హిందీ దుమారం

Hindi Language Controversy Again In Tamil Nadu - Sakshi

ఆయుష్‌ కార్యదర్శిపై ఫైర్‌ 

అవమానిస్తారా..? ప్రతి పక్షాల ధ్వజం 

సీఎం స్పందించాలని డిమాండ్‌ 

సాక్షి, చెన్నై: రాష్ట్రంలో మళ్లీ హిందీ భాష వివాదాన్ని రేపింది. ఆయుష్మాన్‌ భారత్‌ కార్యదర్శి రాజేష్‌ కోట్చే తీరుపై తమిళ పార్టీలు, సంఘాలు తీవ్రంగా ధ్వజమెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై సీఎం స్పందించాలని డిమాండ్‌ చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం హిందీ రాదన్న కారణంగా సీఐఎస్‌ఎఫ్‌ అధికారి డీఎంకే ఎంపీ కనిమొళిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తమిళ డాక్టర్లను అవమానించేలా ఆయుష్మాన్‌ భారత్‌ కార్యదర్శి రాజేష్‌ కోట్చే వ్యవహరించిన తీరు తమిళనాట ఆగ్రహాన్ని రేపింది. తమకు హిందీ రాదని, ఆంగ్లంలో ప్రసంగించాలని తమిళ డాక్టర్లు విజ్ఞప్తి చేశారు. హిందీ రాకుంటే బయటకు వెళ్లాలని రాజేష్‌ కొట్చే హెచ్చరించడాన్ని తమిళులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు.  

ఇంకెంత కాలం ఈ అవమానం 
రాజేష్‌పై తమిళనాడు నేతలు, తమిళాభిమానులు మండి పడుతున్నారు. డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఎండీఎంకే నేత వైగో, ఎంపీ కనిమొళి, తమిళనాడు కాంగ్రెస్‌ అధ్యక్షుడు కేఎస్‌ అళగిరి, తమిళ మానిల కాంగ్రెస్‌ అ«ధ్యక్షుడు, ఎంపీ జీకే వాసన్, డీఎండీకే అధినేత విజయకాంత్‌ దీనిపై స్పందించారు. ఆంగ్లం రాని వ్యక్తిని కార్యదర్శిగా ఎలా నియమించారని ›ప్రశ్నించారు. ఇంకెంత కాలం తమిళుల్ని అవమానిస్తారని ధ్వజమెత్తారు. చర్యలకు కేంద్రానికి సిఫారసు చేయాలని పట్టుబట్టారు. డీఎంకే ఎంపీ కనిమొళి, ధర్మపురి ఎంపీ సెంథిల్‌ కుమార్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సినీ రచయిత వైరముత్తు సైతం ఖండించారు. సీఎం దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకునే చూస్తామని మంత్రి సెల్లూరురాజు అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top