Flood Fear Delhi Yamuna crosses 207-Metre Mark Highest in 10 Years - Sakshi
Sakshi News home page

Yamuna Rivar: డేంజర్‌ మార్క్‌ దాటి మహోగ్రంగా ప్రవహిస్తున్న యమునా.. ఢిల్లీ హై అలర్ట్‌..

Published Wed, Jul 12 2023 11:02 AM

Flood Fear Delhi Yamuna crosses 207 Metre Mark Highest in 10 Years - Sakshi

ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షాలు ఉత్తరాదినా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్‌, ఉత్తర ప్రదేశ్‌, పంజాబ్‌, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం నెలకొంది. నదులు, వాగులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయలకు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది.

యమునా నది మహోగ్రం.
ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం పెరిగింది. ఓల్డ్‌ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా 207.49 మీటర్లతో పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది.

దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్‌ యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు కూడా నీట మునిగాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం 207.25 మీటర్లుగా ఉంది.

ప్రమాదకర స్థాయిని అధిగమించి
సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం.. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం నీటి మట్టం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్గలు ఉండగా బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

పదేళ్లలో ఇదే తొలిసారి
యమున నది ఇంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం గత పదేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. చివరగా 2013లో నది 207.32 మీటర్ల స్థాయికి చేరిందని తెలిపారు.  ఎగువ పరీవాహక ప్రాంతాలలో నిరంతర వర్షపాతం, వారాంతానికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా  నీటి మట్టం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. గతేడాది సెప్టెంబరులోనూ యమునా నది రెండుసార్లు ప్రమాద స్థాయిని అధిగమించి నీటిమట్టం 206.38 మీటర్లకు చేరుకుంది. మరోవైపు  పాత రైల్వే వంతెనపై అన్నీ రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు.

హిమాచల్‌లో జల విలయం
మరోవైపు ఉత్తరాదిన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో  రోడ్లు, నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇంటి మందు పార్క్‌ చేసిన బైక్‌లు, కార్లు కొట్టుకుపోయాయి. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో చెరువులలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా ఉత్తరాదిన మరణించిన వారి సంఖ్య సెంచరీ దాటింది. 

మూడు రోజుల్లో 31 మంది
ఒక్క హిమాచల్‌ ప్రదేశ్‌లోనే గత మూడురోజుల్లో వరద ఉద్ధృతికి, కొండ చరియలు విరగిపడిన ఘటనలో 31 మంది మరణించగా.. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 80 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 1,300 రోడ్లు, 40 ప్రధాన బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 1,284 రూట్లలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. 

వరదలకు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు దెబ్బతినడంతో  కారణంగా చండీగఢ్-మనాలి,  సిమ్లా-కల్కా జాతీయ రహదారులు మూసివేయడంతో సిమ్లా  మనాలితో సహా అనేక ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

హిమాచల్‌లో చిక్కుకొన్న 300 మంది
ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా సరిహద్దులోని జుమ్మాగఢ్‌ నదిపై ఉండే ఓ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం కారణంగా చందేత్రల్‌ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే ఉన్నారు. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. 

వరద బాధితులతో కలిసి సీఎం భోజనం

కసోల్, మణికరణ్, ఖీర్ గంగా, పుల్గా ప్రాంతాల్లో  ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులులోని సైన్జ్ ప్రాంతంలోనే దాదాపు 40  దుకాణాలు, 30 ఇళ్లు కొట్టుకుపోయాయి. కులులో చిక్కుకుపోయిన పర్యాటకులతో ముఖ్యమంత్రి సంభాషించి, వారితో కలిసి భోజనం చేశారు.

15 వరకు స్కూల్స్‌ బంద్‌
న్ని ప్రభుత్వ పాఠశాలలను జూలై 15 వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాంపిటీటివ్ (ప్రిలిమినరీ) పరీక్షను ఆగస్టు 20కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. రాష్ట్రంలో సంభవించిన విపత్తుల నేపథ్యంలో బాధిత కుటుంబాలందరికీ ముఖ్యమంత్రి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు.

Advertisement
Advertisement