్ట్, టాస్క్ ఆధారిత, పెట్టుబడి ఆధారిత మోసాలు ఉన్నాయి.
ఘోస్ట్ సిమ్ కార్డులతో..
ప్రభుత్వ అంచనాల ప్రకారం ప్రస్తుత సంవత్సరం మార్చికి ముందు ఆరు నెలల్లో భారతీయులు కనీసం రూ.500 కోట్ల మేర మోసపోయారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. బ్యాంకింగ్, ఇమిగ్రేషన్, టెలికం రంగాలలో ఉన్న లొసుగులను ప్యానెల్ గుర్తించింది.
నకిలీ, దొంగిలించిన గుర్తింపులతో సిమ్‌లను జారీ చేశారనే ఆరోపణలపై వివిధ రాష్ట్రాల్లోని పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నకిలీ, ఇతరుల గుర్తింపుతో జారీ అయిన ఈ ఘోస్ట్ సిమ్‌లను పాయింట్ ఆఫ్ సేల్ ఏజెంట్లు సైబర్ నేరస్తులకు విక్రయిస్తున్నారు. మోసపూరితంగా సిమ్ జారీ కావడంతో నేరస్తులను గుర్తించడం కష్టమవుతోంది.
బాధితులే ఉద్యోగులు..
సైబర్ నేరాల కోసం వ్యక్తులను నియమించుకుంటున్న అనేక మంది ఏజెంట్లను భారత ప్రభుత్వం గుర్తించింది. వీరిలో మహారాష్ట్ర నుంచి 59 అత్యధికంగా మంది ఉన్నారు. తమిళనాడు 51, జమ్మూ కాశ్మీర్ 46, ఉత్తర ప్రదేశ్ 41, ఢిల్లీ నుంచి 38 మంది ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏజెంట్లు లావోస్, మయన్మార్, కంబోడియాలకు ఎక్కువ మందిని నియమించుకుంటున్నారు. 5,000 మందికిపైగా భారతీయులు కంబోడియాలో చిక్కుకున్నట్టు సమాచారం. నేరగాళ్లు వీరిని నిర్బంధించి, బలవంతంగా సైబర్ మోసాలు చేయిస్తున్నారు.
దేశాలను దాటి..
సైబర్ నేరస్తుల చెర నుంచి రక్షించిన బందీలు, తిరిగి వచ్చిన వ్యక్తుల వాంగ్మూలాలను ప్రభుత్వం నమోదు చేసింది. భారత్ నుంచి కంబోడియాకు బాధితులను తరలిస్తున్న తీరు నిఘా సంస్థల విచారణలో బయటపడింది. తొలుత దుబాయ్.. అక్కడి నుండి చైనా, కంబోడియాకు; తమిళనాడు నుండి కంబోడియా; మహారాష్ట్ర నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి థాయిలాండ్, కంబోడియా; జైపూర్ నుండి వియత్నాం.. అక్కడి నుండి బ్యాంకాక్, కంబోడియాకు; ఢిల్లీ నుండి బ్యాంకాక్, కంబోడియా, లక్నో నుండి బ్యాంకాక్, కంబోడియా; కేరళ నుండి వియత్నాం, కంబోడియా; కేరళ నుండి సింగపూర్, కంబోడియాకు తరలిస్తున్నారు. ఇక కోల్‌కతా నుండి వియత్నాం, కంబోడియాకు రోడ్డు మార్గం ద్వారా చేరవేస్తున్నట్లు తేలింది.
ఆధునిక మోసాలు..: తప్పుదోవ పట్టించి రహస్య సమాచారాన్ని తెలుసుకోవడం, నకిలీ యాప్‌లు, ఫిషింగ్ హెచ్చరికలు, వంచన వంటి వివిధ పద్ధతులను సైబర్ నేరగాళ్లు అనుసరిస్తున్నారు. కేవైసీ అప్‌డేట్ పేరుతో ఒత్తిడికి గురిచేయడం, లాభదాయక రాబడి పేరుతో వల వేస్తున్నారు. డిజిటల్ అరెస్ట్ కారణంగా 2025లోనే రూ.210 కోట్లకుపైగా నష్టాలు నమోదయ్యాయి. సైబర్ నేరస్తులు గ్రామీణులతోపాటు నగరవాసులనూ లక్ష్యంగా చేసుకుని మరింత ఆధునిక మోసాలకు తెరలేపుతున్నారు.
కాల్ 1930..: సైబర్ నేరం మీ దృష్టికి వచ్చినా.. ఎవరైనా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని అనుమానం వచ్చినా వెంటనే 1930కి కాల్ చేయండి. cybercrime.gov.in వెబ్‌సైట్లో ఫిర్యాదు చేయండి
తక్షణ నివారణ చర్యలు తీసుకోకపోతే మొత్తం నష్టాలు వచ్చే ఏడాది కాలంలో రూ.1.2 లక్షల కోట్లకు మించి ఉండవచ్చని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ హెచ్చరించింది.