హిమంత..  అస్సాం మామ | Himanta Biswa Sarma Journey of Assam Politics | Sakshi
Sakshi News home page

హిమంత..  అస్సాం మామ

Apr 2 2026 5:24 AM | Updated on May 4 2026 2:43 PM

Himanta Biswa Sarma Journey of Assam Politics

డాక్టర్‌ హిమంత బిశ్వ శర్మ. అస్సాం రాజకీయ సంక్లిష్టతలను అర్థం చేసుకుని, తదనుగుణంగా తనను తాను మలచుకున్న నేత. పదునైన వ్యూహాలతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టడంలో దిట్ట. స్వయం కృషితో ఈశాన్య భారత రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగారు హిమంత. అస్సామీలు ఆప్యాయంగా ‘మామ’ అని పిలుచుకునేంతటి ప్రజాదరణ ఆయన సొంతం...!

ఎన్‌ఈడీఏ రూపశిల్పి
1991 నాటి సంగతి. యువతను తిరిగి కాంగ్రెస్‌కేసి ఆకర్షించగల యువ నాయకుని కోసం నాటి ముఖ్య మంత్రి, పార్టీ సీనియర్‌ నాయకుడు హితేశ్వర్‌ సైకియా ప్రయత్నిస్తున్న రోజులు. హిమంత బిశ్వ శర్మ ఆయన కంట పడ్డారు. అలా కాంగ్రెస్‌లో చేరారు. ఐదేళ్లపాటు నిర్విరామంగా కృషి చేసి రాష్ట్రవ్యాప్తంగా తిరుగులేని నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్నారు. జాలుక్‌బారి అసెంబ్లీ స్థానాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. 1996లో తొలిసారి అక్కడ ఓడినా కుంగిపోలేదు. 2001లో అస్సాం గణ పరిషత్‌ సీనియర్‌ నాయకుడు భృగుకుమార్‌ ఫుకాన్‌ను ఓడించి సత్తా చాటారు. 

ఏడాదికే మంత్రి పదవి సాధించారు. జాలుక్‌బారి నుంచి వరుసగా ఐదు పర్యాయాలుగా అత్యధిక మెజారిటీలతో గెలుస్తూ వస్తున్నారు. దశాబ్దాల పాటు అస్సాం కాంగ్రెస్‌ పార్టీలో బలమైన నేతగా, సీఎం తరుణ్‌ గొగొయ్‌ కుడిచేయిగా కొనసాగారు. అలా 24 ఏళ్లు కాంగ్రెస్‌కు సేవలందించిన హిమంత, అధిష్టానంతో విభేదాల కారణంగా 2014లో పార్టీకి రాజీనామా చేశారు. 2015లో బీజేపీలో చేరారు. ఈశాన్య రాష్ట్రాల్లో పెద్దగా ఉనికి లేని ఆ పార్టీకి అక్కడ పెద్ద దిక్కుగా మారారు. ఈశాన్య ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌ఈడీఏ)కి రూపకల్పన చేసి ఆ ప్రాంతంలో బీజేపీ తలరాతను మార్చేశారు. అస్సాంలో పార్టీ అధికారాన్ని నిలబెట్టారు.

కేబినెట్‌ ఆన్‌ వీల్స్‌
గువాహటిలోని కాటన్‌ విశ్వవిద్యాలయం నుంచి వచ్చి రాష్ట్రాన్ని ఏలిన ఏడో నేతగా హిమంత నిలిచారు. ఆయన నాయకత్వంలో అస్సాం అశాంతి నుంచి బయటపడింది. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచింది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న తొలి అస్సాం సీఎంగా హిమంత నిలిచారు.   తెల్లవారుజాము వేళ కూడా క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేయడం ఆయన స్టైల్‌. సీఈఓ తరహా పనితీరుతో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రజల వద్దకు  ప్రభుత్వాన్ని తీసుకెళ్లడమే లక్ష్యంగా గ్రామీణ జిల్లాల్లో అధికారిక సమావేశాలు నిర్వహిస్తూ ‘కేబినెట్‌ ఆన్‌ వీల్స్‌’తో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు.

వివాదాలు, మరకలు
→ మియా (బెంగాలీ మాట్లాడే ముస్లిం)లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తామని హిమంత ప్రకటించడం వివాదాస్పదమైంది
→ వలసదారులపై హిమంత రైఫిల్‌ ఎక్కుపె ట్టినట్టుగా చిత్రించిన ‘పాయింట్‌ బ్లాంక్‌’ వీడియో అత్యంత వివాదాస్పదంగా మారింది. దీనిపై అసదుద్దీన్‌ ఒవైసీ తదితరులు ఫిర్యాదులు చేశారు. వామపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. హిమంత మాత్రం అది ఫేక్‌ అని కొట్టిపారేశారు.
→ ప్రభుత్వ నిధులతో నడిచే అన్ని మదర్సాలనూ సాధారణ పాఠశాలలుగా మార్చాలన్న హిమంత నిర్ణయంపై భారీ నిరసనలు వ్యక్తమయ్యాయి.
→ ‘జీరో టాలరెన్స్‌’ విధానంలో భాగంగా ప్రభుత్వ, అటవీ భూముల నుంచి వేలాది మందిని వెళ్లగొట్టారు. వారిలో బెంగాలీ మా ట్లాడే ముస్లింలే అధికంగా ఉండటంతో, వారిని ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేసుకున్నా రని ఆరోపణలొచ్చాయి.

వ్యక్తిగత జీవితం
హిమంత 1969 ఫిబ్రవరి 1న జోర్హాట్‌లో జన్మించారు. తండ్రి కైలాశ్‌నాథ్‌ శర్మ సాహితీవేత్త. అలా హిమంత పుస్తకాలు, మేధో చర్చల నడుమ పెరిగారు. పాఠశాల విద్యార్థిగానే ఆదివాసీల హక్కుల ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యారు. గువాహటి కాటన్‌ వర్సిటీ విద్యార్థి సంఘానికి మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉంటూనే చదువులోనూ రాణించారు. పొలిటికల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అప్పటికి ఆయన ఎమ్మెల్యే కావడం విశేషం. రాజకీయాల్లోకి రాకముందు గువాహటి హైకోర్టులో ఐదేళ్లు సొలిసిటర్‌గా కూడా పనిచేశారు. హిమంత భార్య రినికి భుయాన్‌ శర్మ రాష్ట్రంలో మీడియా టైకూన్‌గా పేరొందారు. వారికి కొడుకు, కూతురున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Advertisement
 
Advertisement
Advertisement