ఫేస్‌‘బుక్‌’ నకిలీ ఖాతాలతో జర జాగ్రత్త!

Fake Facebook Profiles Asking For Money, Beware Of Fake Facebook Accounts - Sakshi

నకిలీ ఖాతాలతో నిలువు దోపిడీ చేస్తున్న కేటుగాళ్లు

ఇతరుల ఫేస్‌బుక్‌ పేజీల్లోని ఫొటోలు కాపీ చేసి కొత్త అకౌంట్ల సృష్టి

కాంటాక్ట్స్‌ జాబితాలో ఉన్న వారందరికీ డబ్బులు అడుగుతూ పోస్టులు

ఫేస్‌బుక్‌ వేదికగా ఇటీవల జరుగుతున్న ఆర్థిక మోసాల్లో ఇదో రకం 

ఒకవైపు ప్రజలంతా కోవిడ్‌–19 మహమ్మారి భయంతో విలవిల్లాడుతున్న సమయంలోనే ఫేస్‌బుక్‌లో డబ్బులు అడిగే దందా మొదలైంది. ఇతరుల ఫేస్‌బుక్‌ పేజీల్లోని కవర్‌ ఫొటోలను నకలు చేసి అవే పేర్లతో కొత్త అకౌంట్లు సృష్టించడం, కాంటాక్ట్స్‌ జాబితాలో ఉన్న వారందరికీ డబ్బు అడుగుతూ పోస్టులు పెట్టడం. లేదా మెసెంజర్‌లో మెసేజ్‌లు పంపడం. ఇదీ ఈ సరికొత్త మోసం తీరూ తెన్ను. మన పేరుతో వేరే ఎవరో ఫేస్‌బుక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి డబ్బు అడుగుతున్నారని తెలిస్తే సరేసరి.. బంధు మిత్రులను హెచ్చరించి వారికి నష్టం కలగకుండా నివారించవచ్చు. తెలియకపోతేనే వస్తుంది సమస్య. అమాయకులు తమ డబ్బులు మోసగాళ్లకు సమర్పించుకోవాల్సి వస్తుంది.(చదవండి: వన్‌ప్లస్‌ ప్రియులకి గుడ్ న్యూస్

కరోనా సోకింది.. డబ్బులు కావాలి 
నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్లు సృష్టించి డబ్బులడిగే వారు.. అన్ని రకాల మార్గాల్లో ఇతరుల నుంచి డబ్బు గుంజేందుకు ప్రయత్నిస్తుంటారు. కోవిడ్‌–19 బారిన పడ్డామని, ఆసుపత్రిలో చికిత్సకు డబ్బులు కావాలనే కథలు అల్లేవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటారు. ఈ కారణాలతో బ్యాంక్‌ అకౌంట్‌లోకి జమ చేయమని చెప్పేవాళ్లు కొందరైతే.. ఈ వ్యాలెట్‌లోకి బదిలీ చేసినా చాలనే వాళ్లు ఇంకొందరు. రాజస్థాన్, బిహార్, కేరళ, ముంబైలతోపాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఐపీఎస్, ఐఏఎస్‌ అధికారుల పేర్లు, హోదాలతో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారంటేనే పరిస్థితి తీవ్రత ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు.

చాలా సందర్భాల్లో మిత్రులు ఫోన్  చేసి అంతా బాగేనా? డబ్బులు అడిగావేంటి? డబ్బులు పంపించా..చూసుకున్నావా? అని అడిగినప్పుడే మన పేరుతో ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ అయ్యిందన్న విషయం తెలుస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో ఆన్లైన్ లోనే మోసకారితో జరిపే సంభాషణ వాళ్లను పట్టిస్తోంది. మన భాషలో స్పందించక పోవడం... వచ్చీరాని ఇంగ్లిష్‌లో చాటింగ్‌ చేయడం అవతలి వ్యక్తి మోసగాడని గుర్తించేందుకు గట్టి నిదర్శనం.(చదవండి: ఇండియాలో 5జీ ఎప్పుడు రానుంది?

మన నిర్లక్ష్యమే కారణమా? 
ఫేక్‌ అకౌంట్లు తయారయ్యేందుకు ఒక రకంగా మనమే కారణమని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అకౌంట్‌లో మనం వాడే ఫొటోలు, పంచుకునే పోస్టులను బహిరంగంగా ఉంచడం వల్ల, వాటిని ఎవరైనా వాడుకునే అవకాశం కల్పించడం వల్ల ఇలా జరుగుతోందని సైబర్‌ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు మన ప్రొఫైల్‌ వివరాలను చూడకుండా చేసేందుకు ఫేస్‌బుక్‌ కల్పించిన అవకాశాన్ని సది్వనియోగం చేసుకోవాల్సి ఉందని వారు సూచిస్తున్నారు.  

ఫేక్‌ ఖాతాను ఇలా గుర్తించొచ్చు 
ఫేక్‌ అకౌంట్లను సులువుగా గుర్తించేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయని నిపుణులు తెలిపారు. స్నేహితుల సంఖ్య, సామాన్య మిత్రుల సంఖ్య ఫేక్‌ అకౌంట్ల గుర్తింపునకు ఒక మేలైన మార్గం. ఫేక్‌ అకౌంట్లలో సాధారణంగా మిత్రుల సంఖ్య తక్కువగా ఉంటుంది. నకిలీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌లోని ప్రొఫైల్‌ పేరును ఫేస్‌బుక్‌లో వెతికితే అది అసలైందో కాదో ఇట్టే తెలిసిపోతుంది. ప్రొఫైల్‌లో పొందుపరిచిన సమాచారం కూడా దొంగ అకౌంట్లను పట్టిస్తుంది.(చదవండి: మీ వై-ఫై స్పీడ్ పెంచుకోండి ఇలా?)

ఇలా చేసి ఖాతా క్లోజ్‌ చేయమనండి
మీ పేరు, వివరాలతో ఎవరైనా ఫేస్‌బుక్‌ అకౌంట్లు సృష్టించారని తెలిస్తే.. వెంటనే ఇలా చేయండి. ఆ ఫేక్‌ అకౌంట్‌ ప్రొఫైల్‌ను లేదా పేజీని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే కవర్‌ ఫొటో దిగువన మెసేజ్‌ అన్న నీలిరంగు బాక్స్‌కు పక్కన మూడు చుక్కలతో ఇంకో బాక్స్‌ కనిపిస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే... ‘‘సీ ఫ్రెండ్‌షిప్, ఫైండ్‌ సపోర్ట్‌ లేదా రిపోర్ట్‌ ప్రొఫైల్, బ్లాక్, సెర్చ్‌ ప్రొఫైల్‌’’ అన్న నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. ఫైండ్‌ సపోర్ట్‌ లేదా రిపోర్ట్‌ అన్న ఆప్షన్ ను క్లిక్‌ చేస్తే.. అందులో ప్రిటెండింగ్‌ టు బి సమ్‌వన్, ఫేక్‌ అకౌంట్, ఫేక్‌ నేమ్‌ వంటి అనేక ఆప్షన్లు కనిపిస్తాయి. ఇం కొకరి మాదిరి నటిస్తున్నాడు అన్న తొలి ఆప్షన్ ను క్లిక్‌ చేసి అకౌంట్‌ను మూసి వేయమని ఫేస్‌బుక్‌ను కోరవచ్చు.    

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top