వ్యభిచారం నేరం కాదు.. ఆ ప్రొవిజన్‌ లేదు: బాంబే హైకోర్టు

Bombay HC Says Women Have Right Choose Vocation Prostitution Case - Sakshi

నచ్చిన వృత్తి చేపట్టే హక్కు వాళ్లకు ఉంది

ముంబై: వ్యభిచారం నేరమని ఏ చట్టంలోనూ లేదని, తమకు నచ్చిన వృత్తిని ఎంచుకునే హక్కు మహిళలకు ఉందని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. వారి అభీష్టానికి వ్యతిరేకంగా నిర్బంధం విధించడం సరికాదని పేర్కొంటూ, ముగ్గురు మహిళలకు విముక్తి కల్పించింది. ఈ మేరకు జస్టిస్‌ పృథ్వీరాజ్‌ చవాన్‌ మానవ అక్రమ రవాణా(నిరోధక) చట్టం గురించి గురువారం కీలక వ్యాఖ్యలు చేశారు. గతేడాది వ్యభిచారం కేసులో పట్టుబడిన ముగ్గురు యువతులను వుమెన్‌ హాస్టల్‌కు తరలించమని ఆదేశించిన దిగువ కోర్టు నిర్ణయం సరికాదని పేర్కొన్నారు. ‘‘ పీఐటీఏ-1956లో వ్యభిచారాన్ని రద్దు చేయమని ఎక్కడా చెప్పలేదు. దానిని శిక్షార్హమైన నేరంగా పేర్కొంటూ ఎటువంటి ప్రొవిజన్‌ లేదు. ఇలాంటి కేసుల్లో పట్టుబడిన వాళ్లకు శిక్ష విధించాలన్న నిబంధన ఏమీ లేదు’’ అని జస్టిస్‌ చవాన్‌ వ్యాఖ్యానించారు.(చదవండి: 14 ఏళ్ల ఆ బాలికకు మానసిక పరిపక్వత ఉంది..)

అయితే అదే సమయంలో.. ‘‘ఒక మనిషిని మోసం చేసి, స్వప్రయోజనాల కోసం దోపిడీకి పాల్పడితే మాత్రం అది కచ్చితంగా శిక్షించదగ్గ నేరమే’’ అని స్పష్టం చేశారు. పిటిషనర్లు(బాధితులు) మేజర్లని, వారికి నచ్చిన చోట ఉంటారంటూ దిగువ కోర్టు ఉత్తర్వులు రద్దు చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎక్కడైనా నివసించే, నచ్చిన వృత్తిని చేపట్టే హక్కు ఉందని పేర్కొంటూ, తక్షణమే వారికి విముక్తి కల్పించాల్సిందిగా ఆదేశించారు. సదరు యువతులు అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే వారు ఎక్కడ ఉండాలో నిర్ణయిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. సదరు యువతులు, వ్యభిచార వృత్తిని జీవనోపాధిగా మలచుకున్న సామాజిక వర్గానికి చెందిన వారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిందని జస్టిస్‌ చవాన్‌ పేర్కొన్నారు.

పూర్తిగా తెలుసుకోవాల్సింది
అదే విధంగా సోదాలు నిర్వహించిన తీరు గురించి మాట్లాడుతూ.. విటుడు వ్యభిచార గృహం నడుపుతున్నాడా లేదా మానవ అక్రమ రవాణా చేస్తున్నాడా అన్న అంశం గురించి కూడా స్పష్టంగా నివేదికలో పేర్కొనాల్సిందని అభిప్రాయపడ్డారు. కాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌కు చెందిన ముగ్గురు యువతులు(20,22,23) గతేడాది మలాద్‌లోని ఓ గెస్ట్‌హౌజ్‌లో పోలీసులు నిర్వహించిన రైడ్‌లో పట్టుబడ్డారు. వారిని బాధితులుగా పేర్కొంటూ, విటుడిని అరెస్టు చేసి పీఐటీఏ కింద కేసు నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో కేసును విచారించిన దిందోషి సెషన్స్‌ కోర్టు, వారిని మహిళల వసతి గృహానికి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే సదరు యువతులు అశోక్‌ సరోగీ అనే న్యాయవాది ద్వారా హైకోర్టును ఆశ్రయించి, తమకు విముక్తి కల్పించాల్సిందిగా అభ్యర్థించారు. తమ తల్లుల దగ్గరకు వెళ్లేందుకు దిగువ కోర్టు అనుమతినివ్వలేదని, తమ సామాజిక వర్గం ఈ వృత్తితోనే జీవనోపాధి పొందుతోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వారి పిటిషన్‌ను స్వీకరించిన ఏకసభ్య ధర్మాసనం ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top