బిగ్‌ బ్రేకింగ్‌: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం | BJP Government In Bengal To Take Oath On May 9 | Sakshi
Sakshi News home page

బిగ్‌ బ్రేకింగ్‌: 9న బీజేపీ ప్రమాణ స్వీకారం

May 5 2026 12:06 PM | Updated on May 5 2026 12:14 PM

BJP Government In Bengal To Take Oath On May 9

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో నూతన ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల కమ్యూనిస్ట్, తృణమూల్ కాంగ్రెస్ పాలనకు తెరదించుతూ, రాష్ట్రంలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. సాంస్కృతిక, రాజకీయ ప్రాముఖ్యతను మేళవిస్తూ.. నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి రోజైన మే 9న బీజేపీ కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేయనుందని విశ్వసనీయ సమాచారం.

మోదీ చెప్పినట్లే..
మే 9న రాష్ట్రంలో కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార మహోత్సవం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమిక్ భట్టాచార్య తెలిపారు. బరాక్‌పూర్‌లో జరిగిన చివరి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాల తర్వాత మే 4న తాను తిరిగి వస్తానని, బీజేపీ ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ చారిత్రక విజయం తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని మోదీ.. రవీంద్రనాథ్ ఠాగూర్ కలలుగన్న ‘భయమెరుగని, తల ఎత్తుకుని జీవించే సమాజాన్ని’ బెంగాల్‌లో నిర్మిస్తామని అన్నారు.

అధికార మార్పిడి ప్రక్రియ ప్రారంభం
బెంగాల్‌లో అధికార మార్పిడికి సంబంధించిన రాజ్యాంగ ప్రక్రియలు వేగవంతమయ్యాయి. కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారులు ఎస్.బి.జోషి, సుజిత్ కుమార్ మిశ్రా ఈరోజు (మే 5) ఢిల్లీ నుంచి కోల్‌కతా చేరుకొని, ఎన్నికల ఫలితాల అధికారిక గెజిట్‌ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) మనోజ్ కుమార్ అగర్వాల్‌కు అందజేయనున్నారు. అనంతరం మే 6న సీఈవో.. రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికి లాంఛనంగా వివరాలు అందిస్తారు. ఆ వెంటనే రాజ్యాంగ నిబంధనల ప్రకారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని మమతా బెనర్జీని గవర్నర్ ఆహ్వానిస్తారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని ఆమెను కోరనున్నారు.

బెంగాలీల మనోభావాలకు పెద్దపీట
మే 9వ తేదీని ఎంచుకోవడం వెనుక బలమైన కారణం ఉంది. బెంగాలీలు అత్యంత ముఖ్యమైనదిగా భావించే ‘పొచిషే బోయిశాఖ్’ (రవీంద్ర జయంతి) రోజున ప్రమాణస్వీకారం చేయడం ద్వారా స్థానికుల మనోభావాలకు బీజేపీ పెద్దపీట వేసింది. ఠాగూర్ జయంతి బెంగాల్‌లో కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, అది వారి సంస్కృతిలో భాగం. నాలుగున్నర దశాబ్దాల వామపక్ష, టీఎంసీ పాలనకు ముగింపు పలుకుతూ రాబోతున్న ఈ పరిణామం బెంగాల్ రాజకీయ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనున్నది.

Advertisement
 
Advertisement
Advertisement