సర్పంచ్‌ల సేవలు సూపర్‌

India achieved new milestones in gram swaraj says PM Narendra Modi - Sakshi

వారి సేవలు కొనియాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ లేఖ

యోగా డేను విజయవంతం చేయాలని వారికి పిలుపు

న్యూఢిల్లీ: పంచాయతీలకు సాధికారత కల్పించి గ్రామస్వరాజ్యం సాధించడంలో ఎనిమిదేళ్లలో భారత్‌ కొత్త మైలురాళ్లను అధిగమించిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్రం చేపడుతున్న సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ చేరేలా కృషి చెయ్యాలని సర్పంచులకు పిలుపునిచ్చారు. ఎన్డీఏ పాలనకు ఎనిమిదేళ్ల పూర్తయిన సందర్భంగా పంచాయతీ సర్పంచ్‌లకు మోదీ లేఖ రాశారు. ఈ ఎనిమిదేళ్లలో గ్రామస్థాయిలో వారందించిన సహకారాన్ని, చేసిన సేవల్ని కొనియాడారు. జూన్‌ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు.

మానవత్వం కోసం యోగా అనే థీమ్‌తో ఈ ఏడాది నిర్వహిస్తున్న యోగా డేని సర్పంచులు వారి వారి గ్రామాల్లో ఏదైనా పురాతన పర్యాటక కేంద్రాన్ని లేదంటే నదీ తీరంలో నిర్వహించాలని గ్రామంలో ప్రతీ ఒక్కరూ యోగా చేసేలా ప్రోత్సాహించాలని ప్రధాని ఆ లేఖలో పేర్కొన్నారు. యోగా డే రోజు తీసిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకొని ఇతరుల్లో స్ఫూర్తి నింపాలన్నారు. 75ఏళ్ల అమృతోత్సవాలు జరుపుకుంటున్న వేళ నీటి సంరక్షణపై అత్యధిక దృష్టి పెట్టాలని. ప్రతీ నీటి బొట్టు విలువైనదని మోదీ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు లబ్ధిదారులందరికీ చేరేలా కృషి చేస్తే సదరు గ్రామంతో పాటు దేశం కూడా సుసంపన్నంగా మారుతుందని మోదీ పేర్కొన్నారు. దేశంలోని 2.5 లక్షల గ్రామ పంచాయితీలన్నీ స్వయంసమృద్ధి సాధిస్తే దేశం పురోగతిలో ముందుంటుందని లేఖలో పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top