Arvind Kejriwal: ఓటు ఎక్కడో.. వ్యాక్సిన్‌ అక్కడే

Delhi CM Announces Voting Booth Level Vaccination Drive - Sakshi

45 ఏళ్లు పైబడిన వారికి ఓటు వేసిన దగ్గరే వ్యాక్సినేషన్‌

ఢిల్లీలో కొత్త పథకం ప్రారంభం

ప్రతీ వారం 70 వార్డుల్లో వ్యాక్సినేషన్‌

4 వారాల్లో ఢిల్లీలోని 280 వార్డుల్లో ప్రక్రియ పూర్తిచేస్తామన్న కేజ్రీవాల్‌ 

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జరుగుతున్న వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా 45 ఏళ్లు పైబడిన వారి కోసం ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి రెండోదశను ప్రారంభించినప్పటికీ, ఇప్పటికీ అనేకమంది వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 45 ఏళ్లు పైబడిన వారి కోసం రాష్ట్రప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మీడియా సమావేశంలో కీలక ప్రకటన చేశారు. 45 ఏళ్ళ కంటే పైబడిన వారి కోసం ఎక్కడైతే ఓటు వేశారో అక్కడే వ్యాక్సినేషన్‌ అనే పథకాన్ని ప్రారంభించారు. ఈ డ్రైవ్‌లో భాగంగా ఎలాంటి వ్యాక్సిన్‌ కొరత లేకపోతే నాలుగు వారాల్లో రాష్ట్రంలోని 45 ఏళ్లు పైబడిన ప్రతి వ్యక్తికి వ్యాక్సిన్‌ వేయడం తమ లక్ష్యమని కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో 45 ఏళ్లు పైబడిన వారు  57 లక్షల మంది ఉండగా, అందులో 27 లక్షల మందికి ఫస్ట్‌ డోస్‌ ఇచ్చారు. మిగతా 30 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేయడంపై ఇప్పుడు దృష్టిపెట్టారు.

బూత్‌ స్థాయి అధికారి నేతృత్వంలో బృందాలు 
ఇటీవల ఢిల్లీలో వ్యాక్సినేషన్‌ కేంద్రాలకు వచ్చే వారి సంఖ్య చాలా తగ్గడం పెద్ద సమస్యగా మారింది. సరైన సంఖ్యలో వ్యాక్సినేషన్‌కు ప్రజలు ముందుకు రాకపోవడంతో డోస్‌లు మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ప్రజల ఇళ్లకు వెళ్ళి వారు ఎక్కడైతే ఓటు వేశారో.. అక్కడే వారికి వ్యాక్సిన్‌ వేసేందుకు ఏర్పాటు చేశామని బూత్‌ లెవల్‌ ఆఫీసర్ల బృందాలు ప్రజలకు తెలియజేస్తాయి. పోలింగ్‌ కేంద్రాలు సాధారణంగా ఇంటి నుంచి నడక దూరంలో ఉంటాయి కాబట్టి ఈ బ్లూప్రింట్‌ను సిద్ధం చేసామని కేజ్రీవాల్‌ తెలిపారు.

సోమవారం నుంచి 70 వార్డుల్లో ఈ డ్రైవ్‌ ప్రారంభమైంది. రాష్ట్రంలో మొత్తం 272 వార్డులు ఉండగా, వార్డులు లేని రెండు శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రచారంలో ప్రతి వారం 70 వార్డుల చొప్పున నిర్వహించి నాలుగు వారాల్లో మొత్తం  డ్రైవ్‌ పూర్తి చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సౌలభ్యం కోసం ఈ–రిక్షాలను కూడా ఏర్పా టు చేశామని కేజ్రీవాల్‌ తెలిపారు.. వ్యాక్సిన్‌ పొం దాలనుకునే వారిని పోలింగ్‌స్టేషన్‌ వరకు ఈ–రిక్షా లో తీసుకువస్తారు.

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఇలా...
వారం ప్రారంభంలో బూత్‌స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తారు. ఈ అధికారులు తమ ప్రాంతంలోని ప్రతి ఇంటి వెళ్ళి అక్కడ 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సినేషన్‌ జరిగిందా లేదా తెలుసుకుంటారు.  వ్యాక్సిన్‌ వేయించుకోని వారు ఉంటే వారికి స్లాట్‌ కేటాయించి ఆ సమయంలో పోలింగ్‌ కేంద్రానికి వచ్చి వ్యాక్సిన్‌ వేయించుకోవాలని కోరుతారు. ఎవరైనా నిరాకరిస్తే అలాంటి వారిని బూత్‌ స్థాయి అధికారి ఒప్పించటానికి ప్రయత్నిస్తారు. ప్రతీ బూత్‌స్థాయి అధికారితో పాటు ఇద్దరు లేదా ముగ్గురు సివిల్‌ డిఫెన్స్‌ వాలంటీర్ల బృందం ఉంటుంది.

(చదవండి: బెంగళూరు ఎయిర్‌పోర్టులో పేలుడు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top