పశ్చిమ బెంగాల్ తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ రాజకీయాల్లో ఒక పెను సంచలనంగా మారాయి. పైపైన చూస్తే ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్‌పై భారతీయ జనతా పార్టీ సాధించిన అద్భుత విజయంగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఈ ఫలితాల లోతుల్లోకి వెళితే ఒక ఆసక్తికరమైన రాజకీయ కోణం దాగి ఉంది. దశాబ్ద కాలంగా బెంగాల్‌లో నామమాత్రంగా మిగిలిపోయిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఫలితాలు మళ్లీ ప్రాణం పోశాయి. మమతా బెనర్జీ ఓటమి కాంగ్రెస్‌కు శుభవార్తగా మారిందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది.
శూన్యం నుంచి.. మళ్లీ మొదలైన ప్రస్థానం
2021 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోలేక చతికిలపడిన కాంగ్రెస్ పార్టీ ఈ తాజా ఎన్నికల్లో కనీసం రెండు నియోజకవర్గాల్లోనైనా జెండా ఎగురవేయగలిగింది. ముర్షిదాబాద్ జిల్లాలోని ఫరక్కా, రాణినగర్ స్థానాల్లో కాంగ్రెస్ సాధించిన అనూహ్య విజయం కేవలం అంకెల పరమైన పెరుగుదల మాత్రమే కాదు. ఫరక్కాలో కాంగ్రెస్ అభ్యర్థి మోతాబ్ షేక్ 63,050 ఓట్లు సాధించి, తన సమీప బీజేపీ అభ్యర్థిపై 8,193 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ ఒకప్పటి బలమైన అధికార పార్టీ టీఎంసీ 47,256 ఓట్లతో ఏకంగా మూడో స్థానానికి పడిపోయింది.
ముక్కోణపు పోటీలో.. ఆశ్చర్యకరమైన ఫలితాలు
రాణినగర్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి జుల్ఫికర్ అలీ హోరాహోరీ పోరులో టీఎంసీపై 2,701 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇక్కడ సీపీఐ(ఎం) మరింత వెనుకబడగా, బీజేపీ ఏకంగా నాలుగో స్థానానికి పరిమితమైంది. ముర్షిదాబాద్ జిల్లాలో ఒకప్పుడు కేవలం టీఎంసీ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా ఉన్న ద్విముఖ పోరు.. ఇప్పుడు బహుముఖ పోటీగా మారిందని ఈ రెండు స్థానాల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మైనారిటీలు, గ్రామీణ ఓటర్లపై టీఎంసీకి ఉన్న పట్టు సడలడమే ఈ పరిణామాలకు ప్రధాన కారణం.
ఓట్ల చీలికతో.. కాంగ్రెస్‌కు కలిసొచ్చిన కాలం
టీఎంసీ ఓటు బ్యాంకు చీలిపోవడం కాంగ్రెస్‌కు పరోక్షంగా లాభించింది. అధికార పార్టీకి దూరమైన ఓట్లన్నీ నేరుగా బీజేపీకే వెళ్లిపోలేదు. ఆ ఓట్లు విడిపోయి, స్థానికంగా సంస్థాగత బలం ఉన్న చిన్న పార్టీలకు, ముఖ్యంగా కాంగ్రెస్‌కు మళ్లాయి. దీనిని కాంగ్రెస్ వైపు వీచిన గాలి అనడం కంటే, టీఎంసీ పతనంతో ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసే ప్రక్రియ అనడం వాస్తవం. అధికార పార్టీ బలహీనపడటం వల్ల బీజేపీ విస్తరణకు మార్గం సుగమం అయినప్పటికీ, ఏకకాలంలో కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల అనుకూల వాతావరణం ఏర్పడింది.
అధిర్ రంజన్ ఇలాకాలో.. అనూహ్య పరిణామం
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ఓటు శాతం కేవలం 3 శాతానికి అటూఇటుగా ఉన్నప్పటికీ, మైనారిటీ ప్రాబల్య ప్రాంతాల్లో ఆ పార్టీ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దశాబ్దాలుగా కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరికి కంచుకోటగా ఉన్న బహరంపూర్‌లో బీజేపీ నిర్ణయాత్మక విజయం సాధించింది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలవగా, టీఎంసీ మరింత బలహీనపడి కిందకు పడిపోయింది. చౌదరికి ఇది వ్యక్తిగతంగా పెద్ద ఎదురుదెబ్బ అయినప్పటికీ, అధికార వ్యతిరేక ఓటును ఆకర్షించడంలో కాంగ్రెస్ ద్వితీయ ప్రత్యామ్నాయంగా నిలిచిందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.
‘ఇండియా’ కూటమిలో.. మమతకు తగ్గిన పట్టు
పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ పతనం కేవలం ఆ రాష్ట్రానికే పరిమితం కాలేదు, ‘ఇండియా’ కూటమిలోని అంతర్గత సమీకరణలను కూడా సమూలంగా మార్చేసింది. బీజేపీని ధీటుగా ఎదుర్కోగలిగేది ప్రాంతీయ పార్టీలేనని, ప్రతిపక్షాలకు నాయకత్వం వహించే సత్తా కాంగ్రెస్‌కు లేదని ఇన్నాళ్లూ మమతా బెనర్జీ బలంగా వాదిస్తూ వచ్చారు. అయితే తన సొంత నియోజకవర్గం భవానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి చేతిలో మమతా బెనర్జీకి ఎదురైన పరాభవం కూటమిలో ఆమె ప్రభావాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
పునర్వైభవం కాదు.. మనుగడకు మార్గం
మమత పరాజయంతో ఇండియా కూటమిలో నాయకత్వ పోరు తగ్గుముఖం పట్టి, కూటమి పగ్గాలపై కాంగ్రెస్‌కు పరోక్షంగా మరింత స్వేచ్ఛ లభించింది. అయితే, బెంగాల్ ఫలితాలను కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయి పునర్వైభవంగా భావించడానికి వీల్లేదు. రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ పతనంతో లబ్ధి పొంది బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా స్థిరపడింది. అయితే, ముర్షిదాబాద్‌లో లభించిన విజయాలు కాంగ్రెస్ ఉనికికి ఊపిరిపోశాయి. బెంగాల్ రాజకీయ చిత్రం నుంచి దాదాపు కనుమరుగైపోయిన ఒక జాతీయ పార్టీకి, ఫరక్కా, రాణినగర్ ఫలితాలు లబ్ధి చేకూర్చాయని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చదవండి: కామ్రేడ్లకు భారీ షాక్.. చివరి కోట పతనం!


