
న్యూఢిల్లీ: సెప్టెంబర్ 22.. సోమవారం నుంచి దేశవ్యాప్తంగా శరన్నవరాత్రి వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పలు ఆలయాలను ఇప్పటికే అందంగా ముస్తాబు చేశారు. ఈ తొమ్మిది రోజులలో పలువురు శాకాహారాన్ని మాత్రమే తీసుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ మాంసం దుకాణదారులకు ఒక విజ్ఞప్తి చేశారు.
ఎంతో పవిత్రంగా భావించే నవరాత్రులలో మాంసాహార విక్రయాలను నిలిపివేయాలని ఢిల్లీ బీజేపీ ఎమ్మెల్యే కర్నైల్ సింగ్ ఆహార దుకాణదారులను కోరారు. బహుళజాతి సంస్థలతో సహా ప్రముఖ ఆహార దుకాణదారులకు ఈ విధమైన విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నాడు ఆయన ఫుడ్ అవుట్‌లెట్‌లకు రాసిన ఒక లేఖలో ‘ప్రజల మతపరమైన మనో భావాలను గౌరవించడం ద్వారా సామాజిక సామరస్యాన్ని కాపాడుకునేందుకు ఇటువంటి చర్య అవసరం" అని అన్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో నివసించే మెజారిటీ జనాభా మత సాంస్కృతిక భావాలు కలిగివుంటారని, పండుగల సమయంలో ఆహార అవుట్‌లెట్‌లు మాంసాహారాన్ని అందించకుండా మతపరమైన సంప్రదాయాలను గౌరవించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ శరన్నవరాత్రులలో భక్తులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో పూజిస్తారు.