పేద మహిళలకు క్లైమేట్‌ బీమా | Climate Insurance for Poor Women | Sakshi
Sakshi News home page

పేద మహిళలకు క్లైమేట్‌ బీమా

Mar 19 2026 2:34 AM | Updated on Mar 19 2026 2:34 AM

Climate Insurance for Poor Women

వడగాడ్పులు, భారీ వర్షాల్లోపేద మహిళలు పనులు కోల్పోతే బీమా చెల్లింపులు

ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ‘పారామెట్రిక్‌ ఇన్సూరెన్స్‌’ అమలు

అసంఘటిత రంగాల్లో ఉపాధి పొందే పేద మహిళలు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా అభద్రతకు గురవుతున్నారు. తీవ్ర వడగాడ్పులు, భారీ వర్షాలు, తీవ్ర చలిగాలులు వీచే రోజుల్లో పనులకు వెళ్లలేకపోతే ఆదాయం ఉండదు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ పొట్ట తిప్పలకు పనులకు వెళ్లక తప్పని పరిస్థితుల్లో అనారోగ్యాల పాలవుతున్నారు. వీరికి ఆదాయ, ఆరోగ్య భద్రతను కల్పించడానికి కొన్ని రాష్ట్రాల్లో ‘పారామెట్రిక్‌ క్లైమేట్‌ ఇన్సూరెన్స్‌’ను అమలు చేస్తున్నారు. – (సాక్షి స్పెషల్‌ డెస్క్‌)

పారామెట్రిక్‌ క్లైమేట్‌ ఇన్సూరెన్స్‌ అంటే..
ఈ పని బీమా పాలసీ తీసుకున్న వారికి మాత్రం.. వేడి, చలి, వాన ఒక పరిమితికి మించితే చాలు వీరు పనికి వెళ్లకుండా ఇంటి పట్టునే భద్రంగా ఉంటూ బీమా పరిహారం పొందొచ్చు. వాతావరణం మామూలుగా ఉంటేనే పేద మహిళలకు రోజువారీ పనులు సజావుగా దొరుకుతాయి. వాతావారణంలో ఏ మాత్రం తేడా వచ్చినా వారికి పని ఉండదు. పట్ట ణ / గ్రామీణ ప్రాంతాల్లో భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బండ్లు/ నెత్తిమీద బుట్టలు పెట్టుకొని సరుకులు అమ్ముకునే వారు, చిరు వ్యాపార సంస్థల్లో పనిచేసే వారు, చిన్నాచితకా కూలి పనులు, వ్యవసాయ మహిళా కార్మికులకు రెక్కాడితే గాని డొక్కాడదు. 

ప్రమాదకర వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ పని మానితే ఆదాయం పోతుందన్న బెంగతో పనులు కొనసాగిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ ఉంటారు. ఇటువంటి వారికి ఆదాయ భరోసా ఇవ్వటానికి ప్రారంభమైనదే పారామెట్రిక్‌ క్లైమేట్‌ ఇన్సూరెన్స్‌.

అనేక రాష్ట్రాల్లో అమలు
పారామెట్రిక్‌ క్లైమేట్‌ ఇన్సూ్యరెన్స్‌ను తొలుత అమలు చేసిన రాష్ట్రం నాగాలాండ్‌. కేరళలో పాల సహకార మార్కెటింగ్‌ సమాఖ్య 1,500 ఎంఎంకి మించి అధిక వర్షపాతం వల్ల పనిదినాలు కోల్పోయే వారికి బీమా అమలు చేస్తోంది. గుజరాత్‌లో ఈ బీమా పథకాన్ని నేషనల్‌ ఇన్సూ్యరెన్స్‌ వైమో సేవ కోఆపరేటివ్‌ లిమిటెడ్‌ అనే సహకార బీమా సంస్థ అమలు చేస్తోంది. ఆహ్మదాబాద్, పరిసర జిల్లాల్లో 2023 ఏప్రిల్‌లో వైమో సేవ సంస్థ ఈ బీమాను తొలుత అమలు ప్రారంభించింది. 2024 నాటికి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్ లలోని 22 జిల్లాలో 50 వేల మంది 18–70 ఏళ్ల మధ్య వయసు మహిళలకు ఈ బీమా కల్పించారు. 

» వడగాడ్పుల బీమా ప్రీమియంగా ప్రతి మహిళ రూ.350 ప్రీమియం చెల్లించాలి. 43.2 డిగ్రీల సెల్సియస్‌కు మించి ఉష్ణోగ్రత ఎన్ని రోజులు పెరిగితే అన్ని రోజులకు ఒకరికి రోజుకు రూ.400 చొప్పున (అత్యధికంగా రూ. 3 వేలు) పరిహారంగా చెల్లిస్తున్నారు. 
» 45.28 అంగుళాలకు మించి వర్షపాతం వల్ల పనులు కోల్పోయినా పరిహారం ఇచ్చే బీమాను కూడా అమలు చేస్తున్నారు. ప్రీమియం రూ.425. అత్యధికంగా రూ. 7 వేల వరకు పరిహారం చెల్లిస్తున్నారు. 
» ఉష్ణోగ్రత, వర్షపాతం పెరుగుతున్న కొద్దీ పరిహారం తదనుగుణంగా పెరుగుతుంది.

పారామెట్రిక్‌ బీమా అవసరం ఏమిటి?
» 2023లో కనీవిని ఎరుగనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిన విషయం గుర్తుంది కదా. దాదాపు వంద రోజుల పాటు ఒక మోస్తరు వడగాడ్పులు వీచాయి. ఆరుబయట పనులు, శారీరక శ్రమ ఎక్కువగా ఉండే పనులు చేయటం ప్రమాదకరంగా మారింది. 2024, 2025లలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 
» ఆ ఏడాది అతి ఉష్ణం వల్ల మన దేశం 18,100 కోట్ల పని గంటలు కోల్పోయింది. తద్వారా రూ. 13 లక్షల కోట్ల నష్టం వాటిల్లిందని లాన్సెట్‌ అంచనా వేసింది. 
» మహిళలు ఎక్కువ క్లైమేట్‌ రిస్క్‌కు గురవుతుంటారు. గర్భస్రావాలు లేదా నెలలు నిండకుండానే ప్రసవించటం వంటి ఉపద్రవాలను ఎదుర్కొంటూ ఉంటారు. 
» మన దేశంలో ఆదాయం కోసం పనిచేసే మహిళల్లో 92% మంది చిన్నా చితకా రోజువారీ పనులు చేసుకొని పొట్టపోసుకునేవారే. 
» ప్రతికూల వాతావరణం వల్ల మహిళల సారథ్యంలోని కుటుంబాలు ఎక్కువగా ఆదాయాన్ని కోల్పోతున్నాయని ప్రపంచవ్యాప్త అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక పరిమితికి మించి 1 డిగ్రీ సెల్సియస్‌ ఉష్ణోగ్రత పెరిగితే మహిళ సారథ్యంలోని కుటుంబానికి 34% ఆదాయం తగ్గిపోతోందని ఐరాస ఆహార–వ్యవసాయ సంస్థ(ఎఫ్‌ఏఓ–2024) అంచనా. 
» ఎండాకాలంలో 97% మంది అసంఘటిత రంగ మహిళా కార్మికుల ఆదాయం తగ్గిపోతోంది. వేడి వల్ల పని సామర్థ్యం తగ్గిపోవటంతో 20–25% రోజువారీ ఆదాయం తగ్గిపోతోందని సర్వే నివేదికలు చెబుతున్నాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement