పాక్‌లో భారత మిస్సైల్‌ ప్రమాదం.. రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక ప్రకటన

Defence Minister Rajnath Singh On Accidental Missile Fire - Sakshi

పాకిస్థాన్‌ భూభాగంలోకి భారత్‌ మిస్సైల్‌ దూసుకెళ్లిన ఘటన రచ్చ రేపిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వంకతో పాక్‌, భారత్‌పై రెచ్చిపోయి ఆరోపణలు చేయగా.. భారత్‌ మాత్రం పొరపాటున జరిగిందంటూ కూల్‌గా తప్పు ఒప్పేసుకుంది. ఈ తరుణంలో Missile Mishap మిస్సైల్‌ ఘటనపై పార్లమెంట్‌ సాక్షిగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరణ ఇచ్చారు.  

మంగళవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ.. మార్చి 9న రాత్రి ఏడు గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని వివరించారు. మిస్సైల్‌ యూనిట్‌లో రోజూవారీ తనిఖీలు నిర్వహిస్తుండగా.. పొరపాటున ఒక మిస్సైల్‌ దూసుకెళ్లింది. తర్వాతే అది పాక్‌ భూభాగంలో పడిందని తెలిసింది. ఈ ఘటన జరగడం విచారకం. కానీ, ఎలాంటి నష్టం జరగనందుకు సంతోషం. పాక్‌ ఆరోపిస్తున్నట్లు ఈ ఘటనను.. మేం తమాషాగా చూడట్లేదు. మా ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్‌గా తీసుకుంది. అందుకే పొరపాటు ఎలా జరిగిందోత తెలుసుకునేందుకు.. అత్యున్నత విచారణకు ఆదేశించాం. విచారణ జరిగితే.. అసలు కారణం ఏంటో తెలిసేది’’ అని రాజ్‌నాథ్‌ తెలిపారు. 

ఈ ఘటనతో భారత క్షిపణి వ్యవస్థపై అనుమానాలు అక్కర్లేదన్న రక్షణ మంత్రి.. అది అత్యంత సురక్షితమైనదని సభకు హామీ ఇచ్చారు. ‘‘మా భద్రతా విధానాలు, ప్రోటోకాల్‌లు అత్యధిక క్రమాన్ని కలిగి ఉంటాయి. ఎప్పటికప్పుడు సమీక్షించబడతాయి. మన సాయుధ దళాలు సుశిక్షితమైనవి అని స్పష్టం చేశారు. 

2005 ఒప్పందం ప్రకారం.. ఇరు దేశాల క్షిపణి  పరీక్షలు గనుక నిర్వహిస్తే.. మూడు రోజుల ముందు తెలియజేయడంతో పాటు, ఇరు దేశాలకు ఇబ్బందులు తలెత్తకుండా, నష్టం జరగకుండా నిర్ణీత వ్యవధిలోనే ఆ పరీక్షలను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కానీ, గత బుధవారం సాయంత్రం సిస్రా(హర్యానా) వైపు నుంచి సూపర్‌సోనిక్‌ మిస్సైల్‌ ఒకటి 124 కిలోమీటర్ల అవతల పాక్‌ సరిహద్దులో కూలింది. మియా చన్ను సమీపంలో అది పడిపోయిందని, ఇది పాకిస్తాన్ గగనతలాన్ని ఉల్లంఘించడమే అని భారత్‌పై ఆగ్రహం వెల్లగక్కింది పాకిస్థానీ వైమానిక దళానికి చెందిన ఎయిర్ డిఫెన్స్ ఆపరేషన్స్ సెంటర్. అయితే ఈ ఘటన ప్రమాదవశాత్తూ జరిగిందని పాక్‌ ఆరోపణల తర్వాత భారత్‌ వివరణ ఇచ్చుకుంది.

భారత్‌ చెప్పింది కదా

పాక్‌ భూభాగంలోకి మిస్సైల్‌ దూసుకెళ్లిన ఘటనపై అమెరికా స్పందించింది. అది ప్రమాదం అని భారత్‌ చెప్పింది కదా.. పైగా దర్యాప్తునకు ఆదేశించింది. మరేం ఉద్దేశాలు ఉండకపోవచ్చనేం భావిస్తున్నాం. ఇంతకు మించి ఈ పరిస్థితుల్లో ఏం చెప్పలేం. అని భద్రతా కార్యదర్శి నెడ్‌ ప్రైస్‌ మీడియాకు తెలిపారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top