46,313 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో భారత్ దిశగా పయనం
ఈ నెల 13వ తేదీకల్లా విశాఖపట్నానికి చేరే అవకాశం
న్యూఢిల్లీ: భారత్‌లో ద్రవీకృత పెట్రోలియం గ్యాస్(ఎల్పిజీ) కొరత కొంతవరకు తీరిపోయే అవకాశం వచ్చింది. 46,313 మెట్రిక్ టన్నుల ఎల్పిజీతో ఓ నౌక హార్మూజ్ జలసంధిని దాటేసి భారత్ దిశగా పయనం సాగిస్తోందని అధికార వర్గాలు ఆదివారం వెల్లడించాయి. మార్షల్ ఐలాండ్స్ జెండాతో ఉన్న ఈ నౌక పేరు ఎంటీ సర్వశక్తి. అందులో 20 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో 18 మంది భారతీయులే. ఈ నెల 2న హార్మూజ్‌లో కీలకమైన చెక్‌పాయింట్‌ను విజయవంతంగా దాటేసింది.
ఈ నెల 13వ తేదీ కల్లా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి చేరుకుంటుందని అంచనా. భారత్‌లో సగంరోజు అవసరానికి సరిపడా ఎల్పీజీ ఈ నౌకలో ఉంది. గంటకు 12 నుంచి 14 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. ఆదివారం సాయంత్రానికి గల్ఫ్ ఆఫ్ ఒమన్‌లో ఉన్నట్లు తెలిసింది. సర్వశక్తి నౌకలోని సిబ్బంది, ఎల్పీజీ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
గతంలో పర్షియన్ గల్ఫ్, భారత్‌లోని ఓడరేవుల మధ్య రాకపోకలు సాగించిన ఈ అతిపెద్ద గ్యాస్ నౌకను భారత ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అద్దెకు తీసుకుంది. ఇరాన్ నౌకలు, ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం ప్రారంభమైన తర్వాత హార్మూజ్‌ను దాటిన మొదటి భారత అనుబంధ చమురు నౌక సర్వశక్తి కావడం విశేషం. భారత జెండా లేదా భారత యాజమాన్యంలోని 14 నౌకలు ఇప్పటికీ హార్మూజ్ జలసంధి పశ్చిమ భాగంలో చిక్కుకుపోయి ఉన్నాయి.


