ఎండ కన్నా డేంజర్.. తేమ తాపం | Comparing existing heat wave indices in identifying dangerous heat wave outdoor conditions | Sakshi
Sakshi News home page

ఎండ కన్నా డేంజర్.. తేమ తాపం

Apr 3 2026 4:13 AM | Updated on Apr 3 2026 4:15 AM

Comparing existing heat wave indices in identifying dangerous heat wave outdoor conditions

‘ప్రకటించే వేడి’ కన్నా ‘ఫీలయ్యే హీట్‌’ ప్రమాదకరం 

అధిక ఎండ + గాలిలో అధిక తేమ = యమ డేంజర్‌  

వడగాడ్పు రోజు ప్రకటనకు అధిక ఉష్ణోగ్రతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్న ఐఎండీ  

ఉష్ణోగ్రతతోపాటు గాలిలో సాపేక్ష తేమను కూడా జోడించి లెక్కిస్తేనే వాస్తవంగా అనుభవంలోకి వచ్చే తాపం తీవ్రత ఎంతో తెలుస్తుందంటున్న నిపుణులు

దేశంలో మనకు తెలియకుండానే మన మనుగడకు ప్రమాదకరమైన స్థాయికి దగ్గరగా ఉన్న అధిక ఉష్ణోగ్రతలను ఇప్పటికే అనుభవిస్తున్నామా? హీట్‌ వేవ్‌ (వడగాడ్పుల) ముప్పును లెక్కగట్టేటప్పుడు ఒక్క ఉష్ణోగ్రతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటూ ప్రమాదకరమైన వేడి ముప్పును ముందుగా తెలుసుకోలేకపోతున్నామా?

అధిక ఉష్ణోగ్రతతోపాటు అప్పటి గాలిలో సాపేక్ష తేమ (రిలేటివ్‌ హ్యుమిడిటీ) శాతాన్ని కూడా కలిపి లెక్కించటం  ప్రారంభించాలి. వాస్తవికమైన మనం ఫీలయ్యే వేడి ముప్పు తీవ్రతను ముందుగా గుర్తించటానికి, సహాయక చర్యల సన్నద్ధతను పెంచుకోవటానికి ఇది అవసరమని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి.      – సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

వెట్‌–బల్బ్‌ ఉష్ణోగ్రత అంటే? 
ఉష్ణోగ్రతతోపాటు గాలిలో సాపేక్ష తేమను కూడా పరిగణనలోకి తీసుకోవటాన్ని వెట్‌–బల్బ్‌ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు. వేడి ఒత్తిడి అంచనాలో ఉష్ణోగ్రతతోపాటు గాలిలో తేమను కలపటం ఎందుకు అంటే.. వేడి వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చెమట పడుతుంది. వేడిని తట్టుకునే ప్రక్రియలో చెమట శరీరానికి ఉపయోగపడుతుంది. చర్మంపై నుంచి చెమట ఎంతగా ఆవిరైపోతోందనే దానిపై ఈ ప్రక్రియ ఎంత సమర్థవంతంగా జరుగుతోందనేది ఆధారపడి ఉంటుంది.

గాలిలో అధిక తేమ ఉన్న పరిస్థితిలో, శరీరం సహజ శీతలీకరణ యంత్రాంగానికి అంతరాయం కలుగుతుంది. చెమట ఆవిరి కానప్పుడు, శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇది తీవ్రమైతే అలసట, వడదెబ్బ తగులుతాయి. తీవ్రమైన సందర్భాల్లో మరణానికి దారితీస్తుంది. వేడి, తేమ వల్ల కలిగే ఈ మిశ్రమ ఒత్తిడిని వెట్‌–బల్బ్‌ ఉష్ణోగ్రత ద్వారా అంచనా వేస్తారు. వాతావరణ ప్రజారోగ్య స్థితిగతుల అంచనాల్లో ఇదొక కీలకమైన కొలమానమైనా, మన దేశంలో ఇంకా తక్కువగానే ఉపయోగిస్తున్నారు.  

ఉష్ణోగ్రత కన్నా తేమే ముఖ్యం
కేంద్ర భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి డాక్టర్‌ ఎం.నాయర్‌ రాజీవన్‌ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఈ విషయంపై ఇలా అన్నారు.. ‘ప్రస్తుతం మనం తేమ ప్రభావాలపై తగినంత శ్రద్ధ పెట్టటం లేదు. కానీ మన ఆరోగ్యంపై ప్రభావం విషయానికి వస్తే, పెరుగుతున్న ఉష్ణోగ్రతతోపాటు తేమ కూడా అంతే ముఖ్యమైనది లేదా అంతకంటే ఎక్కువ ముఖ్యమైనది’.  

‘డ్రై హీట్‌’ ఒక్కటే ప్రామాణికమా? 
 భారతీయ వాతావరణ శాఖ (ఐఎండీ) నిర్దేశించే ప్రాథమిక ప్రమాణాల ప్రకారం.. మైదాన ప్రాంతాల్లో 40 (కొండ ప్రాంతాల్లో 30, కోస్తా తీర ప్రాంతాల్లో 37) డిగ్రీల సెల్సియస్‌ దాటితేనే ప్రస్తుతం వడగాడ్పు (హీట్‌వేవ్స్‌)ను అధికారికంగా ప్రకటిస్తున్నారు.  
ఈ స్థాయి కన్నా 4.5–6.4 డిగ్రీల మేరకు ఉష్ణోగ్రత పెరిగితే ‘వడగాడ్పు’రోజుగా, 6.4 డిగ్రీల కన్నా పెరిగితే ‘తీవ్ర వడగాడ్పు’రోజుగా ప్రకటిస్తున్నారు.  
అయితే, ఉష్ణోగ్రతతోపాటు గాలిలోని సాపేక్ష తేమను ప్రాథమిక ప్రమాణంగా ఐఎండీ పరిగణనలోకి తీసుకోవడం లేదు. హీట్‌వేవ్స్‌ ప్రకటనకు సాపేక్ష తేమను ఐఎండీ ప్రాథమిక ప్రమాణంగా కాకుండా సెకండరీ విషయంగానే పరిగణించటం వల్ల ఈ ముప్పు ప్రాణాంతకంగా మారుతోంది. దీన్ని ‘డ్రై హీట్‌’ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతి అంటారు.

 పగటి ఉష్ణోగ్రత ఐఎండీ ప్రమాదకరమని భావించినంత పెరగనప్పుడు కూడా, గాలిలోని అధిక సాపేక్ష తేమ వల్ల, ప్రజలు ప్రమాదకరమైన వడగాడ్పుల ముప్పును అనుభవిస్తున్నారు. ఇంట్లో ఉన్నా, వృద్ధులు, పిల్లలతోపాటు ఆరుబయట పనిచేసే వారు వడదెబ్బకు గురవుతున్నారు.  
గాలిలో తేమ శాతం సాధారణంగా ఎక్కువగా ఉండే కోస్తా తీర ప్రాంతాల్లో, కాంక్రీటు అరణ్యాలుగా మారిన నగర, పట్టణ ప్రాంతాల్లో వాతావరణ మార్పు నేపథ్యంలో ఈ ముప్పు పెరుగుతోంది. హీట్‌ స్ట్రోక్‌ మరణాలు ఎక్కువ కావటానికి ఇదొక ముఖ్య కారణంగా చెబుతున్నారు. 

వడగాడ్పుల ప్రభావం ప్రజలపై ఉన్నా, అధికారికంగా ప్రకటించనందున, ప్రభుత్వ యంత్రాంగంలో, ప్రజల్లో సంసిద్ధత, అప్రమత్తత లోపిస్తోంది. నివారించదగిన వడగాడ్పు మరణాల రేటు పెరుగుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి.  
అంతేకాదు, బాధితులకు వైద్య సహాయంలో, సహాయక చర్యల్లో, వడగాడ్పు మృతులకు పరిహారం చెల్లింపుల్లోనూ ఇది ప్రతిబంధకంగా మారుతోంది. డ్రై హీట్‌ పద్ధతికి బదులు వెట్‌–బల్బ్‌ ఉష్ణోగ్రత లెక్కింపు పద్ధతిని అనుసరించటమే దీనికి పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement