ప్రస్తుతమున్న టీకాలు ఒమిక్రాన్‌ను నిరోధిస్తాయా?

How Current Vaccines Against Covid Are Responding to Omicron: Soumya Swaminathan Answer - Sakshi

కొంతవరకు మాత్రమే కట్టడి చేయగలవు

వ్యాక్సిన్ల పనితీరుపై ఆందోళన అనవసరం

ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ బీఏ.2 వ్యాప్తి ఎక్కువే

సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్

న్యూఢిల్లీ: కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ ఉప వేరియంట్‌ బీఏ.2 వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. మిగతా సబ్‌ వేరియంట్స్‌తో పోలిస్తే ఇది చాలా శక్తివంతమైనదని.. భారత్‌, డెన్మార్క్‌ దేశాల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపనుందని ‘ఎన్డీటీవీ’తో చెప్పారు. 

ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్‌ బయటపడి రెండు నెలలే అయినందువల్ల దాని ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి అంచనాకు రాలేకపోతుందన్నారు. ఒమిక్రాన్‌ తిరిగి ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుందా, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్త వేరియంట్ నుంచి కోలుకున్న రోగుల రక్తం డెల్టా ఇన్‌ఫెక్షన్‌కు కారణమయినట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయని.. భవిష్యత్ వేరియంట్‌ల విషయంలో ఇలా జరుగుతుందో, లేదో కచ్చితంగా చెప్పలేమన్నారు. 

ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా పూర్తిస్థాయిలో కట్టడి చేయలేవని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ‘పస్తుతమున్న టీకాలు డెల్టా వేరియంట్‌ కంటే కూడా తక్కువగా కొత్త వేరియంట్‌ను న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంది. అయితే, టీకాలు వేసిన రోగులలో మరణాలు.. తీవ్రమైన వ్యాధి కేసులు తక్కువగా ఉన్నట్లు క్లినికల్ డేటా చూపిస్తోంది. కాబట్టి ప్రస్తుత వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్‌పై పనిచేస్తాయా, లేదా అనే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గించే విషయంలో టీకాలు బాగా పనిచేస్తున్నాయి. వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా నిలుస్తున్నాయ’ని చెప్పారు. 

యాంటీబాడీ ప్రతిస్పందనను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్ల పనితీరుపై అంచనా రాలేమని.. క్లినికల్ డేటాను జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు టీ-సెల్ ప్రతిస్పందన వంటి ఇతర అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిడ్‌ ఆర్‌ఎన్‌ఏ వైరస్‌ కాబట్టి భవిష్యత్‌లో మరిన్ని వేరింయట్స్‌ రావొచ్చన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొనే యూనివర్సల్ వ్యాక్సిన్ గురించి డబ్ల్యూహెచ్‌ఓ కసరత్తు చేస్తోందన్నారు. బూస్టర్‌ డోస్‌ తీసుకోవాలా, వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి స్థానిక డేటాను తప్పనిసరిగా అధ్యయనం చేయాలని సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు. 

అధిక జనాభాకు టీకాలు వేయడంలో భారతదేశం విజయవంతం అయిందని ప్రశంసించారు. నోటి ద్వారా తీసుకునే మాత్రలు కోవిడ్‌ అన్ని వేరియంట్‌లను నియంత్రించడానికి పనికొస్తాయని తెలిపారు. మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top