న్యూఢిల్లీ: లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు నేడు వెలువడే అవకాశం ఉంది. 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి 12వ తరగతి ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌సీ)CBSE) మే 11న విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. డిజీలాకర్ నుంచి అందిన తాజా సంకేతాలు విద్యార్థుల్లో ఉత్కంఠను రెట్టింపు చేస్తున్నాయి. ఫలితాల ప్రకటనకు సంబంధించి బోర్డు తుది ఏర్పాట్లను పూర్తి చేసింది.
ఫలితాల వెల్లడి.. అధికారిక వేదికలు ఇవే
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు వెలువడగానే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ల ద్వారా తమ మార్కులను వేగంగా తెలుసుకోవచ్చు. ప్రధానంగా cbse.gov.in, results.cbse.nic.in వెబ్‌సైట్లలో ఫలితాలు అందుబాటులో ఉంటాయి. వెబ్‌సైట్లతో పాటు, విద్యార్థుల సౌకర్యార్థం Digilocker, UMANG App ద్వారా కూడా స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకునే వీలు కల్పించారు. ఫలితాల విడుదల సమయంలో వెబ్‌సైట్లపై ట్రాఫిక్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ప్రత్యామ్నాయ యాప్‌లను ముందే ఇన్‌స్టాల్ చేసుకోవడం ఉత్తమం.
స్కోర్‌కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..
ఫలితాలను చెక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సులభం. మొదట అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, హోమ్ పేజీలో కనిపించే 'CBSE Class 12 Result 2026' లింక్‌పై క్లిక్ చేయాలి. అక్కడ అడిగిన వివరాలైన రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ వివరాలను సమర్పించిన వెంటనే మీ స్కోర్‌కార్డ్ పిడిఎఫ్ రూపంలో స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది. భవిష్యత్తు ఉన్నత విద్యా ప్రవేశాల కోసం దాన్ని సేవ్ చేసుకోవడంతో పాటు ఒక ప్రింటౌట్ తీసుకోవడం మర్చిపోవద్దు.
డిజీలాకర్ అప్‌డేట్.. తుది దశలో ప్రక్రియ
ఈ ఏడాది ఫలితాల ప్రకటనపై డిజీలాకర్ సోషల్ మీడియా వేదికగా కీలక సూచనలు అందించింది. ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయని అధికారికంగా పేర్కొనడంతో, మే 11నే ప్రకటన ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది.


