కోల్‌కతా: మూడు దశాబ్దాల వామపక్ష పాలన, ఆ తర్వాత మమతా బెనర్జీ ఏకఛత్రాధిపత్యం.. ఇలాంటి పశ్చిమ బెంగాల్‌లో అనూహ్యంగా కాషాయ జెండా రెపరెపలాడింది. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్‌కు ఊహించని షాక్ ఇస్తూ, బీజేపీ సాధించిన విజయానికి ప్రధాన కారణం స్థానిక రాజకీయాలు కాదు.. సరిహద్దుల్లోని బంగ్లాదేశ్ సంక్షోభం! షేక్ హసీనా ప్రభుత్వ పతనం, బంగ్లాలో హిందువులపై దాడులు, అక్రమ చొరబాట్లపై రేగిన ఆందోళనలు బెంగాల్ రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి.
షేక్ హసీనా పతనం తర్వాత..
డిసెంబర్ 2025లో బంగ్లాదేశ్‌లో హిందూ వస్త్ర కార్మికుడు దీపు చంద్ర దాస్ దారుణ హత్యకు గురయ్యాడు. దీనికి నిరసనగా కోల్‌కతాలోని బంగ్లాదేశ్ డిప్యూటీ హైకమిషన్ ఎదుట హిందూ సన్యాసులు, సంఘాలు భారీ ఆందోళన చేపట్టాయి. ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. కాషాయ వస్త్రాలు ధరించిన సన్యాసులపై మమతా బెనర్జీ పోలీసులు లాఠీఛార్జ్ చేయడం పట్ల బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీదీ ప్రభుత్వం కేవలం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మాత్రమే కొమ్ముకాస్తోందని, బెంగాల్ హిందువుల పక్షాన నిలబడలేదనే వాదనను ఆ పార్టీ విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది.
అక్రమ చొరబాటుదారులపై బీజేపీ అస్త్రం
బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో అక్రమ చొరబాటుదారుల అంశం బీజేపీకి ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారింది. రాష్ట్ర ఓటర్ల జాబితాలో దాదాపు 1.25 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నారని, దీదీ ఆశీస్సులతోనే ఇదంతా సాగుతోందని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపించారు. పటిష్టంగా లేని సరిహద్దుల గుండా ముస్లింలు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి టీఎంసీ ఓటర్లుగా మారుతున్నారన్న బీజేపీ వాదన ఓటర్లను ఆలోచింపజేసింది. దశాబ్దాలుగా హిందూ-ముస్లిం రాజకీయాలకు దూరంగా ఉన్న బెంగాల్, ఈసారి ఆ ప్రభావానికి లోనైంది.
గేమ్ ఛేంజర్‌గా ‘మతువా’ ఓటుబ్యాంక్
ఈ ఎన్నికల్లో అత్యంత కీలక పాత్ర పోషించింది ‘మతువా’ సామాజిక వర్గం. 19వ శతాబ్దంలో తూర్పు బెంగాల్ (ప్రస్తుత బంగ్లాదేశ్)లో ఆవిర్భవించిన ఈ వర్గానికి బెంగాల్‌లోని పలు నియోజకవర్గాల్లో బలమైన పట్టుంది. ఓటర్ల జాబితా నుండి తమ పేర్లు తొలగిస్తున్నారన్న ఆందోళనలు ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులు స్థానికులను బీజేపీ వైపు నిలబడేలా చేశాయి. తాము మతపరమైన వేధింపులకు గురికాకూడదనే ఉద్దేశ్యంతో, బీజేపీ మాత్రమే తమకు పౌరసత్వం కల్పిస్తుందన్న ఆశతో వారు బీజేపీ పక్షాన నిలబడ్డారని విశ్లేషకులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: దీదీ పతనం.. కాంగ్రెస్‌కు ఊపిరి


