హాస్టల్ బాత్‌రూంలో రహస్య కెమెరా కేసు..
విచారణలో ఒప్పుకున్న కిలేడీ నీలాకుమారి
ఢిల్లీలో మరో ప్రియుడు అరెస్టు
గత నెల 19న బెంగళూరులో కెమెరా కొనుగోలు
హోసూరు: కారు కొనాలి, ఆడంబరంగా జీవించాలి, అందుకు డబ్బు కావాలి, దీంతో నీలిచిత్రాల తయారీ ఆలోచన పుట్టినట్లు నిందితురాలు తెలిపింది. హోసూరులోని టాటా ఎల్రక్టానిక్ కంపెనీ మహిళా సిబ్బంది నివసించే హాస్టల్లో రహస్య కెమెరా కేసులో కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. గత మంగళవారం రాత్రి తమ వీడియోలు బయటకు రావడంతో వేలాది మంది మహిళలు, యువతులు హాస్టల్ ముందు ధర్నా చేయడం తెలిసిందే. మహిళా కారి్మకుల కోసం పరిశ్రమ ఇక్కడ 11 అంతస్తులతో 8 భవనాలను నిర్మించింది. ఘటన జరిగిన హాస్టల్లో సుమారు 2 వేల మందికి పైగా మహిళా కార్మికులు బస చేస్తున్నారు. ఒక్కో గదిలో నలుగురు ఉంటున్నారు.
ఇలా బట్టబయలు
4వ బ్లాక్, 8వ అంతస్తులోని బాత్‌రూంకి వెళ్లిన మహారాష్ట్రకు చెందిన యువతి అనామికకు రహస్య కెమెరా కనిపించడంతో అవాక్కైంది. వెంటనే అదే గదిలో ఉంటున్న ఒడిశాకు చెందిన నీలా కుమారి గుప్తాకు తెలిపింది. నిజానికి నీలాకుమారినే ఈ కెమెరాను రహస్యంగా ఏర్పాటు చేసింది. వెంటనే నీలా బాత్‌రూంకు వెళ్లి కెమెరాను లాగి కిందకు పడేసింది. అనామిక హాస్టల్ వార్డన్ సరితకు చెప్పగా తాను చూసుకొంటానని, బయట ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించింది. ఈ ఘటనతో ఆవేశానికి గురైన తోటి కారి్మకులు ఏకమై ఆందోళన చేపట్టారు.
పంజాబ్, ఢిల్లీ లింకులు
జిల్లా ఎస్పీ తంగదురై, ఉద్దనపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. తన ప్రియుడు బెంగళూరుకు చెందిన సంతోష్ కుమార్ చెప్పడంతోనే నీలాకుమారి గుప్తా రహస్య కెమెరాను అమర్చినట్లు తెలిపింది. నీలా కుమారి సెల్‌ఫోన్‌ను తనిఖీలు చేశారు. నివ్వెరపోయే అంశాలు ఇందులో బయటపడ్డాయి, ఆమె పంజాబ్‌కి చెందిన రవిప్రతాప్‌సింగ్ అనే వ్యక్తితో గత నాలుగేళ్లుగా ప్రేమాయణం నడుపుతోంది. జిల్లా పోలీసులు ఢిల్లీకి వెళ్లి నిజాముద్దీన్ రైల్వేస్టేషన్ సమీపంలో అతని సెల్‌ఫోన్ సిగ్నల్‌ను గుర్తించి అరెస్ట్ చేసి శుక్రవారం సాయంత్రం ఉద్దనపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు.
జల్సాల కోసం ..
సంతోష్‌ను పైపైన ప్రేమిస్తున్నట్లు నీలాకుమారి నటిస్తూ, నిజమైన ప్రియుడు పంజాబ్ రాష్ట్రం లూథియానాకు చెందిన రవిప్రతాప్‌సింగ్‌ను ప్రేమిస్తూ, తన జీతమంతా అతనికే పంపుతూ వచ్చింది. గత నెల 19వ తేదీ బెంగళూరుకు రప్పించుకొంది. నీతో కారులో షికార్లు చేయాలనిపిస్తోందని, జల్సాగా బతకాలని ఉందని ప్రియుడు అన్నాడు, అయితే డబ్బు సంపాదనకు తన వద్ద ఓ పథకం ఉందని ఆమె చెప్పింది. హాస్టల్ బాత్‌రూంలో రహస్య కెమెరా అమర్చుతానని, ఆ వీడియోలు తీసి, వారి ఫోన్ నంబర్‌ను కూడా పంపుతానని, వారికి ఈ వీడియోలు పంపి బెదిరించి డబ్బులు వసూలు చేయడంతో పాటు నీలిచిత్రాలుగా కూడా విక్రయించవచ్చునని నీలాకుమారి తెలిపింది. ఈ పథకం ప్రకారం ఓ బెంగళూరులో కెమెరాను, ఇతర ఉపకరణాలను కొనుగోలు చేసుకొచ్చిన ఆమె బాత్‌రూంలో అమర్చింది. కానీ కెమెరాను గుర్తించడంతో దొరికిపోయామని 4న రాత్రి 12.40 గంటల సమయంలో రవిప్రతాప్‌సింగ్‌కు ఫోన్‌చేసి చెప్పింది. ప్రస్తుతం నీలాకుమారి, ఆమె ఇద్దరు ప్రియులు పోలీసుల విచారణలో ఉన్నారు. హోసూరు ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది.


